Share News

గట్లను ఆక్రమించి.. పొలాలుగా మార్చి

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:27 AM

Encroachment of Vamsadhara Right Canal ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పంట పొలాలకు సాగునీరందించేందుకు ప్రాజెక్టులు నిర్మించి అందుకు అనుసంధానంగా ప్రధాన కాలువలు, పిల్ల కాలువలను నిర్మించింది. అయితే, కొన్నిచోట్ల ఈ కాలువ గట్లు ఆక్రమణకు గురవుతున్నాయి.

 గట్లను ఆక్రమించి.. పొలాలుగా మార్చి
శ్యామలాపురం సమీపంలో ప్రధాన కాలువ గట్టును తవ్వి.. పొలంగా మార్చిన ఆక్రమణదారులు

వంశధార కుడి కాలువ గట్లు కబ్జా

మట్టిని తవ్వేస్తున్న వైనం

పట్టించుకోని అధికారులు

ఎల్‌.ఎన్‌.పేట, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పంట పొలాలకు సాగునీరందించేందుకు ప్రాజెక్టులు నిర్మించి అందుకు అనుసంధానంగా ప్రధాన కాలువలు, పిల్ల కాలువలను నిర్మించింది. అయితే, కొన్నిచోట్ల ఈ కాలువ గట్లు ఆక్రమణకు గురవుతున్నాయి. కొందరు గట్లను కబ్జా చేసి పొలాలుగా మార్చేస్తున్నారు. గట్లుగా వేసిన మట్టిని యంత్రాలతో తవ్వేసి చదును చేస్తున్నారు. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎల్‌.ఎన్‌.పేట మండలంలోని శ్యామలాపురం డొంకలబడవంజ తదితర గ్రామాల్లో వంశధార కుడి కాలువ గట్లు ఆక్రమణకు గురయ్యాయి. ప్రధాన కాలువకు ఆనుకొని పొలాలు ఉన్న కొందరు రైతులు యంత్రాలతో గట్లను తవ్వేసి తమ పొలాల్లో కలుపుకొంటున్నారు. వీరు కాంట్రాక్టర్లను సంప్రదించి గట్టు మట్టిని లక్షల రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనివల్ల నీరు విడిచిపెట్టేటప్పుడు కాలువకు గండ్లు పడి పంటలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని మిగతా రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ సంవత్సరం కాలువ గట్లు ఆక్రమణకు గురవుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. దీనిపై వంశధార ఏఈ శ్రీనివాసరావును వివరణ కోరగా.. ‘కాలువ గట్లను పరిశీలించి ఆక్రమణలను గుర్తిస్తాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఆక్రమణలను తొలగించేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు.

Updated Date - Jun 29 , 2026 | 12:27 AM