టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి అచ్చెన్న
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:58 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం పార్టీ నూతన కమిటీలను ప్రకటించారు.
జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్
జాతీయ, రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు పెద్దపీట
విధేతయ, పోరాట పటిమకు పట్టం
శ్రీకాకుళం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం పార్టీ నూతన కమిటీలను ప్రకటించారు. ఈ కమిటీల్లో జిల్లాకు చెందిన నాయకులకు అధిష్ఠానం అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించింది. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచి, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన నాయకుల సేవలను గుర్తించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో సముచిత ప్రాధాన్యం కల్పించింది. టీడీపీ పొలిట్ బ్యూరోలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు సముచిత స్థానం దక్కింది. కేంద్రపౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుని జాతీయ ప్రధాన కార్యదర్శిగా అధిష్ఠానం నియమించింది. జిల్లా టీడీపీలో పటిష్టమైన నాయకులుగా అటు రాష్ట్ర మంత్రి అచ్చెన్న.. ఇటు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఉన్నారు. పార్టీ కష్టకాలంలోనూ అండగా నిలిచారు. దీంతో వారికి అధిష్ఠానం తగిన గౌరవం కల్పించింది. విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడును జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పదవులు ఆశించకుండా పనిచేసుకుంటూ వెళ్లడంతో ఆయనకు ఈ పదవి దక్కింది. ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన తమ్మినేని సుజాత రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ జోనల్ కో-ఆర్డినేటర్‌గా, పలాస నియోజకవర్గానికి చెందిన వజ్జ బాబూరావు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె... బగ్గు అర్చన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా, పాతపట్నం నియోజకవర్గానికి చెందిన పొగిరి బుచ్చిబాబు(జడ్పీటీసీ), శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన మాదారపు వెంకటేష్ రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులయ్యారు. జాతీయ, రాష్ట్ర కమిటీల్లో జిల్లా నేతలకు పెద్దపీట వేయడంతో జిల్లా టీడీపీలో నూతనోత్సాహం నెలకొంది.