‘ఓజేటీతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు’
ABN , Publish Date - Nov 20 , 2026 | 11:45 PM
జిల్లాలో వృత్తి విద్యాకోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు ఆన్ ద జాబ్ ట్రైనింగ్(ఓజేటీ)ను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి ఆర్.సురేష్ కుమార్ సూచించారు.
హిరమండలం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వృత్తి విద్యాకోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు ఆన్ ద జాబ్ ట్రైనింగ్(ఓజేటీ)ను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి ఆర్.సురేష్ కుమార్ సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృత్తి విద్యాకోర్సు చదువుతున్న విద్యార్థులు చేపడుతున్న ఓజేటీ కార్యక్రమాన్ని జిల్లా కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పరిశ్రమలు, వివిధ సంస్థల్లో ప్రత్యక్ష శిక్షణ పొందడం ద్వారా వృత్తిపరమైన అనుభవం లభిస్తుందని అన్నారు. భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది ఎంతగానో దోహద పడుతుందని చెప్పారు. వర్కుషాపుల్లో శిక్షణ పొందుతున్న ఎంఏటీ, ఈఈటీ విద్యార్థులతో మాట్లాడి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.అప్పలరాం, కమిటీ సభ్యులు రాంప్రసాద్, రవిబాబు, అధ్యాపకులు బుచ్చబ్బాయి, విశ్వనాథ పాణిగ్రాహి, ఎ.శివకుమార్, కొత్తకోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.