అంతులేని నిర్లక్ష్యం
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:23 AM
Drinking water pipelines merged with sewers శ్రీకాకుళం నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత రెండురోజుల నుంచి డయేరియా విజృంభించి ఒకరు మృతి చెందగా.. చాలామంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇందుకు ప్రధాన కారణం తాగునీరు కలుషితం కావడమే.
మురుగు కాలువలో కలిసిన తాగునీటి పైపులైన్లు
కలుషితనీరు తాగిన వారికి వాంతులు, విరేచనాలు
ముందే అప్రమత్తం చేయకపోవడం వల్లే డయేరియా
ఆర్థిక పరిస్థితి బాగున్నవారు ప్రైవేటు ఆసుపత్రికి..
పేద, మధ్యతరగతి వర్గాలు ప్రభుత్వ ఆసుపత్రికి..
శ్రీకాకుళం అర్బన్, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత రెండురోజుల నుంచి డయేరియా విజృంభించి ఒకరు మృతి చెందగా.. చాలామంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇందుకు ప్రధాన కారణం తాగునీరు కలుషితం కావడమే. వారం రోజులుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మురుగునీటి కాలువలను శుభ్రపరిచే పనుల్లో భాగంగా... కొన్ని చోట్ల తవ్వకాలు చేపట్టారు. యంత్రాలను ఉపయోగించారు. కొన్నిచోట్ల గోతులను తవ్వారు. దీంతో కాలువలకు ఆనుకుని ఉన్న తాగునీటి పైపులైన్లు పగిలిపోయాయి. దీంతో నీరు కలుషితమై పోయింది.
దశాబ్దాల క్రితం నాటి పైపులైన్లు..
నగర పాలక సంస్థ పరిధిలో డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థలు మెరుగ్గాలేవు. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదు. మురుగునీటి కాలువలకు ఆనుకునే తాగునీటి పైపులు ఉన్నాయి. దశాబ్దాలుగా కాలువల్లో పేరుకుపోయిన మురుగును శుభ్రపరిచేందుకు ఇనాళ్లకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ కాలువలు శుభ్రం చేసిన సమయంలో పైపులైన్లు పగిలిపోయాయి. అప్పటికే మురుగునీటిలోనే మునుగుతూ.. తేలుతూ ఉన్న పైపులైన్లు లీకులు ఏర్పడి కలుషితమయ్యాయి. దీంతో నగరంలోని 38, 39, 43 డివిజన్ల పరిధిలోని దమ్మలవీధి, గోల్కొండరేవు, కాకివీధి, సారంగడాల వీధి, ఎచ్చెర్లవారి వీధి, గుడివీధి, కుమ్మరివీధి, రంగిరీజు వీధిల్లో డయేరియా ప్రబలిపోయింది. రెండు రోజుల వ్యవధిలో ప్రజలు వాంతులు, విరోచనాలతో ఆసుపత్రుల్లో చేరారు. అధికారికంగా ఒకరు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు.
ముందే అప్రమత్తం అయ్యుంటే..
నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల పెద్దఎత్తున పనులు చేపడుతున్నారు. రోడ్ల వెడల్పుతో పాటు కాలువల్లో పూడికతీత చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కకాలువ కూడా శుభ్రం చేసిన దాఖలాలులేవాయె. అప్పటి ప్రజాప్రతినిధులు కూడా ఇదే విషయమై సమీక్ష జరపలేదు. ఇప్పుడు పనులు స్పీడు పెంచినా జాగ్రత్తలు పాటించకపోవడం.. పైపులైన్లు పగిలిపోవడం.. తాగునీరు కలుషితమైనా నగరపాలక సంస్థ సిబ్బంది గుర్తించకపోవడం.. డయేరియా ప్రబలడానికి కారణమైంది. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీచేసి.. శుద్ధమైన నీటిని సరఫరా చేసి ఉండిఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
డయేరియా తీవ్రంగా ప్రబలిపోయింది. ప్రజలు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.
డయేరియా అదుపులోకి వచ్చేవరకు రోగులు, కుటుంబ సభ్యులు బయట జంక్‌ఫుడ్ జోలికి వెళ్లకూడదు. కాచి చల్లార్చిన నీటినే తీసుకోవాలి. పిల్లలు పట్ల మరింత జాగ్రత్త వహించాల్సిందే.
పరిస్థితి విషమించేవరకు వేచిచూడకుండా ఒకటి, రెండు వాంతులు, విరోచనాలు కాగానే తక్షణమే ఆసుపత్రిలో చేరిపోవాలి. శరీరంలో డీహైడ్రేషన్ రాకుండా వైద్యసిబ్బంది చెప్పిన సూచనలు పాటించాలి.
ఎట్టిపరిస్థితుల్లోనూ సొంతవైద్యం, మందుల దుకాణాల్లో మాత్రలు కొనుగోలు చేసి వాడకూడదు. ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందడం ఉత్తమం.
శరీరంలో నీటి శాతం కోల్పోతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఆహారం సైతం శుభ్రంగా ఉండేలా స్వీయజాగ్రత్తలు తీసుకోవాలి.