Share News

అక్రమమేనని తెలిసినా..!

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:30 AM

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో అక్రమ లేఅవుట్లు జోరందుకున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

అక్రమమేనని తెలిసినా..!
కోసంగిపురంలో అనుమతులు లేకుండా వెలసిన లేఅవుట్‌

- సుడా నిబంధనలు పాటించని వైనం

- గృహ నిర్మాణాల అనుమతులకు అడ్డంకులు

- అయినా కొందరు వినియోగదారుల కొనుగోలు

పలాస, జూలై 8(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో అక్రమ లేఅవుట్లు జోరందుకున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇలాంటి లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే గృహ నిర్మాణాలకు అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వరు. ఈ విషయం తెలిసి కూడా కొందరు వినియోగదారులు వాటిని కొనుగోలు చేస్తూ చేతిచమురు వదిలించుకుంటున్నారు. చిన్నబడాం, సర్వేనెంబరు 35/1లో కోసంగిపురం గ్రామ రహదారిలో ఇటీవల అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ఇక్కడ కామన్‌ స్థలాన్ని విడిచిపెట్టకుండా విక్రయిస్తున్నారు. ఇలాంటి లేఅవుట్లు పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో 20 పైగా ఉన్నాయి. సుడా నిబంధనల ప్రకారం లేఅవుట్‌కు అనుమతులు పొందడంతో పాటు అందులో ప్రధాన రహదారి 40 అడుగులు, మిగిలిన రోడ్లు కనీసం 30 అడుగుల మేర ఉండాలి. కానీ, చాలా లేఅవుట్లలో 15 అడుగులు మాత్రమే రోడ్డుకు విడిచిపెట్టి ప్లాట్లగా విభజిస్తున్నారు. ఇటువంటి నిర్మాణాలు చెల్లవని మునిసిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసిన సుడా లేఅవుట్‌లో ప్రధాన రహదారి 80 అడుగులు, మిగిలిన రోడ్లు 40 అడుగుల వెడల్పుతో నిర్మాణం చేపట్టారు. ఇక్కడి స్థలాల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకున్నారు. వాటి ప్రకారం మిగిలిన లేఅవుట్లు కూడా ఉండాలి. కానీ ఎకరా, రెండు ఎకరాల్లో వేసిన లేఅవుట్లలో నిబంధనలు పాటించడం లేదు. అధికారులు స్పందించి అనుమతిలేని లేఅవుట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

చర్యలు చేపట్టాం

కోసంగిపురంలోని లేఅవుట్‌పై ఇప్పటికే చర్యలు చేపట్టాం. దీనిపై సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి లేఖ అందించాం. ఆ లేఅవుట్‌లో ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని కోరాం. అదేవిధంగా విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయవద్దని ఆ శాఖ అధికారులకు కూడా లేఖ రాశాం. అనుమతులు లేని లేఅవుట్లలో నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తాం.

-ఇ.శ్రీనివాసులు, కమిషనర్‌, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ

Updated Date - Jul 09 , 2026 | 12:30 AM