Share News

ఏడాదైనా.. కన్నీళ్లు ఆగలే!

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:15 AM

Last year's stampede in Kashibugga కాశీబుగ్గ చిన్నతిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు ఏడాది గడిచింది. కార్తీక ఏకాదశి పర్వదినాన స్వామివారి దర్శనం కోసం వెళ్లిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఓ బాలుడు కూడా ఉన్నాడు. మరో 17 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. కళ్లముందే భార్యను కోల్పోయిన భర్త.. ఒక్కగానొక్క కుమారుడిని పోగొట్టుకున్న తల్లిదండ్రులు.. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలు.. నాటి విషాదాన్ని ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నాయి.

ఏడాదైనా.. కన్నీళ్లు ఆగలే!
కాశీబుగ్గలో చిన్నతిరుపతి ఆలయం (ఫైల్‌)

  • కాశీబుగ్గ చిన్నతిరుపతిలో గతేడాది నవంబరు 1న తొక్కిసలాట

  • బాలుడు సహా 9 మంది మృత్యువాత.. 17 మందికి గాయాలు

  • కళ్లముందే భార్యను కోల్పోయిన భర్త.. కుమారుడి జ్ఞాపకాలతో తల్లిదండ్రులు

  • గాయాల నుంచి కోలుకున్నా.. ఆ ఘటన వెంటాడుతోందంటున్న బాధితులు

  • పలాస/టెక్కలి/సోంపేట, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ చిన్నతిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు ఏడాది గడిచింది. కార్తీక ఏకాదశి పర్వదినాన స్వామివారి దర్శనం కోసం వెళ్లిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఓ బాలుడు కూడా ఉన్నాడు. మరో 17 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. కళ్లముందే భార్యను కోల్పోయిన భర్త.. ఒక్కగానొక్క కుమారుడిని పోగొట్టుకున్న తల్లిదండ్రులు.. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలు.. నాటి విషాదాన్ని ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నాయి. గాయాల నుంచి కోలుకున్నవారిని సైతం ఆ ఘటన భయం వెంటాడుతోంది. ఏడాది గడిచినా బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు తొలగలేదు.

  • ఊహించని రీతిలో భక్తుల రాక

  • కాశీబుగ్గ పరిధిలోని శ్రీనివాసనగర్‌లో ఆధ్యాత్మికవేత్త హరిముకుంద పండా సొంత నిధులతో 12.5 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవెంకటేశ్వర, అలివేలు, పద్మావతి అమ్మవార్ల ఆలయాలను నిర్మించారు. ఆలయం చుట్టూ రామాయణ, భారత ఇతిహాసాలను తెలిపే విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీంతో ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షించింది. చిన్నతిరుపతిగా పేరొందడంతో నిత్యం భక్తులు వచ్చేవారు.

  • గతేడాది నవంబరు 1వ తేదీన కార్తీక మాసం, ఏకాదశి కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఉదయం 11 గంటల సమయంలో భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. క్యూలైన్లలో రద్దీ ఎక్కువ కావడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో భక్తులను నియంత్రించే ప్రయత్నం చేస్తుండగా తొక్కిసలాట జరిగింది. ఓ మహిళ కిందపడటంతో ఆమె కాలు రైలింగ్‌లో ఇరుక్కుంది. ఆమెపైకి ఇతర భక్తులు పడటంతో రైలింగ్‌ విరిగిపోయింది. ఈ ఘటనలో ఊపిరాడక 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మంత్రులు నారా లోకేష్‌, అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించారు. ఘటన అనంతరం ఆలయాన్ని 8నెలల పాటు మూసివేశారు. ప్రస్తుతం బారికేడ్లు, భద్రతా ఏర్పాట్ల మధ్య సందర్శనకు అనుమతిస్తున్నారు.

  • నా కళ్ల ముందే భార్యను కోల్పోయాను:

  • టెక్కలి మండలం గూడేం పంచాయతీ పిట్టలసరియాకు చెందిన రాపాక చిన్నారావు.. తన భార్య విజయను నాటి తొక్కిసలాటలో కోల్పోయారు. భార్యాభర్తలిద్దరూ కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లగా.. ఆయన కళ్లముందే విజయ ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం చిన్నారావు రోజువారీ కూలీగా జీవనం సాగిస్తున్నారు. దీనికితోడు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. అవసరమైన మందులు వాడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అందించిన రూ.15 లక్షల పరిహారంపై వచ్చే వడ్డీ కొంత ఆసరాగా నిలుస్తోంది. కుమార్తె మౌనిక అప్పుడపుఁడు వచ్చి తండ్రి బాగోగులు చూసుకుంటోంది.

  • చిన్నారావు ఏమంటున్నారంటే..

  • ‘అందరూ వెళ్తున్నారని నేను, నా భార్య కలిసి కాశీబుగ్గ చిన్నతిరుపతి ఆలయానికి వెళ్లాం. గంట తర్వాత ఒక్కసారిగా క్యూలైన్లో తొక్కిసలాట, గందరగోళం మొదలయ్యాయి. అరుపులు, కేకలు వినిపించాయి. కళ్లుతెరిచి చూసేలోపే నా భార్య విజయపై నుంచి జనం తొక్కుకుంటూ వెళ్లారు. క్షణం ఆగి చూసేసరికి ఆమె ప్రాణాలు విడిచింది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఘటన నా జీవితంలో పీడకలగా మిగిలిపోయింది. ఇప్పటికీ గుర్తుకొస్తే నా బాధ వర్ణనాతీతం’ అని చిన్నారావు ఆవేదన వ్యక్తం చేశారు.

  • మిగిలింది చిన్నమ్మి తల్లిదండ్రులే

  • టెక్కలి మండలం బూరగాం పంచాయతీ రామేశ్వరం గ్రామానికి చెందిన ఏదుల చిన్నమ్మి నాటి తొక్కిసలాటలో మృతి చెందారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిన్నతిరుపతి దర్శనానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. పెళ్లయిన కొద్దిరోజులకే భర్త ఆమెను విడిచిపెట్టడంతో అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు కుమార్తె జ్ఞాపకాలే మిగిలాయి.

  • ఎక్కడో ఆయుష్షు ఉండి బయటపడ్డా:

  • ‘భగవంతుడు ఎక్కడో నాకు ఆయుష్షు ఇచ్చాడు. నాటి తొక్కిసలాట నుంచి బయటపడటం నా పూర్వజన్మ సుకృతం. స్వామివారి దర్శనం మరికొద్దిసేపట్లో లభిస్తుందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి. పక్కకు ఒంగి చూసేలోపే జనం నాపై పడిపోయారు. అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డాను. ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది’ అని టెక్కలి మండలం బూరగాం గ్రామానికి చెందిన నాగారపు రాజేశ్వరి తెలిపారు.

  • మరిచిపోలేకపోతున్న తల్లిదండ్రులు

  • కాశీబుగ్గ చిన్నతిరుపతి ఆలయం వద్ద గతేడాది జరిగిన తొక్కిసలాటలో సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన విద్యార్థి లొట్ట నిఖిల్‌ మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు పాపారావు, పుణ్యావతి ఇప్పటికీ ఆ విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు. ఏడాది గడిచినా నాటి ఘటన నిన్నమొన్న జరిగినట్లుగానే ఉందని వారు వాపోతున్నారు. ఎప్పుడూ అల్లరిచేస్తూ తిరిగే కుమారుడు తమ మధ్య లేడన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. కళ్లముందే కుమారుడు ప్రాణాలు కోల్పోవడం వారిని నిరంతరం వెంటాడుతోంది. ఆ రోజు దర్శనానికి వెళ్లకుండా ఉంటే తమ కుమారుడు తమతోనే ఉండేవాడని తలుచుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. నిఖిల్‌ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆ తల్లిదండ్రుల బాధను చూసి గ్రామస్థులు సైతం చలించిపోతున్నారు.

  • టీవీలో చూస్తేనే భార్యను గుర్తించగలిగాను:

  • ‘టీవీల్లో ప్రసారమైన తర్వాతే తొక్కిసలాటలో మృతిచెందింది నా భార్య డొక్కరి అమ్ములని గుర్తించగలిగాను. ప్రతిరోజూ ఆలయ దర్శనం, భగవద్ధ్యానంతోనే ఆమె కాలం గడిపేది. అలాంటి ఆమెకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. మృతదేహాన్ని చూసేవరకు ఎక్కడో దైవదర్శనానికి వెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులమంతా అనుకున్నాం. స్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు ఇలాంటి ఘోరం జరగడం తట్టుకోలేకపోతున్నాం. ఇటువంటి పరిస్థితి మరొకరికి రాకూడదు’ అని పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి సూదికొండ కాలనీకి చెందిన డొక్కరి రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Nov 01 , 2026 | 12:15 AM