Share News

ప్రభుత్వ బడుల్లో చేర్పించండి

ABN , Publish Date - Apr 09 , 2026 | 10:56 PM

Strengthening in government schools ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వస్తేనే పాఠాలు బోధించేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు మారాయి. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల పంథా కూడా మారింది. ‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వ బడుల్లో చేర్పించండి
నరసన్నపేటలో ఇంటింటా ప్రచారం చేస్తున్న ఎంఈవో, ఉపాధ్యాయులు (ఫైల్‌)

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఉపాధ్యాయుల ప్రచారం

బలోపేతమే లక్ష్యంగా అడ్మిషన్ల పెంపునకు కృషి

సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మంత్రి నారా లోకేష్‌

నరసన్నపేట, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వస్తేనే పాఠాలు బోధించేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు మారాయి. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల పంథా కూడా మారింది. ‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంఈవోలు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, సౌకర్యాలపై అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ పరిస్థితి

జిల్లాలో 2,612 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఒకటి నుంచి పదోతరగతి వరకు 1,59,638 మంది విద్యార్థులు చదువుతున్నారు. రానున్న విద్యాసంవత్సరం నాటికి పది శాతం అదనంగా విద్యార్థులను చేర్చేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు అంగన్‌వాడీ, డీఆర్‌డీఏ, గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమన్వయంతో డ్రైవ్‌ నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతూ.. ఐదేళ్లు పూర్తయిన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా కృషి చేయాలని స్పష్టం చేసింది. కాగా.. గతంలో పాఠశాలల పునఃప్రారంభం సమయంలో కొంతమంది ఉపాధ్యాయులు కొద్దోగొప్పో ప్రచారం చేసేవారు. అప్పటికే ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు విద్యార్థులను తమతమ స్కూళ్లలో చేర్పించుకునేవారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రైవేటు, కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారు. మెరుగైన బోధనకు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు తమవంతు కృషి చేస్తున్నారు. నరసన్నపేట మండలంలో ఎంఈవోలు సైతం ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ.. విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తే కలిగే లాభాలను వివరిస్తున్నారు. మీ పిల్లల భవిష్యతకు బాటలు వేస్తామని భరోసా కల్పిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు పూర్తయిన చిన్నారులు 12,484 మంది ఉన్నారు. వీరందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది పెరగనుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల సంఖ్య పెంచేలా..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఇప్పటికే ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీచేశాం. ఉపాధ్యాయులు ఇంటింటా పర్యటిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈఏడాది అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరేలా ప్రణాళికలు సిద్ధం చేశాం.

- రవిబాబు, డీఈవో

Updated Date - Apr 09 , 2026 | 10:56 PM