Share News

పాలకర్ర చెరువు ఆక్రమణ

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:36 PM

పట్టణంలోని మసీదు పక్కన పాలకర్ర చెరువులో జరుగుతున్న ఆక్రమణలను అధికారులు ఆదివారం అడ్డుకున్నారు.

  పాలకర్ర చెరువు ఆక్రమణ
మసీదు పక్కనే పాలకర్ర చెరువులో మట్టిని చదును చేస్తున్న దృశ్యం

- పోలీసులకు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు

నరసన్నపేట, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మసీదు పక్కన పాలకర్ర చెరువులో జరుగుతున్న ఆక్రమణలను అధికారులు ఆదివారం అడ్డుకున్నారు. ఆక్రమణదారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ నడిబొడ్డున గొట్టిపల్లి రెవెన్యూలో సర్వేనెంబరు 178/2సిలో 4.15 ఎకరాల్లో పాలకర్ర చెరువు ఉంది. ఈ చెరువు ఇప్పటికే దాదాపు 60శాతం మేరకు ఆక్రమణకు గురైంది. ఓ వ్యాపారి ఆదివారం రెండు ట్రాక్టర్లతో మట్టి తీసుకువచ్చి చెరువును కప్పేందుకు ఉపక్రమించాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని ఆక్రమణలను అడ్డుకున్నారు. వ్యాపారి, ట్రాక్టర్ల యాజమానులపై నరసన్నపేట పోలీసులకు గొట్టిపల్లి వీఆర్వో శ్యామ్‌కుమార్‌ ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ ఆక్రమణలపై ‘ఆంధ్రజ్యోతి’ గతనెల 18న కథనం ప్రచురించింది. అప్పట్లో కొద్దిరోజులు ఆక్రమణలను అధికారులు అడ్డుకున్నా పైరవీలతో ఆక్రమణదారులు మళ్లీ నిర్మాణాలు చేపట్టేందుకు పనులు ప్రారంభించారు. ఇటీవల నరసన్నపేటలో ప్రభుత్వ భూముల పరిరక్షణలో రెవెన్యూ అధికారులు వైఫల్యంపై విజలెన్స్‌ అధికారులు కొరడా ఝుళిపించారు. దీంతో సంబంధిత అధికారులు ఆదివారం ఆగమేఘాలమీద ఆక్రమణలను అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Aug 09 , 2026 | 11:36 PM