పదవీ కాలం ముగింపు
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:42 AM
మండల పరిషత్ అధ్యక్షుల పాలన బుధవారంతో ముగిసింది. జడ్పీటీసీ సభ్యులు, జడ్పీచైర్మన్ పదవీకాలం గురువారం ముగియనుంది.
ఇక మాజీలు కానున్న ఎంపీపీలు, ఎంపీటీసీలు
నేడు జడ్పీటీసీల పదవీ గడువు పూర్తి
రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన
శ్రీకాకుళం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): మండల పరిషత్ అధ్యక్షుల పాలన బుధవారంతో ముగిసింది. జడ్పీటీసీ సభ్యులు, జడ్పీచైర్మన్ పదవీకాలం గురువారం ముగియనుంది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 2021లో జరిగిన ఎన్నికల్లో 38 జడ్పీటీసీ స్థానాలకు గాను 37 స్థానాల్లో వైసీపీ గెలుచుకుంది. హిరమండలం జడ్పీటీసీ స్థానాన్ని మాత్రం తెలుగుదేశం గెలుచుకుంది. అప్పట్లో జడ్పీటీసీ, ఇటు ఎంపీటీసీ ఎన్నికలకు అభ్యర్థులను నిలబెట్టే విషయం నుంచి.. పోటీలో నిలిచే వరకు కూడా.. అప్పటి వైసీపీ అధికారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని.. తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు మూటకట్టుకుంది. అయితే జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం ఎన్నికల్లో తమ సత్తాను చూపారు. శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటుగా.. అన్ని నియోజకవర్గాల్లోనూ నిలిచి.. ఎన్నికలు ఏకపక్షంగా కాకుండా తమ ఉనికిని, బలాన్ని కూడా చూపించుకున్నారు.
మండల పరిషత్ స్థానాలు అన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు ఒరిగిందేమీలేదాయె. పల్లె రోడ్లు.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఇలా అన్ని విషయాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి 2024లో కూటమికి జై కొట్టారు. జిల్లా మొత్తం వైసీపీ హవా ఉన్నా.. స్థానిక సంస్థలన్నీ వైసీపీ నాయకుల చేతిలో ఉన్నా .. ఇవేవీ కూటమి విజయాన్ని అడ్డుకోలేకపోయి. వాస్తవంగా కూటమి అధికారంలోకి వచ్చాకనే.. అన్ని నియోజకవర్గాల్లో రోడ్లు బాగుచేశారు. వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కేవలం రైతుభరోసా కేంద్రాలు, సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలను అసంపూర్తిగానే చేపట్టి వదిలేశారు. కాంట్రాక్టర్లుకు ఇప్పటికీ బిల్లులు చెల్లింపులు జరగలేదు. పైగా జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రతిదఫా రాజకీయ ఉనికిని చాటుకునేందుకే ఎంపీపీలు, జడ్పీటీసీలు మొగ్గుచూపి.. ఇక్కడ కూడా జగన్‌పై అభిమానం.. కూటమిపై వ్యతిరేక విమర్శలు చేశారు. దీంతో 2024 జూన్ నుంచి ఇప్పటివరకు తమదైన శైలిలో స్థానిక సంస్థల ప్రతినిధులు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఇకనుంచి ఎంపీపీలు, జడ్పీటీసీలకు పదవీకాలం ముగిసినట్లే.
ప్రత్యేకాధికారుల పాలనలోకి..
జిల్లా పరిషత్‌కు ఈ నెల 25 నుంచి కలెక్టర్ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తారు మండల పరిషత్‌లకు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తారు. ప్రజలకు అవసరమైన చర్యలు, ఇతరత్రా అంశాలన్ని ఇకపై ప్రత్యేకాధికారుల పాలనలో జరగనున్నాయి. నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పర్యవేక్షణ ఉంటుంది.