Share News

ఎక్కడ చూసినా చెత్తే

ABN , Publish Date - May 10 , 2026 | 12:37 AM

Garbage is lying next to the roads ఇంటింటా చెత్త సేకరణ పేరుతో గ్రామాలు శుభ్రం అవుతున్నాయే.. తప్ప రహదారులు మాత్రం దారుణంగా మారుతున్నాయి. రహదారుల పక్కన ఎక్కడ చూసినా చెత్తాచెదారాలు దర్శనమిస్తున్నాయి. చెత్తసంపద కేంద్రాలకు వ్యర్థాలను అసలు తరలించడం లేదు. చెత్త సంపద కేంద్రాలను అందుబాటులోకి తేవాలని పంచాయతీ కార్యదర్శులను అధికారులు ఆదేశిస్తున్నా.. ఫలితం లేకపోతోంది.

ఎక్కడ చూసినా చెత్తే
కొఠారి గ్రామం వద్ద రోడ్డుపైనే చెత్త

  • ఇష్టారాజ్యంగా రహదారుల పక్కనే పారబోత

  • సంపద తయారీ కేంద్రాలకు తరలించని వ్యర్థాలు

  • ప్రజలకు తప్పని ఇబ్బందులు

  • ఇచ్ఛాపురం, మే 9(ఆంధ్రజ్యోతి):

  • ఇంటింటా చెత్త సేకరణ పేరుతో గ్రామాలు శుభ్రం అవుతున్నాయే.. తప్ప రహదారులు మాత్రం దారుణంగా మారుతున్నాయి. రహదారుల పక్కన ఎక్కడ చూసినా చెత్తాచెదారాలు దర్శనమిస్తున్నాయి. చెత్తసంపద కేంద్రాలకు వ్యర్థాలను అసలు తరలించడం లేదు. చెత్త సంపద కేంద్రాలను అందుబాటులోకి తేవాలని పంచాయతీ కార్యదర్శులను అధికారులు ఆదేశిస్తున్నా.. ఫలితం లేకపోతోంది. చాలాచోట్ల చెత్తసంపద కేంద్రాలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. జిల్లాలోని 912 పంచాయతీల్లో 18,91,087 మంది జనాభా ఉన్నారు. 733 చెత్త సంపద తయారీ కేంద్రాలు ఉన్నాయి. పంచాయతీల్లో చెత్త సేకరణకు 1759 ట్రైసైకిళ్లు, 107 ట్రాక్టర్లు సైతం సమకూర్చారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకూ గ్రామాల్లో ప్రతి ఇంటా చెత్త సేకరించాలి. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సంపద కేంద్రాలకు తరలించాలి. 143 రకాల ప్లాస్టిక్‌ సామగ్రిని వేర్వేరు చేసి.. రీ సైకిల్‌ చేయాలి. అయితే ఒక్క చెత్త సేకరణతో చేతులు దులుపుకుంటున్నారు. గ్రామాల్లో ఉండే చెత్తను రోడ్లపైకి తెచ్చి పారబోస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చెత్తనిల్వలు పేరుకుపోయిన ప్రాంతాల్లో కుక్కలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి.. గ్రామాల్లో ఇంటింటా సేకరిస్తున్న వ్యర్థాలను చెత్త సంపద కేంద్రాలకు, డంపింగ్‌ యార్డులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

  • అన్నీ సమస్యలే..

  • జిల్లావ్యాప్తంగా 2,260 మంది క్లాప్‌మిత్రలను నియమించారు. ఇందులో ఇద్దరు చొప్పున ఇంటింటా చెత్త సేకరణ చేపట్టాలి. ఒక్కొక్కరు చొప్పున చెత్త సంపద కేంద్రాల వద్ద పనిచేయాలి. వీరికి నెలకు రూ.6వేల వేతనంగా నిర్ణయించారు. మునిసిపాలిటీల్లో చెత్త వాహనాల డ్రైవర్లకు రూ.18 వేల వేతనంగా నిర్ధారించారు. అయితే విధుల్లో చేరిన తరువాత రూ.12 వేలు మాత్రమే అందిస్తున్నారు. క్లాప్‌ మిత్రలు, డ్రైవర్లకు సక్రమంగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో ఆ ప్రభావం పనులపై పడుతోంది. పనులు చేసేందుకు క్లాప్‌మిత్రలు ముందుకు రావడం లేదు. తొలుత ప్రభుత్వమే నేరుగా ఏజెన్సీ ద్వారా జీతాలు చెల్లిస్తామని చెప్పుకొచ్చింది. కానీ తరువాత పంచాయతీలకు ఆ బాధ్యతలు అప్పగించింది. పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో కొన్నిచోట్ల వాహనాలు మూలకు వెల్లాయి. క్లాప్‌మిత్రలు సైతం మానేస్తున్నారు.

  • సంపద కేంద్రాలకు చెత్త తరలించాలి

  • గ్రామాల్లో ఇంటింటా సేకరించిన వ్యర్థాలను విధిగా చెత్త సంపద కేంద్రాలకు తీసుకెళ్లాలి. అవి వినియోగం లేని చోట మాత్రం డంపింగ్‌ యార్డులకు తరలించాలి. లేదంటే చర్యలు తప్పవు. ఇప్పటికే దీనిపై అన్ని మండలాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం.

    - స్వరూపరాణి, జిల్లా పంచాయతీ అధికారి, శ్రీకాకుళం

Updated Date - May 10 , 2026 | 12:37 AM