మరణించినా.. చిరంజీవులే
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:15 AM
Today is National Organ Donation Day ప్రతివ్యక్తి తనువు చాలించాక శరీరం బూడిద అయిపోతుంది. కొన్నిరోజులు బాధపడిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూడా క్రమేపీ ఆ బాధను మరిచిపోతుంటారు. ఇది జీవిత సత్యం. అయితే చనిపోయిన తరువాత కూడా అవయవదానం చేస్తూ.. ఎంతో మంది చిరంజీవులుగా నిలుస్తున్నారు.
అవయవదానంతో ఎందరికో కొత్త జీవితం
నేడు జాతీయ అవయవదాన దినోత్సవం
సోంపేట/ శ్రీకాకుళం కల్చరల్, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ప్రతివ్యక్తి తనువు చాలించాక శరీరం బూడిద అయిపోతుంది. కొన్నిరోజులు బాధపడిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూడా క్రమేపీ ఆ బాధను మరిచిపోతుంటారు. ఇది జీవిత సత్యం. అయితే చనిపోయిన తరువాత కూడా అవయవదానం చేస్తూ.. ఎంతో మంది చిరంజీవులుగా నిలుస్తున్నారు. గురువారం జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా.. దాని ప్రాముఖ్యతను తెలుసుకుందాం. జిల్లాలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దానం చేసిన వారి కుటుంబాల్లో ఇది విషాదమే అయినా.. మరికొన్ని కుటుంబాల్లో మాత్రం వెలుగులు నింపుతోంది. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు బ్రెయిన్‌డెడ్ అవుతున్నారు. ఆత్మీయులను కోల్పోయామనే దుఃఖంలోనూ... మరొకరి రూపంలో బతికున్నారనే భావనతో చాలా మంది అవయవదానానికి ముందుకొస్తున్నారు. జీవన్‌దాన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వమే గ్రీన్‌చానల్ ద్వారా వాటిని తరలించే ఏర్పాటు చేస్తుంది. అందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. బ్రెయన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, కార్నియా వంటివి సేకరించి మరొకరికి అమర్చవచ్చు. జీవించి ఉన్న వ్యక్తుల నుంచి మూత్రపిండాలు, ఎముకలోని మూలుగు, కాలేయంలోని కొంత భాగం దానం చేయవచ్చు. అయితే ఆస్పత్రుల్లో చాలామంది అవయవాలు సరిగ్గా పనిచేయక సతమతమవుతుంటారు. మరికొందరు మరణిస్తుంటారు. అటువంటి వారికి అవయవదానం పునర్జన్మనిస్తోంది. కాగా కొంతమంది మాత్రం మూఢనమ్మకాలు, అపోహలతో అవయవదానానికి ఆసక్తి చూపడం లేదు. దీనిపై అధికారులు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపడితే ఫలితం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఐదుగురి జీవితాల్లో వెలుగులు
సోంపేట పట్టణానికి చెందిన మల్లారెడ్డి కిరణ్‌చంద్ అనే 15 ఏళ్ల విద్యార్థి 2023లో మృతి చెందాడు. పదో తరగతి పరీక్షలు రాసే సమయంలో అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. వైద్యుల సలహా మేరకు తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు మోహన్‌కల్యాణ్ దంపతులు అంగీకరించారు. ఈ మేరకు ఆయన నేత్రాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలను సేకరించారు. ఆ అవయవాలను ఐదుగురి బాధితులకు అమర్చారు. దీంతో తమ కుమారుడు కళ్ల ముందు లేకపోయినా.. ఐదుగురికి కొత్త జీవితం ప్రసాదించి చిరంజీవిగా నిలిచాడంటూ ఆ తల్లిదండ్రులు కాస్త ఊరట చెందుతున్నారు.
పుట్టెడు దుఃఖంలోనూ..
శ్రీకాకుళానికి సమీపాన సొండిపేట గ్రామానికి చెం దిన వెలమల సింహాచలం కుటుంబంలో ఇటీవల విషాదం నెలకొంది. భార్యకు బ్రెయిన్‌డెడ్ కాగా.. పుట్టెడు దుఃఖంలో సింహాచలం కుటుంబం అవయవదానానికి అంగీ కరించింది. సింహాచలం, అరుణకుమారి దంపతలుకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పుట్టిన మూడునెలలకు అరుణ కుమారికి ఫిట్స్ లక్షణాలు కనిపించాయి. విశాఖపట్నంలో సుమారు 8 ఏళ్లుగా చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ తల్లి బాధను చూసి.. ఇద్దరు కుమార్తెలు, భర్త సింహా చలం నరకం అనుభవించారు. జూలై 30న అరుణకుమారిని శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. మళ్లీ పిట్స్ రావడంతో పరిస్థితి విషమించింది. ఆమె బ్రెయిన్‌డెడ్ అని వైద్యులు నిర్ధారించారు. అవయవదానంపై అవగాహన కల్పిం చారు. దీంతో సింహాచలం తన భార్య కిడ్నీ, లివర్, గుండె తది తర అవయవాలు దానం చేయడానికి అంగీకరించారు. వైద్యులు వాటిని సేకరించి.. అవసరమైన బాధితులకు అమర్చారు.