Share News

జూన్‌ నాటికి విద్యుత్‌ బస్సులు

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:05 AM

Electric buses అమలాపురం - ఇచ్ఛాపురం ప్రాంతాల్లోని ఆర్టీసీ డిపోల్లో రానున్న జూన్‌ నాటికి వంద విద్యుత్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నామని ఆర్టీసీ జోనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విజయగీత తెలిపారు.

జూన్‌ నాటికి విద్యుత్‌ బస్సులు
పలాసలోని ఆర్టీసీ డిపో ఆవరణలో మొక్కలు నాటుతున్న ఈడీ విజయగీత

ఆర్టీసీ ఈడీ విజయగీత

పలాస, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): అమలాపురం - ఇచ్ఛాపురం ప్రాంతాల్లోని ఆర్టీసీ డిపోల్లో రానున్న జూన్‌ నాటికి వంద విద్యుత్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నామని ఆర్టీసీ జోనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విజయగీత తెలిపారు. శనివారం పలాసలో ఆర్టీసీ డిపోను ఆమె పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. డిపో ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. ‘విద్యుత్‌ బస్సుల వల్ల ఇంధనం ఆదా అవుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే అనేక డిపోల్లో విద్యుత్‌ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. సిబ్బంది కొరత అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. డ్రైవర్లు, కండక్టర్లను ఒప్పంద ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటామ’ని తెలిపారు. గతంలో పలాస నుంచి దూర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉండేదని, ఇంద్ర ఏసీ బస్సులు కూడా వినియోగంలో ఉండేవని, వీటిని ఎందుకు తొలగించాల్సి వచ్చిందని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై సర్వే చేయిస్తామని, అవసరమైన పక్షంలో మళ్లీ బస్సు సౌకర్యం కల్పిస్తామని ఈడీ తెలిపారు. శ్రీకాకుళం డిపో నుంచి రెండు ఏసీ బస్సులు నడిపిస్తున్నామని, ఆశించినంతగా లాభాలు రావడం లేదన్నారు. జిల్లాలో పలాస డిపో నుంచే అధికంగా 74 బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. స్త్రీశక్తి పథకం వల్ల బస్సుల కొరత ఏర్పడిందని, దీన్ని అధిగమించేందుకు విద్యుత్‌ బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీపీటీవో అప్పలనారాయణ, జోనల్‌ డిప్యూటీ సీటీఎం సత్యనారాయణ, ఇన్‌చార్జి డిపో మేనేజర్‌ ఎన్‌.శ్రీనివాసరావు, కరుణశ్రీ, ఉద్యోగుల సంఘం నాయకులు ఎంఏ.రాజు, దిలీప్‌కుమార్‌, సూర్యనారాయణతోపాటు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2026 | 12:05 AM