ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి
ABN , Publish Date - Jul 04 , 2026 | 11:23 PM
ఆరోగ్యంగా ఉన్న ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస, జూలై4 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యంగా ఉన్న ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. స్థానిక కార్మిక భవన్‌లో ఆ నలుగురు స్వచ్ఛంద సంస్థ ఎనిమిదో వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శిరీష పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తలసేమియా బాధితుల సహాయార్ధం రక్తదాన శిబిరాలు నిర్వహిం చడంపై నిర్వాహకులకు అభినందించారు. ఈ శిబిరంలో 35 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు పిచ్చుక పాపారావు, కోశాధికారి సానా ఈశ్వరరావు, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాస్, రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావుయాదవ్, టీడీపీ జిల్లా కార్యదర్శి గాలి కృష్ణారావు, కార్మికసంఘ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
టిడ్కో గృహ సముదాయం పరిశీలన..
స్థానిక కోసంగిపురం రోడ్డులో ఉన్న టిడ్కో గృహ సముదాయాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం పరిశీలించారు. ఎంత మేరకు పనులు పూర్తయ్యాయో కమిషనర్ శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పూర్తిదశలో ఉన్న గృహాలను లబ్ధి దారులకు అందిస్తామని, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
- గిరిజన, మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక టీడీపీ కార్యాలయంలో సీతంపేట ఐటీడీఏ, శ్రీకాకుళం మత్స్యశాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు మోపెడ్‌లు, ఐస్‌బాక్స్‌లు, చేపల వలలను ఆమె అందజేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ప్రతిభను బయటకు తీయాలి
కాశీబుగ్గ, జులై 4 (ఆంధ్రజ్యోతి): యువతలో దాగిఉన్న నాయకత్వ ప్రతిభను బయటకు తీయాలని ఎమ్మెల్యే శిరీష అన్నారు. కాశీబుగ్గ చిన్నబాడం హైస్కూల్‌లో శనివారం మేరా యువభారత్ (మైభారత్) నమోదు కార్యక్రమానికి సంబంధించి పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో మేరా యువ భారత్ జిల్లా యువజన అధికారి నిమ్మల కృష్ణ, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.