నాలుగు దశాబ్దాలైనా..
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:26 AM
No development in Ichchapuram Municipality ఇచ్ఛాపురం మునిసిపాలిటీకి సమస్యలు వెంటాడుతున్నాయి. నాలుగు దశాబ్దాల కిందట ఈ మునిసిపాలిటీ ఏర్పాటైనా.. ఆశించినస్థాయిలో మౌలిక వసతులు లేవు. ఉన్నవాటి నిర్వహణ సక్రమంగా లేదు. దీంతో ఎటు చూసినా సమస్యలే.
ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో కానరాని అభివృద్ధి
ప్రభుత్వ వ్యతిరేక పాలకవర్గాలే అధికం
వెంటాడుతున్న తాగునీటి సమస్య
అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ
ఇచ్ఛాపురం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం మునిసిపాలిటీకి సమస్యలు వెంటాడుతున్నాయి. నాలుగు దశాబ్దాల కిందట ఈ మునిసిపాలిటీ ఏర్పాటైనా.. ఆశించినస్థాయిలో మౌలిక వసతులు లేవు. ఉన్నవాటి నిర్వహణ సక్రమంగా లేదు. దీంతో ఎటు చూసినా సమస్యలే. రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే.. ఇక్కడ మునిసిపాలిటీలో ప్రత్యర్థి పార్టీ పాలకవర్గంగా ఉండడం శాపంగా మారుతోంది. దాని ప్రభావం అభివృద్ధిపై పడుతోంది.
ఇచ్ఛాపురం మునిసిపాలిటీ 1986లో ఏర్పడింది. అప్పట్లో 21 వార్డులు ఉండేవి. ప్రస్తుతం వార్డుల సంఖ్య 28కి పెరిగింది. 20 ఏళ్ల కిందట.. 28 వేల మంది జనాభాకు తగ్గట్టుగా తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పట్టణంతోపాటు జనాభా పెరిగింది. కానీ ప్రజల అవసరాలకు తగ్గట్టు తాగునీటి సరఫరా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టణ జనాభాకు రోజుకు సగటున 5.10 మిలియన్ లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం అందులో సగం నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు. 1,2,3 వార్డుల పరిధిలోని పురుషోత్తపురం, ఏఎస్పేటకు ఏర్పాటు చేసిన పైపులైన్లు లీకులయ్యాయి. దీంతో ఆయా వార్డులకు ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీటిని అందిస్తున్నారు. పలు ప్రాంతాల్లో భూ మట్టానికి మూడు నుంచి ఐదు అడుగుల గోతులో ఉన్న కుళాయి నుంచి నీటిని పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పట్టణంలో 15 బోర్లు పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. కానీ అంతకుమించి బోర్లు మూలకు చేరాయని తెలుస్తోంది. రత్తకన్న పరిధిలో చాలా వీధులకు రెండు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కొన్నిచోట్ల పైపులైన్లు ధ్వంసం కావడంతో తాగునీరు కలుషితమవుతోందని వాపోతున్నారు.
మూలకు చేరిన పాజెక్టులు
ఉద్దానం ప్రాజెక్టులో భాగంగా బాహుదా నదిలో ఊటబావులు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. క్లోరినేషన్ చేపట్టిన తరువాత రాజావారితోటలో రిజర్వాయర్ ద్వారా పట్టణ అవసరాల కోసం 8లక్షల లీటర్ల నీటిని ప్రతిరోజూ విడిచిపెడుతున్నారు. ఈ నీరు ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. రూ.54.48 కోట్ల కేంద్ర నిధులతో పైలెట్ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. అది పూర్తయితే పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉంది. అలాగే పురుషోత్తపురం పుష్పగిరి కొండపై 5 లక్షల లీటర్ల నీటి సామర్ధ్యం ఉన్న ట్యాంకర్ను నిర్మించి వృథాగా వదిలేశారు. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకంలో ఇచ్ఛాపురం మునిసిపాల్టీకి చోటిచ్చారు. కానీ..ఇంతవరకూ నీటిని అందించలేదని స్థానికులు పేర్కొంటున్నారు. అరకొరగా పారిశుధ్య నిర్వహణ
పారిశుధ్య పనులు పట్టణంలోని ప్రధాన ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయి. ప్రస్తుతం మునిసిపాల్టీలో 80 మంది వరకూ పారిశుధ్య కార్మికులు ఉన్నారు. ఇందులో రెగ్యులర్ కార్మికులు ఓ ఐదుగురు మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరత కారణంగా పారిశుధ్య నిర్వహణ సక్రమంగా సాగడం లేదు. ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికల వేళ.. కొత్త పాలకవర్గమైనా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఎప్పుడూ వెతలే
ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో తాగునీటి సమస్య దశాబ్దాలుగా ఉంది. పైపులైన్లు, కుళాయిలు పాడయ్యాయి. ఎప్పడు నీటి సరఫరా ఉంటుందో తెలియని పరిస్థితి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమార్గం చూపాలి.
- పి.బుజ్జి, ఇచ్ఛాపురం
కనీస సౌకర్యాలు లేవు
జిల్లా కేంద్రం తరువాత ఏర్పడిన ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో కనీస మౌలిక వసతులు లేవు. ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సమస్య పరిష్కారంపై పాలకులు దృష్టి సారించాలి.
- ఎల్.నరసింహామూర్తి, ఇచ్ఛాపురం