వంశధార కాలువ కబ్జా
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:44 PM
Encroachments are on the rise నరసన్నపేటలో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఖాళీ స్థలాలే కాదు కాలువలను సైతం అక్రమార్కులు వదలడం లేదు. నరసన్నపేట జాతీయ రహదారి పక్కనే.. జమ్ముజంక్షన్ వద్ద ఎన్బీసీ కాలువగట్టును చదును చేసి.. వంశధార స్థలం ఆక్రమణకు కొంతమంది యత్నిస్తున్నారు.
జమ్ముజంక్షన్ వద్ద స్థలంపై అక్రమార్కుల కన్ను
నరసన్నపేట, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఖాళీ స్థలాలే కాదు కాలువలను సైతం అక్రమార్కులు వదలడం లేదు. నరసన్నపేట జాతీయ రహదారి పక్కనే.. జమ్ముజంక్షన్ వద్ద ఎన్బీసీ కాలువగట్టును చదును చేసి.. వంశధార స్థలం ఆక్రమణకు కొంతమంది యత్నిస్తున్నారు. సుమారు రూ.1.5 కోట్లు విలువైన ఈ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. గురువారం యంత్రాలతో కాలువ గట్టు పక్కనే ఉన్న ప్రదేశాన్ని చదును చేశారు. అక్కడ దుకాణాలను క్రమేపీ తొలగించి.. ఈ స్థలాన్ని యూనియన్ భవనం పేరుతో ఆక్రమించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్థలం వెనుకభాగాన సుమారు 20సెంట్లు ప్రభుత్వ స్థలం ఇప్పటికే ఆక్రమణకు గురైంది. ఇప్పుడిప్పుడే వాణిజ్యపరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో.. ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. నరసన్నపేటలో ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో విఫలం చెందారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సిఫార్సుల మేరకు ఈనెల 5న ఏడుగురు తహసీల్దార్లు, 12 మంది వీఆర్వోలపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపఽథ్యంలో జమ్ము రోడ్డులో ఆక్రమణలు మళ్లీ తెరపైకి రావడం గమనార్హం. ఇటీవల రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత కూడా ఆక్రమణలకు యత్నించడం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయమై నరసన్నపేటలోని వంశధార ఈఈ మురళీమోహనరావు వద్ద ప్రస్తావించగా.. వంశధార స్థలాలను ఆక్రమించేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా తొలగిస్తామన్నారు.