ఆర్థిక కష్టాల్లోనూ... వరాల జల్లు
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:17 AM
Budget allocation of Rs. 3,455 crores జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక కష్టాల్లోనూ.. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా.. 2026-27 బడ్జెట్‌లో రూ.3,455 కోట్ల నిధులు కేటాయించింది.
జిల్లాకు రూ.3,455 కోట్ల బడ్జెట్ కేటాయింపు
సంక్షేమానికి పెద్దపీట.. ‘సూపర్ సిక్స్’కు ప్రాధాన్యం
నియోజకవర్గాల్లో శ్రీకాకుళానికి సింహభాగం
శ్రీకాకుళం, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక కష్టాల్లోనూ.. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా.. 2026-27 బడ్జెట్‌లో రూ.3,455 కోట్ల నిధులు కేటాయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శ్రీకాకుళం, పలాస ఎమ్మెల్యేలు గొండు శంకర్, గౌతు శిరీష వెల్లడించారు. బడ్జెట్ కేటాయింపులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలకే పెద్దపీట వేసిందని తెలిపారు.
జిల్లాలో అమలు చేయనున్న ఫ్లాగ్‌షిప్ పథకాలకు రూ.2,64,245 లక్షలు కేటాయించారు.
ఎన్టీఆర్ భరోసా పథకానికి అత్యధికంగా రూ.1,61,596 లక్షలు దక్కాయి.
తల్లికి వందనం పథకానికి రూ. 40,580 లక్షలు, అన్నదాత సుఖీభవకు రూ. 39,715 లక్షలు కేటాయించారు.
దీపం-2 పథకానికి రూ. 11,357 లక్షలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకానికి రూ. 5,734 లక్షలు, మత్స్యకారుల సేవలో పథకానికి రూ.3,093 లక్షలు, ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి రూ.2,166 లక్షలు కేటాయించారు.
విభాగాల వారీగా నిధుల పంపిణీ
జిల్లాలో మౌలిక వసతులు, ఇతర శాఖల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు పంపిణీ చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు రూ.27,866 లక్షలు కేటాయించింది. బలహీన వర్గాల గృహ నిర్మాణానికి రూ.23,930 లక్షలు దక్కాయి. పంచాయతీరాజ్ శాఖకు రూ.21,504 లక్షలు కేటాయించింది. రవాణా (రూ.21,350 లక్షలు), పాఠశాల విద్య (రూ. 20,650 లక్షలు), వైద్య విద్య(రూ. 20,591 లక్షలు) శాఖలకు ప్రాధాన్యం దక్కింది. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు రూ.19,378 లక్షలు, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.17,338 లక్షలు, రాష్ట్ర పోర్టుల డైరెక్టరేట్‌కు రూ.10,000 లక్షలు కేటాయించింది.
నియోజకవర్గాల వారీగా..
బడ్జెట్ కేటాయింపుల్లో శ్రీకాకుళం నియోజకవర్గానికి అత్యధికంగా రూ.66,275 లక్షలు దక్కాయి. పాతపట్నానికి రూ.52,458 లక్షలు, టెక్కలికి రూ.52,330 లక్షలు, ఎచ్చెర్లకు రూ.38,584 లక్షలు, పలాసకు రూ.35,412 లక్షలు కేటాయించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గానికి రూ.34,296 లక్షలు, ఆమదాలవలసకు రూ. 34,201 లక్షలు, నరసన్నపేటకు రూ.32,013 లక్షలు దక్కాయి. ఆర్థిక ఏకీకరణలో భాగంగా వడ్డీ రేట్ల తగ్గింపు ద్వారా పాత రుణాలను పునఃసమీక్షించి సంవత్సరానికి రూ.327 కోట్ల ఆదా చేస్తోంది. స్వల్ప కాలంలో ఆర్థిక ఒత్తిడి ఉన్నా, ప్రణాళికాబద్ధమైన విధానాలతో రాష్ట్రం ఆర్థిక స్థిరత్వాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని కలెక్టర్, ఎమ్మెల్యేలు వెల్లడించారు.