Share News

దిగుబడి ఉన్నా.. డీలా

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:23 AM

Peanut prices down వేరుశనగ ధర ఒక్కసారిగా తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల కిందట 41 కేజీల వేరుశనగ బస్తా ధర రూ.4,500 ఉండగా.. ఆదివారం నాటికి రూ.2,800కు పడిపోయింది.

దిగుబడి ఉన్నా.. డీలా
జమ్ము వద్ద కళ్లాల్లో వేరుశనగ ఆరబెడుతున్న రైతు

తగ్గిన వేరుశనగ ధరలు

41 కేజీల బస్తా రూ.2,800కు పడిపోయిన వైనం

వ్యాపారులు సిండికేట్‌గా కొనుగోలు

ఆందోళనలో రైతులు

నరసన్నపేట, మార్చి 22(ఆంధ్రజ్యోతి): వేరుశనగ ధర ఒక్కసారిగా తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల కిందట 41 కేజీల వేరుశనగ బస్తా ధర రూ.4,500 ఉండగా.. ఆదివారం నాటికి రూ.2,800కు పడిపోయింది. పంట చేతికి అందే సమయంలో వ్యాపారులు సిండికేట్‌గా వ్యవహరించి.. ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్‌లో మొక్కజొన్న తర్వాత అత్యధికంగా వేరుశనగ 12,361 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. నరసన్నపేట, పోలాకి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, ఎల్‌.ఎన్‌.పేట, సరుబుజ్జిలి, హిరమండలం, పాతపట్నం, సారవకోట తదితర మండలాల్లో వేరుశనగ పండించారు. నిబంధల ప్రకారం వేరుశనగ క్వింటాల్‌ బస్తా రూ.10,500కు కొనుగోలు చేయాలి. కానీ జిల్లా అంతటా వ్యాపారులు సిండికేట్‌గా వ్యవహరించి.. ధర 41 కేజీల బస్తాను రూ.2,800కు కొనుగోలు చేస్తున్నారు. మట్టి, రాళ్లు పేరిట దోపిడీకి పాల్పడుతూ.. క్వింటాకు సుమారు రూ.7వేలు మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా సాగుకు సుమారు రూ.25వేలు ఖర్చు కాగా.. పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. పంట దిగుబడి బాగున్నా.. ధర లేక నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. కిలో వేరుశనగ విత్తనాలు రూ.150 చొప్పున వ్యాపారులు విక్రయించగా.. ప్రస్తుతం కాయలు మాత్రం రూ.75 చొప్పున కొనుగోలు చేసి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు ఒడిశా నుంచి జిల్లాకు వేరుశనగ పంటను దిగుమతి చేసి.. అక్రమ నిల్వలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేపడితే వ్యాపారుల వద్ద అక్రమ నిల్వలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని, వేరుశగన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఆదుకోవాలి

15 ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశనగ సాగు చేశాను. ఎకరా సాగుకు రూ.30 వేలు చొప్పున ఖర్చయింది. దిగుబడి బాగా వచ్చింది. కానీ బస్తా ధర రూ.4,500 నుంచి ఒక్కసారిగా రూ.2,800కు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి.

- పల్లి సింహాచలం, రైతు, జమ్ము

మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలి

ప్రభుత్వం వేరుశనగ పంటను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలి. మద్దతు ధర కేంద్రం ప్రకటించినా వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. నిల్వ ఉంచితే వేరుశనగ పలుకులు రంగు మారి ధర మరింత తగ్గే అవకాశం ఉంది. వ్యాపారులు దోపిడీకి అధికారులు అడ్డుకట్ట వేయాలి.

- తంగి రవీంద్ర, రైతు, కంబకాయి

Updated Date - Mar 23 , 2026 | 12:23 AM