ఆ రెండు చోట్లా ఎన్నికలు
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:19 AM
Identification of voters in Srikakulam Corporation and Amadalavalasa Municipality కోర్టు కేసులు.. ఇతరత్రా కారణాలతో పెండింగ్‌లో ఉన్న పురపాలక సంఘాల్లో కూడా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. మేయర్, చైర్పర్సన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు వీలుగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం శుక్రవారం జీవో 1298 జారీ చేసింది.
శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస మునిసిపాలిటీల్లో..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు షెడ్యూల్ విడుదల
29న తుది జాబితాల ప్రచురణ
శ్రీకాకుళం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): కోర్టు కేసులు.. ఇతరత్రా కారణాలతో పెండింగ్‌లో ఉన్న పురపాలక సంఘాల్లో కూడా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. మేయర్, చైర్పర్సన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు వీలుగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం శుక్రవారం జీవో 1298 జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4 నగరపాలక సంస్థలు, 19 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఓటర్ల గుర్తింపునకు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్ ఉత్తర్వులు, షెడ్యూల్ విడుదల చేశారు. ఐదు రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి వార్డుల వారీగా తుదిజాబితాను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ జాబితాలో జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస మునిసిపాలిటీలు ఉన్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ రెండు చోట్ల అధికారులు వార్డులవారీ సర్వే చేయనున్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించనున్నారు.
ఈ నెల 25, 26న ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్లను గుర్తిస్తారు.
27న ఫారం-1లో మార్కింగ్ చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాను మునిసిపల్, ఆర్డీవో, తహసీల్దార్ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురిస్తారు.
28న అభ్యంతరాలు, క్లయిమ్‌ల స్వీకరణకు సమయం కేటాయించారు. క్లయిమ్‌లను ఫారం-2 ద్వారా, అభ్యంతరాలను ఫారం-3 ద్వారా స్వీకరిస్తారు. వచ్చిన క్లయిమ్‌ల జాబితాను నోటీసు బోర్డుపై ప్రదర్శిస్తారు. అభ్యంతరాలకు సంబంధించి నోటీసులు జారీ చేస్తారు.
29న క్షేత్రస్థాయిలో క్లయిమ్‌లు, అభ్యంతరాలను అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారు. అనంతరం ఓటర్ల జాబితాలో అవసరమైన మార్పులు చేసి.. ఫారం-6లో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఈ తుదిజాబితాను ఏపీ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌కు సమర్పిస్తారు.