రూ.1.80కోట్ల విలువైన 18 సెంట్లు ఆక్రమణ
ABN , Publish Date - May 25 , 2026 | 11:54 PM
Flood canal occupation పలాస పురుషోత్తపురం ఎర్రచెరువు కాలువకు సంబంధించి రూ.1.80కోట్ల విలువైన 18 సెంట్లు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఎర్రచెరువు కాలువ కబ్జా చేసి.. భారీ రియల్‌ఎస్టేట్ వేస్తున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ‘వరద కాలువ కబ్జా’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
వరదకాలువ కబ్జాపై కదిలిన అధికారులు
ఎమ్మెల్యే శిరీష ఆదేశాల మేరకు పరిశీలన.. నివేదిక
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
పలాస, మే 25(ఆంధ్రజ్యోతి): పలాస పురుషోత్తపురం ఎర్రచెరువు కాలువకు సంబంధించి రూ.1.80కోట్ల విలువైన 18 సెంట్లు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఎర్రచెరువు కాలువ కబ్జా చేసి.. భారీ రియల్‌ఎస్టేట్ వేస్తున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ‘వరద కాలువ కబ్జా’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందిస్తూ.. స్థలాన్ని పరిశీలించి నివేదిక అందజేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఉదయం తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి, మునిసిపల్ కమిషనర్ ఇ.శ్రీనివాసులు, సర్వేయర్ వై.గిరి, డిప్యూటీ తహసీల్దార్ వి.గిరి, టీపీఓ హర్ష, సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొత్తం చదును చేసిన భూమంతా కొలతలు వేసి హద్దులు గుర్తించారు. ముందు భాగాన 11 సెంట్లు, వెనుక భాగాన ఏడు సెంట్ల స్థలం ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు. వీటి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.1.80 కోట్ల ఉంటుందని అంచనా.
ఈ ప్రాంతంలో రెండు వైపులా పురుషోత్తపురం ఎర్రచెరువుకు వేళ్లే నీటి మార్గాలు ఉన్నాయి. ఒక మార్గంలో రహదారి వేయగా, మరోమార్గం ఖాళీగా ఉంది. దీనిపై పర్యవేక్షణ లేక కాలువ ప్రాంతమంతా కప్పి పక్కాగృహాలు నిర్మించుకున్నారు. వారం రోజులుగా ఈ ప్రాంతంలో జిరాయితీ స్థలాన్ని అమ్మకానికి పెట్టిన యజమానులు మొత్తం రెండు కాలువలను కప్పి రియల్‌ఎస్టేట్ వెంచర్ వేశారు. దీంతోపాటు అనుమతులు లేకుండా రూ.30లక్షల విలువైన కంకర, మట్టిని తరలించి.. ఆ వెంచర్‌ను చదును చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఈ అక్రమాలు వెలుగులోకి రావడంతో అధికారులు స్పందించి పరిశీలించారు. సంబంధిత యజమానులు, మట్టి వేసిన ఎక్స్‌కవేటర్, ట్రిప్పర్ల యజమానులకు నోటీసులు ఇస్తామని తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి తెలిపారు. అలాగే కాలువ విస్తీర్ణం, కబ్జాకు గురైన ప్రాంతం, స్థల యాజమానుల వివరాలపై నివేదికను ఎమ్మెల్యే శిరీష కార్యాలయానికి పంపామన్నారు. ఈ స్థలంలో క్రయవిక్రయాలు చేయొద్దని, ఆక్రమణలు తొలగించాలని, అనుమతులు తీసుకొని వెంచర్లు వేసుకోవచ్చని కమిషనర్ ఇ.శ్రీనివాసులు స్పష్టం చేశారు.