Share News

రైల్వేజోన్‌ ఏర్పాటు

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:06 AM

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని కేంద్ర పౌర విమానాయశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

     రైల్వేజోన్‌ ఏర్పాటు
రైల్వే జోన్‌ బోర్డును ఆవిష్కరిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అశోక్‌

ఉత్తరాంధ్ర ప్రజల కోరిక నెరవేరింది

- ఏడు రైల్వేస్టేషన్‌న్లు ఖుర్దాడిజిన్‌ నుంచి విశాఖ డివిజన్‌కు

- 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఫలితమిది

- జిల్లాలో రూ.3,300 కోట్లతో 50కి పైగా ఆర్వోబీల మంజూరు

- కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

- దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభం

ఇచ్ఛాపురం, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని కేంద్ర పౌర విమానాయశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. సోమవారం ఏఎస్‌పేట (బోర్డర్‌) రైల్వే ట్రాక్‌ వద్ద ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ బోర్డును ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన రైల్వేజోన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విశాఖ రైల్వేజోన్‌ సాధన కోసం 12 సంవత్సరాలుగా తాను సుదీర్ఘ పోరాటం సాగించినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ రోజునుంచే విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అఽధికారిక పరిపాలన ప్రాంభమైందన్నారు. నూతన జోన్‌ ఏర్పాటుతో ఈ ప్రాంత రైల్వే సమస్యలకు స్థానికంగానే త్వరితగతిన పరిష్కారాలు లభిస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లా అభివృద్దికి పెద్దపీట వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా రూ3,300కోట్ల భారీ వ్యయంతో 50కిపైగా రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు మంజూరైనట్లు చెప్పారు. ఇచ్ఛారంం ప్రాంతానికి కూడా ఒక కీలకమైన ఆర్వోబీ మంజూరైనట్లు తెలిపారు. అలాగే నూతనంగా సాధించిన పూరి-అహ్మదాబాద్‌ రైలు సేవలను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విశాఖపట్నంలో 54ఎకరాల్లో సుమారు రూ.450కోట్ల అంచనా వ్యయంతో రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఏడు రైల్వేస్టేషన్‌న్లు ఖుర్దాడిజిన్‌ నుంచి విశాఖ డివిజన్‌లోకి వస్తాయని తెలిపారు. రైల్వే జోన్‌ను మంజూరు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇందుకు నిరంతరం సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు అని అన్నారు. అనంతరం విశాఖ రైలులో పలాస బయలు దేరారు. రైలులో ప్రయాణిస్తున్న చిన్నారులతో కరచాలనం చేశారు. అంతకుముందు 22వ వార్డులో లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌, జనసేన పార్టీ ఇన్‌చార్జ్‌ దాసరి రాజు, రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండా శంకర్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాలిన డిల్లీ, జడ్‌ఆర్‌యూ సీసీ మెంబర్‌ శ్రీనువాస్‌ రౌలో, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక

పలాస, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక సౌత్‌ కోస్టు రైల్వేజోన్‌ ఏర్పాటని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. సౌత్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ కార్యకలాపాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు సోమవారం పలాస రైల్వేస్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఎంపీగా గెలుపొందిన నుంచి ఆంధ్రప్రజల ఆత్మగౌరవం కోసం రైల్వేజోన్‌ ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. పార్లమెంటులో అనేక మార్లు ఈ అంశాన్ని లేవనెత్తినట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం రైల్వేజోన్‌ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కనీసం జోన్‌కు అవసరమైన 54 ఎకరాలు కూడా ఇవ్వలేదన్నారు. ఫలితంగా ఆ ప్రక్రియ ఆగిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైల్వేజోన్‌ కోసం భూమి కేటాయించారని, వెనువెంటనే కేంద్రం కూడా రూ.450 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. పలాస రైల్వేస్టేషన్‌కు ఎంతో భవిష్యత్తు ఉందని తెలిపారు. ఇచ్ఛాపురం, పలాస నుంచి అమరావతి, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు కొత్త రైళ్లు వేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కొత ్త జోన్‌తో ఉద్దానం ప్రాంతాల్లో ఉన్న అన్నీ రైల్వేస్టేషన్లు అభివృద్ధి చెందుతాయని, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ఇచ్ఛాపురం నుంచి నాలుగు లైన్లు వేసే ప్రతిపాదన ఉందని, రెండేళ్లలో ఇది కార్యరూపం దాల్చుతుందన్నారు. గతంలోనే తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు జిల్లాలో రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సంకల్పించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ.. పలాస కేంద్రీయ విద్యాలయం, ఆర్వోబీ, అక్కుపల్లి రహదారిపై మాజీ మంత్రి విషం చిమ్మారని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిపై ఆయన ఏ సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టు ఏర్పడితే ఉద్దానం ప్రజలకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, వలసలు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు సంపాదించవ్చన్నారు. అనంతరం యువజన నాయకుడు ఎం.నరేంద్ర ఆధ్వర్యంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే శిరీష భారీ కేకును కటింగ్‌ చేశారు. అనంతరం వారిని గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, నాయకులు లొడగల కామేశ్వరరావుయాదవ్‌, పీరుకట్ల విఠల్‌రావు, మల్లా శ్రీనివాస్‌, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎయిర్‌పోర్టుకు సహకరించండి

పలాస ఎయిర్‌పోర్టుకు ప్రజలు సహకారం అందించాలని, నిర్మాణం జరిగితే 15 ఏళ్లలో ఈ ప్రాంత భవిష్యత్తు మారిపోతుందని రామ్మోహన్‌నాయుడు అన్నారు. దేశవ్యాప్తంగా 50 ఎయిర్‌పోర్టులు నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు టాస్క్‌ ఇచ్చారని, ఇప్పటికే 9 ఎయిర్‌పోర్టులు ప్రారంభించామన్నారు. మనకు కూడా ఒక ఎయిర్‌పోర్టు ఉండాలనే ఉద్దేశంతో పలాసను ఎంచుకున్నామని తెలిపారు. ఇక్కడ ప్రజల అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కోసం ఎయిర్‌పోర్టు ఆవశ్యకత ఉందన్నారు. శంషాబాద్‌, భోగాపురంలో జరుగుతున్న విధంగా అభివృద్ధి జరుగుతుందని, భవిష్యత్తు కోసం ఆలోచించి ఎయిర్‌పోర్టుకు సహకరించాలని కోరారు.

Updated Date - Jun 02 , 2026 | 12:06 AM