Share News

దేవుడి మాన్యం.. దైన్యం!

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:10 AM

Endowment lands invasion ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. జిల్లాలోని వివిధ ఆలయాలకు సంబంధించి 12,090,68 ఎకరాలు భూమి ఉండాల్సి ఉండగా.. ఇందులో 3,114.75 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు అధికారులు గుర్తించారు.

దేవుడి మాన్యం.. దైన్యం!
మర్రిపాడు రెవెన్యూ పరిధి జలగలింగుపురం సమీపంలో దేవాలయ భూముల్లో నిర్మాణాలు

  • దేవదాయ భూములు అన్యాక్రాంతం

  • దర్జాగా ఆక్రమణలు

  • శిస్తు చెల్లించని సాగుదారులు

  • మెళియాపుట్టి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి):

  • మెళియాపుట్టి మండలం మర్రిపాడు-సి రెవెన్యూ పరిధిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం పేరిట రెండు సర్వే నెంబర్లలో 103.40 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిలో కొంతమంది అక్రమార్కులు షెడ్‌లు ఏర్పాటు చేశారు. అలాగే కొండపై స్థలాన్ని సైతం ఆక్రమించి గ్రానైట్‌ క్వారీ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దేవదాయశాఖకు మాత్రం శిస్తు చెల్లించడం లేదు.

  • టెక్కలి మండలం నర్సింగపల్లి సమీపంలో రాధాకాంతమఠానికి చెందిన 111 ఎకరాల భూమి ఉంది. కొన్నేళ్ల నుంచి ఈ భూములను సాగు చేస్తున్నవారు.. దేవదాయశాఖకు పైసా చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు.

  • టెక్కలి మేజర్‌ పంచాయతీ చిన్నబజారు వద్ద లక్ష్మీబాలాజీ మఠానికి చెందిన 2.17 సెంట్ల భూమిలో కొంతమంది అక్రమంగా ఇళ్లు, షాపులు నిర్మించారు. అనుమతి లేకుండా సుమారు 90 ఇళ్లు నిర్మించినట్టు దేవదాయశాఖ అధికారులు గుర్తించారు. కానీ, ఇంతవరకు నిర్మాణదారులపై చర్యలు తీసుకోలేదు.

  • టెక్కలి మండలం ఎండలమల్లికార్జున స్వామి ఆలయానికి సంబంధించి 5.46 సెంట్లు భూమి ఉంది. దేవదాయశాఖకు ఏడాదికి శిస్తుల రూపంలో రూ.86 వేలు వరకు రావలసి ఉంది. కానీ ఇంతవరకూ వసూలు కాలేదు.

  • ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. జిల్లాలోని వివిధ ఆలయాలకు సంబంధించి 12,090,68 ఎకరాలు భూమి ఉండాల్సి ఉండగా.. ఇందులో 3,114.75 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు అధికారులు గుర్తించారు. పట్టణాలతోపాటు గ్రామీణప్రాంతాల్లో సైతం భూముల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కొంతమంది అక్రమార్కులు ఆలయ భూములపై కన్నేసి.. ఆక్రమిస్తున్నారు. అనధికారికంగా భవనాలు, షాపులు నిర్మిస్తున్నారు. మరికొంతమంది ఆక్రమించిన స్థలాలను విక్రయిస్తున్నారు. ఇంకొందరు మాన్యం తీసుకున్న భూములకు సంబంధించి దేవదాయశాఖకు శిస్తు కట్టడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా శిస్తు సక్రమంగా వసూలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

  • వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు కొంతమంది రీ సర్వే పేరిట.. దేవదాయ భూములను తాము సాగు చేస్తున్నట్టు చూపించి పేర్లు నమోదు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని 22-ఏలో చేర్చే క్రమంలో వేల ఎకరాల భూములు చేతులు మారినట్టు తెలుస్తోంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం.. 22-ఏ భూములు గుర్తించి.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను సరిచేయడానికి రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేసింది. దీని ద్వారా వివరాలు సేకరిస్తోంది.

  • సిబ్బంది లేక

  • దేవదాయశాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లాలో 795 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కేవలం 93 మంది ఈవోలు మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్కో ఈవోకు సుమారు పది నుంచి పదిహేను దేవాలయాలకు చొప్పున ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. వీటి పరిధిలో ఉన్న వందలాది ఎకరాల భూముల పర్యవేక్షణ భారమవుతోందని అధికారులు చెబుతున్నారు.

  • అధికంగా దేవదాయశాఖ సంబంధించి మాన్యం రూపంలో వ్యవసాయ భూముల్లో 1,710.46 ఎకరాలు అనధికారికంగా సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. కౌలు రూపంలో దేవదాయశాఖకు సాగుదారులు శిస్తు చెల్లిస్తే.. ఆ ఆదాయంతో ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వీలుంటుంది. కాగా సాగు చేస్తున్నవారు శిస్తు చెల్లించకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పూర్తిస్థాయిలో శిస్తు వసూలు కావడం లేదని.. తద్వారా ఆయా ఆలయాల అభివృద్ధి కుంటుపడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఆలయ భూములను పరిరక్షించాలని కోరుతున్నారు.

  • వసూలు చేస్తున్నాం

  • మా పరిధిలో ఉన్న సుమారు 14 దేవాలయాలకు సంబంధించి భూములను సాగు చేస్తున్న రైతులకు శిస్తు కట్టాలని నోటీసులు ఇచ్చాం. సిబ్బందిని రైతుల వద్దకు పంపించి శిస్తు వసూలు చేస్తున్నాం.

    వాసుదేవరావు, ఈవో, పాతపట్నం

Updated Date - Feb 07 , 2026 | 12:10 AM