అంతా జగన్ భజనే
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:38 AM
YCP's enthusiasm for 'Chalo Moolapet Port' ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు నిర్వహించిన ‘చలో మూలపేట పోర్టు’ కార్యక్రమం.. ఆద్యంతం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు భజనగానే సాగింది. సోమవారం సంతబొమ్మాళి మండలం నౌపడా మూడురోడ్లు కూడలిలో నిర్వహించిన ఈ కార్యక్రమం.. అబద్దాలు, అసత్య ప్రచారాలతోనే ముగిసింది.
‘చలో మూలపేట పోర్టు’లో వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం
పోర్టు పనులపై అసత్య ప్రచారం
రోడ్డుమీదే వాహనాలు.. ట్రాఫిక్ ఇబ్బదులు
టెక్కలి/సంతబొమ్మాళి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు నిర్వహించిన ‘చలో మూలపేట పోర్టు’ కార్యక్రమం.. ఆద్యంతం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు భజనగానే సాగింది. సోమవారం సంతబొమ్మాళి మండలం నౌపడా మూడురోడ్లు కూడలిలో నిర్వహించిన ఈ కార్యక్రమం.. అబద్దాలు, అసత్య ప్రచారాలతోనే ముగిసింది. మూలపేట పోర్టు పనులు తమ హయాంలో 30 శాతం జరిగాయని.. ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నా.. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రతి నాయకుడు కూడా 70శాతం పోర్టు పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి చేశారని కీర్తించారు. మిగిలిన 30 శాతం పనులు కూటమి ప్రభుత్వం పూర్తిచేయలేకపోయిందని విమర్శించారు. ఆ పార్టీ అధినేత మెప్పు కోసం అంతా జగన్ భజనే చేశారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ పూడి ముత్యాలరాజు, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీమంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్, గుడివాడ అమర్‌నాధ్, కన్నబాబు, రాజన్నదొర, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, శ్రీకాకుళం జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బొత్స సత్యనారాయణ మాట్లాడుతుండగా పలువురు కేకలు వేయడంతో తన ప్రసంగాన్ని విరమించారు. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతుండగా పలువురు కార్యకర్తలు కుర్చీలు ఖాళీచేసి వెళ్లిపోయారు. సమావేశం అనంతరం భోజనాల వద్ద కార్యకర్తలు వాదులాడుకోవడం, తోపులాటలు జరిగాయి.
భారీ బందోబస్తు
వైసీపీ.. ‘చలో మూలపేట పోర్టు’ కార్యక్రమం నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం నౌపడా మూడురోడ్లు కూడలి, పోర్టు పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏఎస్పీ కేవీ రమణ, విజయనగరం ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, గోవిందరావుతోపాటు పలువురు సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, పోలీసులు, స్పెషల్ పార్టీ, ఏఆర్ పార్టీ, మఫ్తీ బృందాలతో బందోబస్తు నిర్వహించారు. టెక్కలి రూరల్, అర్బన్ సీఐలు శ్రీనివాసరావు, విజయ్‌కుమార్, నౌపడా ఎస్‌ఐ నారాయణస్వామి బందోబస్తులో పాల్గొన్నారు.
రోడ్డుపైనే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు
వైసీపీ నాయకులు రోడ్డుపైనే వాహనాలు నిలిపేయడంతో.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. టెక్కలి వయా పూండీ-పలాస రహదారిలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నౌపడ రైల్వేగేటు నుంచి నౌపడ వెళ్లే రహదారిలో వాహనాలు నిలిపేశారు. దీంతో సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కొంతమంది విద్యార్థులు ఎండతీవ్రతకు సొమ్మసిల్లిపోయారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సైతం వాహనాలు వెళ్లే దారిలేక కొంతదూరం నడిచి.. వేదిక వద్దకు చేరుకున్నారు.
ఖాళీ కుర్చీలు..
‘చలో మూలపేట పోర్టు’ కార్యక్రమంలో.. వైసీపీ నేతలు ప్రసంగించిన సమయంలో చాలావరకు ఖాళీ కుర్చీలు కనిపించాయి. గ్యాలరీలో 2,500 మంది కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు అంతగా రాలేదు. వచ్చినవారిలో కొంతమంది కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో చాలా కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తూ.. సభ బోసిపోయింది. వైసీపీ తలపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి ఆశించిన స్పందన లభించలేదని తేలిపోయింది.