Share News

నిషేధమైనా.. ఆగని నిషా

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:49 PM

Banned items from Odisha to the srikakulam ఒడిశా నుంచి నిషేధిత వస్తువులు జిల్లాలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఖైనీ, గుట్కాలు నిషేధం. కానీ జిల్లాలోని ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఏ పాన్‌షాపుల్లో చూసినా ఆ రాష్ట్రానికి చెందిన గుట్కా, ఖైనీలు లభిస్తున్నాయి. ఒడిశాలోని బరంపూర్‌, పర్లాకిమిడి నుంచి వ్యాపారులు వీటిని తెచ్చి పాన్‌షాపుల్లో విక్రయిస్తున్నారు.

నిషేధమైనా.. ఆగని నిషా

  • ఒడిశా నుంచి జిల్లాలోకి నిషేధిత వస్తువులు

  • అధికంగా గుట్కా, ఖైనీ, గంజాయి రవాణా

  • అడ్డుకట్ట వేయలేకపోతున్న అధికారులు

  • మూతపడిన చెక్‌పోస్టులు

  • ఇచ్ఛాపురం, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి నిషేధిత వస్తువులు జిల్లాలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఖైనీ, గుట్కాలు నిషేధం. కానీ జిల్లాలోని ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఏ పాన్‌షాపుల్లో చూసినా ఆ రాష్ట్రానికి చెందిన గుట్కా, ఖైనీలు లభిస్తున్నాయి. ఒడిశాలోని బరంపూర్‌, పర్లాకిమిడి నుంచి వ్యాపారులు వీటిని తెచ్చి పాన్‌షాపుల్లో విక్రయిస్తున్నారు. చాలామంది యువత, పెద్దలు గుట్కా, ఖైనీ నములుతూ అనారోగ్యం బారినపడుతున్నారు. విద్యాధికులు సైతం గుట్కాలకు అలవాటు పడి భవిష్యత్‌ను కోల్పోతున్నారు. అలాగే ఒడిశా నుంచి ఖైనీ, గుట్కాతోపాటు సారా కూడా అధికంగా దిగుమతి అవుతోంది. ఇక గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్ట పడడం లేదు. మరోవైపు పశువులు, కలప, ద్విచక్ర వాహనాలు, నకిలీ బిల్లుతో ఇసుక అక్రమ రవాణా కూడా జోరుగా సాగుతోంది. పోలీసులు, ఎక్సైజ్‌ తనిఖీ కేంద్రాలు లేకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా నిషేధిత వస్తువులను జిల్లాకు తెచ్చి విక్రయిస్తున్నారు.

  • మూడుచోట్ల చెక్‌ పోస్టులు

  • ఇచ్ఛాపురం నుంచి పాతపట్నం వరకూ ఒడిశాతో జిల్లా సరిహద్దు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ వాహనాల రాకపోకల పర్యవేక్షణకు కేవలం 3 తనిఖీ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. వీటికి సమాచారం అందినప్పుడు మాత్రమే తనిఖీలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఒడిశా నుంచి జిల్లాలో ప్రవేశించేందుకు ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, మందస, పలాస, మెళియాపుట్టి, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు మండలాల పరిధిలోని 20కుపైగా మార్గాలున్నాయి. ఇచ్ఛాపురంలోని పురుషోత్తపురం, పాతపట్నంలో మాత్రమే పోలీస్‌ తనిఖీ కేంద్రాలున్నాయి. మరొకటి రణస్థలం మండలం పైడిభీమవరంలో ఉంది. ఇక ఎక్సైజ్‌ తనిఖీ కేంద్రంగా మెళియాపుట్టి కొనసాగుతోంది. మిగిలిన మార్గాల్లో వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా ఎటువంటి తనిఖీలు లేవు. వీటిద్వారా కోట్లాది రూపాయల నిషేధిత వస్తువుల రవాణా సాగిపోతోంది.

  • గతంలో పోలీస్‌ చెక్‌పోస్టులు జిల్లా వ్యాప్తంగా 20కుపైగా ఉండేవి. అక్కడ మాజీ సైనికులను నియమించారు. కానీ ఎందుకో నిలిపివేశారు. పోలీస్‌ తనిఖీ కేంద్రాలు ఉన్న సమయంలో ఒడిశా రూట్లో వేల కిలోల గంజాయి, పదుల సంఖ్యలో వాహనాలు పట్టుబడ్డాయి.

  • ఎక్కడెక్కడ అంటే..

  • ఇచ్ఛాపురం మండలం టి.బరంపురం, పెద్దలక్ష్మిపురం, కొళిగాం, ముచ్చింద్రా మార్గాల గుండా ఒడిశా నుంచి నిషేధిత వస్తువులు జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. కంచిలి మండలానికి సంబంధించి కేశుపురం, బైరిపురం, సోంపేటలో పిరియాసాయి, కొంగాపూర్‌ నుంచి బాతుపురం, ఎంజీపురం, పొత్తంగి మీదుగా వస్తున్నాయి. మందస మండలానికి సంబంధించి తుంబకొండ నుంచి అంబటికంబరం, సింగుపురం మీదుగా.. మెళియాపుట్టిలో వసుంధర, గొప్పిలి, పట్టుపురం మీదుగా జిల్లాకు చేరకుంటున్నాయి. పాతపట్నంలో ఎస్‌ఎస్‌ కవిటి, రుగడ, కురిగాం మార్గాల్లో.. కొత్తూరులో హడ్డుబంగి మీదుగా మాతల, పాతపట్నం వైపు నిషేధిత వస్తువుల రవాణా సాగుతోంది. గతంలో ఈ మార్గాల్లో ఉన్న పోలీస్‌ చెక్‌పోస్టులను కొన్నాళ్ల కిందట తొలగించడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. ఇప్పటికైనా పోలీస్‌ శాఖ దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

  • నిఘా పెంచాం

  • ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే నిషేధిత వస్తువులపై నిఘా పెంచాం. ఆయా మార్గాల్లో ఎప్పటికప్పడు తనిఖీ చేస్తున్నాం. అంతర్‌రాష్ట్ర మార్గాల్లో పోలీస్‌ చెక్‌పోస్టులు తెరిచే ఆలోచన ఉంది. పోలీస్‌ శాఖపరంగా పటిష్ట చర్యలు చేపడుతున్నాం.

    - మీసాల చిన్నమనాయుడు, సీఐ, ఇచ్ఛాపురం

Updated Date - Aug 04 , 2026 | 11:49 PM