పాఠశాలలకు ఎన్నికలొచ్చాయ్
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:30 AM
SMC election on the 29th ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల నగారా మోగింది. పాఠశాలల అభివృద్ధిలో కీలకమైన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనుంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మోగిన ‘ఎస్‌ఎంసీ’ నగారా
29న ఎలక్షన్‌కు నోటిఫికేషన్ జారీ
శ్రీకాకుళం ఎడ్యుకేషన్/ పొందూరు, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల నగారా మోగింది. పాఠశాలల అభివృద్ధిలో కీలకమైన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనుంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 2,612 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల పేర్ల (ఓటర్లు) జాబితాను ఈ నెల 18న ప్రచురిస్తారు. వాటిపై ఏవైనా అభ్యంతరాలు స్వీకరిస్తారు. 25న తుదిజాబితా ప్రచురిస్తారు. 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఎన్నికలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించి.. ప్రమాణ స్వీకరణ చేయిస్తారు. అనంతరం ‘ఎస్‌ఎంసీ’ మొదటి సమావేశం నిర్వహించనున్నారు.
సభ్యుల ప్రాతినిఽథ్యం ఇలా
పాఠశాల విద్యార్థుల సంఖ్య ఆధారంగా కమిటీ సభ్యులు ఉంటారు. 100 మంది విద్యార్థుల వరకు 12 నుంచి 15 మంది, 100-500 మంది ఉంటే 15-20 మంది, 500 కన్నా విద్యార్థులు ఎక్కువ ఉంటే 20 నుంచి 25 మంది సభ్యులు ఉంటారు. మొత్తం సభ్యుల్లో పిల్లల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు 75శాతం మంది ఎన్నుకుంటారు. మిగిలిన 25శాతం మందిలో 1/3 మంతు మంది స్థానిక సంస్థల ఎన్నికైన ప్రతినిధులు, 1/3 మంది పాఠశాల ఉపాధ్యాయులు, 1/3 మంది స్థానిక విద్యావేత్తలు, పూర్వవిద్యార్థులు, ఏఎన్‌ఎంలు, ఆశ, అంగన్‌వాడీ నుంచి ఎంపిక చేస్తారు.
మొత్తం స్కూల్ కమిటీలో 50 శాతం మంది మహిళలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజికవర్గాలు, దివ్యాంగుల తల్లిదండ్రులకు తగిన ప్రాతినిథ్యం ఇవ్వాలి.
ఎన్నికల విధానం ఇలా..
ప్రతి విద్యార్థికి ఒక తల్లి.. తండ్రి లేదా సంరక్షకుడు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హులు.
అభ్యర్థుల సంఖ్య సీట్ల కంటే ఎక్కువైతే చేతులు ఎత్తడం లేదా వాయిస్ ఓటింగ్ ద్వారా ఎన్నిక నిర్వహించవచ్చు.
వివాదం ఏర్పడితే రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించాలి. ఓటింగ్ సమయంలో కనీసం 50శాతం తల్లిదండ్రులు హాజరు కావాలి. ఎన్నికల ప్రక్రియను విద్యాశాఖ అధికారి లేదా ఆధీకృత ప్రతినిధి పర్యవేక్షించవచ్చును
ఎస్‌ఎంసీ సభ్యులు పదవీకాలం రెండేళ్లు. ఒక సభ్యుడు వరుసుగా రెండు పదవీకాలాలకు మించి కొనసాగరాదు. సభ్యులకు, కార్యదర్శికి ఈ పరిమితి వర్తించదు.
అభివృద్ధికి అడుగులు
‘పాఠశాల అభివృద్ధిలో ఎస్‌ఎంసీ సభ్యులు కీలకపాత్ర పోషించాలి. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా ప్రయత్నించాలి. ప్రభుత్వ పథకాలను విద్యార్థులకు సక్రమంగా అందేలా చూడాలి. పాఠశాలల్లో విద్యాప్రమాణాల స్థాయిను తెలుసుకొని ఉపాధ్యాయులకు సలహా ఇవ్వాలి. ప్రభుత్వ నిధులు సక్రమంగా వినియోగమయ్యేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో సమన్వయంతో పనిచేయాలి. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకుగానూ ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశామ’ని డీఈవో రవిబాబు, సమగ్రశిక్షా ఏపీసీ పప్పల వేణుగోపాలరావు తెలిపారు.