సర్వం సిద్ధం
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:22 AM
అరసవల్లి సూర్యనారాయణ స్వామి జయంతి (రథసప్తమి) ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది.
- నేటి నుంచి ‘రథసప్తమి’ సంబరాలు
- వారం రోజుల పాటు సాంస్కృతిక జాతర
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
శ్రీకాకుళం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామి జయంతి (రథసప్తమి) ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ఈ నెల 25 వరకు వారం రోజుల పాటు అంగరంగా వైభవంగా వేడుకలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, దేవదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.
కార్యక్రమాల వివరాలు..
సోమవారం నుంచి 24 వరకు ప్రతిరోజూ పర్యాటకులు, భక్తులను అలరించేలా కార్యక్రమాలను రూపొందించారు. 19, 20, 21 తేదీల్లో ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఉదయం క్రీడా పోటీలు, సాయంత్రం 5 గంటల నుంచి కేఆర్ స్టేడియంలో ఫుడ్ ఎగ్జిబిషన్, పిల్లల కోసం అమ్యూజ్‌మెంట్ పార్క్ అందుబాటులో ఉంటాయి.
22న ఉదయం ఏడు గంటలకు 80 ఫీట్ రోడ్డులో ‘మెగా సూర్య నమస్కారాలు’, సాయంత్రం ఐదు గంటల నుంచి కేఆర్ స్టేడియంలో భారతి రమేష్ ఆర్కెస్ట్రా, శ్రీసాయి శివ నృత్య కళానికేతన్, దుంపల ఈశ్వరరావు జానపద సంగీతం, మావుడూరి బ్రదర్స్ మ్యూజికల్ షో ఉంటాయి. రాత్రి 7 గంటల నుంచి పవన్ బ్యాండ్ మిమిక్రీతో పాటు ప్రముఖ గాయకుడు గోరెటి వెంకన్న గళం విప్పనున్నారు. అనంతరం జబర్దస్త్ టీమ్ (ఇమ్మాన్యుయేల్, నూకరాజు, రియాజ్, ఆసియా) కామెడీ షో, బాణసంచా ప్రదర్శన ఉంటుంది.
23న మధ్యాహ్నం 2 గంటలకు డే అండ్ నైట్ జంక్షన్ నుంచి అరసవల్లి వరకు భారీ శోభాయాత్ర. సాయంత్రం రాజు బ్రదర్స్ సాక్సోఫోన్, నీరజ సుబ్రహ్మణ్యం శాస్త్రీయ నృత్యం, ఆరోహి మ్యూజికల్ షోలు ఉంటాయి. సాయంత్రం ఏడు గంటలకు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో భారీ ‘డ్రోన్ షో’ ప్రదర్శన, రాత్రికి కేఆర్ స్టేడియంలో జబర్దస్త్ రామ్ ప్రసాద్ టీమ్ స్కిట్స్, యాంకర్ సౌమ్య రావు నిర్వహణలో ఖన్నా మాస్టర్ డాన్స్, పల్సర్ బైక్ రమణ జానపద గీతాలు, లేజర్ షో ప్రదర్శించనున్నారు.
24న సాయంత్రం ముగింపు వేడుకల్లో అక్ష ఖాన్, మణికంఠ, తేజస్విని, తన్మయి, గణపతి శర్మ, యామిని కర్రి ప్రదర్శన, రాత్రి 7 గంటలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ లైవ్ కాన్సర్ట్ హైలెట్‌గా నిలవనుంది. సినీ నటుడు ఆది, యాంకర్లు సాయికుమార్, చంద్రిక సందడి చేయనున్నారు.
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవతో ప్రసిద్ధ ‘సురభి’ నాటకాలను (శ్రీ వినాయక నాట్య మండలి) ఏర్పాటు చేశారు. జనవరి 19 నుంచి 23 వరకు రోజూ సాయంత్రం 6.30 గంటలకు అంబేడ్కర్ ఆడిటోరియంలో ప్రదర్శనలు ఉంటాయి.