Share News

ఆరు నెలల్లో విద్యుత్‌ బస్సులు

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:11 AM

The goal is the welfare of employees ‘ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించేలా ఆరునెలల్లో కొత్త విద్యుత్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యమ’ని ఆర్టీసీ ఎమ్‌డీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

ఆరు నెలల్లో విద్యుత్‌ బస్సులు
మాట్లాడుతున్న ఆర్టీసీ ఎమ్‌డీ ద్వారకా తిరుమలరావు

సంక్రాంతికి రికార్డుస్థాయిలో ఆదాయం

సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం

ఆర్టీసీ ఎమ్‌డీ ద్వారకా తిరుమలరావు

అరసవల్లి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ‘ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించేలా ఆరునెలల్లో కొత్త విద్యుత్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యమ’ని ఆర్టీసీ ఎమ్‌డీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ 2వ డిపో ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఉత్తమ సేవలందించిన డ్రైవర్లను, ఉద్యోగులను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘సంక్రాంతికి ఆర్టీసీ అద్భుతమైన సేవలందించి, రికార్డుస్థాయిలో ఆదాయాన్ని సాధించింది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేలా ‘స్త్రీ శక్తి’ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ పథకం విజయవంతానికి ఆర్టీసీ ఉద్యోగుల శ్రమ, అంకితభావమే నిదర్శనం. డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇటీవల ఢిల్లీ వెళ్లా. 1,050 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తున్నాయి. దీంతో ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలిందిస్తాం. వీటికి సంబంధించి చార్జింగ్‌ స్టేషన్లు నిర్మించాల్సి ఉంద’ని తెలిపారు. కార్యక్రమంలో ఈడీ ఆపరేషన్స్‌ అంధవరపు అప్పలరాజు, ఈడీ విజయనగరం జోన్‌-1 విజయగీత, జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్‌ అప్పలనారాయణ, విజయనగరం జోన్‌-1 డిప్యూటీ సీఎంఈ కె.శ్రీనివాసరావు, సూపర్‌వైజర్లు, అసోసియేషన్‌ నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 12:11 AM