Share News

పదవి లేకున్నా.. స్టిక్కర్‌ వదల్లే

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:05 AM

‘MLA’ pass on the car even after expiry! కొందరు వైసీపీ నేతలకు మాత్రం పదవి పోయినా అధికార దర్పం తగ్గడం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి, టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి చేతిలో ఘోర పరాజయం చవిచూసిన మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తీరు ఇందుకు అద్దం పడుతోంది.

పదవి లేకున్నా.. స్టిక్కర్‌ వదల్లే
పాత ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్‌తో కారులో పయనిస్తున్న మాజీమంత్రి కృష్ణదాస్‌

  • మాజీ అయినా.. దర్పం వీడని ధర్మాన కృష్ణదాస్‌

  • గడువు ముగిసినా.. కారుపై ‘ఎమ్మెల్యే’ పాసే!

  • పట్టని పోలీస్‌, రవాణాశాఖ అధికారులు

  • శ్రీకాకుళం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): కొందరు వైసీపీ నేతలకు మాత్రం పదవి పోయినా అధికార దర్పం తగ్గడం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి, టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి చేతిలో ఘోర పరాజయం చవిచూసిన మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తీరు ఇందుకు అద్దం పడుతోంది. ఎన్నికలు ముగిసి రెండున్నరేళ్లు కావస్తున్నా.. ఆయన కారుపై ఇంకా ‘ఎమ్మెల్యే’ పాస్‌ స్టిక్కర్‌ దర్శనమిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. గురువారం శ్రీకాకుళం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన ‘విశ్వకర్మ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ‘ఎమ్మెల్యే’ స్టిక్కరున్న కారులో కృష్ణదాస్‌ రావడం చర్చనీయాంశమైంది.

  • కాలంచెల్లిన పాస్‌.. కంటిన్యూ అవుతున్న దర్జా!

  • సాధారణంగా శాసనసభ సభ్యులకు కేటాయించే కారు పాస్‌ గడువు సదరు అసెంబ్లీ కాలపరిమితి వరకే ఉంటుంది. కృష్ణదాస్‌ కారుపై ఉన్న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ పాస్‌ (ఎమ్మెల్యే 8-నరసన్నపేట) మీద స్పష్టంగా ‘వాలిడ్‌ అప్‌టు మే 2024’ అని ముద్రించి ఉంది. అంటే ఆ పాస్‌ కాలం చెల్లిపోయి రెండేళ్లకుపైనే అవుతోంది. అయినా సరే, ఆ పాత పాస్‌ బోర్డుతోనే మాజీమంత్రి కృష్ణదాస్‌ దర్జాగా రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా పనిచేసిన ఓ సీనియర్‌ నాయకుడు.. ఇలా నిబంధనలను ఉల్లంఘించడం విడ్డూరంగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా కారుపై ‘ఎమ్మెల్యే’ పాస్‌ వేసుకుని తిరగడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టోల్‌గేట్ల వద్ద సిబ్బందిని బురిడీ కొట్టించి ఫీజులు ఎగ్గొట్టడానికా? లేక పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకుని దర్జాగా తిరగడానికా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే, కారుకు బ్లాక్‌ఫిల్మ్‌ వేస్తే చలాన్లు రాసే పోలీసులు.. నిత్యం జిల్లాలో దర్జాగా తిరుగుతున్న ఈ వీఐపీ కారును చూసి ఎందుకు వదిలేస్తున్నారన్నది ప్రశ్న. కాలంచెల్లిన పాస్‌తో తిరుగుతున్న మాజీమంత్రి కారు వ్యవహారంపై స్థానిక ట్రాఫిక్‌ పోలీసులు, రవాణా శాఖ(ఆర్టీఏ) అధికారులు కళ్లు మూసుకోవడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - Sep 18 , 2026 | 12:05 AM