సరదాగా స్నానానికి వెళ్లి..
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:13 AM
Engineering student dies స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ నలుగురూ ఎంతో సరదాగా గడిపారు. నేలబావిలో స్నానానికి దిగారు. ఈ క్రమంలో సరిగా ఈత రాక ఓ విద్యార్థి నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోవడంతో.. మిగిలిన స్నేహితులంతా విషాదంలో మునిగిపోయారు. ఎన్నోఆశలతో ఇంజనీరింగ్ చదివే కుమారుడు.. ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
నేలబావిలో మునిగి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
స్నేహితుల దినోత్సవం రోజు విషాదం
శ్రీకాకుళం క్రైం/ పొందూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ నలుగురూ ఎంతో సరదాగా గడిపారు. నేలబావిలో స్నానానికి దిగారు. ఈ క్రమంలో సరిగా ఈత రాక ఓ విద్యార్థి నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోవడంతో.. మిగిలిన స్నేహితులంతా విషాదంలో మునిగిపోయారు. ఎన్నోఆశలతో ఇంజనీరింగ్ చదివే కుమారుడు.. ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పొందూరు మండలం వాండ్రంగి వీధికి చెందిన ముప్పాన సాయినిఖిల్(20).. ఆదివారం శ్రీకాకుళం మండలం మామిడివలసలోని నేలబావిలో మునిగి మృతి చెందాడు. నిఖిల్ తల్లిదండ్రులు బాబ్జి, జ్యోతి చేనేత వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నిఖిల్ సోదరి మధులత విజయనగరంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. నిఖిల్ టెక్కలిలోని ఐతమ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మామిడివలసలో చిన్నాన్న ప్రదీప్‌చంద్ర ఇంట్లో ఉంటూ కళాశాలకు రాకపోకలు సాగిస్తున్నాడు. కాగా.. ఆదివారం ముగ్గురు స్నేహితులతో కలిసి సరదాగా గడిపాడు. తర్వాత మామిడివలస గ్రామ శివారున ఉన్న నేలబావి వద్దకు స్నానానికి వెళ్లాడు. థర్మోకోల్ షీట్‌తో బావిలోకి ఈతకు దిగాడు. థర్మోకోల్ షీట్ విరిగిపోవడంతో సాయినిఖిల్ మునిగిపోయాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి స్నేహితులంతా ఆందోళన చెందారు. సాయినిఖిల్ చిన్నాన్నకు సమాచారం అందించారు. ప్రదీప్‌చంద్ర సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో బావిలో గాలించినా.. సాయినిఖిల్ కనిపించలేదు. దీంతో రూరల్ పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలించి సాయినిఖిల్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలో రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపడుతున్నామని శ్రీకాకుళం రూరల్ ఎస్‌ఐ కరణం వెంకటసురేష్ తెలిపారు.
కుటుంబ సభ్యుల్లో తీరని విషాదం
స్నేహితుల దినోత్సవం నాడే స్నేహితులతో కలిసి నేలబావి వద్దకు వెళ్లి వస్తానని చెప్పిన నిఖిల్‌సాయి మృతి చెందడంతో మామిడివలస, పొందూరు గ్రామాల్లో విషాదచాయలు అలముకున్నాయి. అప్పటివరకూ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు కట్టి.. తమతో సరదాగా గడిపిన సాయినిఖిల్ తమ కళ్లముందే బావిలో మునిగి మృతి చెందడంతో తోటి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే బీటెక్ చదువుతున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరో ఏడాదిలో ఇంజనీరింగ్ విద్యపూర్తి చేసుకుని.. తమకు ఆసరాగా నిలుస్తాడని ఎన్నో కలలు కన్నామని, అర్థాంతరంగా తమ కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని గుండెలవిసేలా విలపించారు.