Share News

ఎన్నికలతో పంచాయతీలకు కాసులు

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:48 PM

పల్లె పోరు వేళ గ్రామ పంచాయతీలకు కొంత మేర కాసులు కురవనున్నాయి.

 ఎన్నికలతో పంచాయతీలకు కాసులు

-పోటీచేసే అభ్యర్థులు పన్నులు చెల్లించాల్సిందే

- వీరిని బలపరిచే వారు కూడా..

- జిల్లాలో 50వేల మంది చెల్లిస్తారని అంచనా

- ఒక్కో పంచాయతీకి రూ.20వేల ఆదాయం

- బకాయిలకూ కలగనున్న మోక్షం

నరసన్నపేట, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పల్లె పోరు వేళ గ్రామ పంచాయతీలకు కొంత మేర కాసులు కురవనున్నాయి. దాదాపు ఆరు నెలలుగా పంచాయతీలకు ఎన్నికలు లేకపోవడం, ప్రభుత్వం నుంచి నిధులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు మందగించాయి. పాలకులు లేకపోవడంతో పన్నుల వసూలు కూడా అంతంత మాత్రంగానే జరుగుతోంది. ప్రజలు చెల్లించే పన్నులతోనే కొన్ని పంచాయతీల్లో చిన్నచిన్న పనులు చేయిస్తున్న దుస్థితి. అయితే, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీలకు కొంతమేర ఆదాయం సమకూరనుంది. సర్పంచ్‌లుగా పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటి పన్ను పూర్తిగా చెల్లించి నోడ్యూస్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. సాధారణంగా ఇంటి పన్నుల చెల్లింపు ఆర్థిక సంవత్సరం ఆఖరులో ఆరంభమై రెండు మూడు నెలల పాటు కొనసాగుతుంది. అప్పుడు కూడా అందరూ చెల్లిస్తారనేది సందేహమే. అయితే ఎన్నికల బరిలో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నాలుగు నెలల ముందుగా పన్ను చెల్లించి రశీదు పాందాల్సి ఉంటుంది.

జిల్లాలో 901 పంచాయతీలు..

జిల్లాలోని 30 మండలాల్లో 901 పంచాయతీలు ఉన్నాయి. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత 8 మండలాల పరిధిలోని 224 పంచాయతీలకు, రెండో విడత 11 మండలాల్లో 347 పంచాయతీలకు, మూడో విడత మరో 11 మండలాల్లోని 330 పంచాయతీల్లో 8,548 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా పంచాయతీల్లో పోటీచేసే అభ్యర్థుల సంఖ్య రెండు మూడింతలు ఉంటుంది. వార్డులకు దాదాపు 25వేల మంది నామినేషన్లు వేసే అవకాశం ఉంది. బరిలో నిలిచే అభ్యర్థులంతా నామినేషన్‌తో పాటు తప్పనిసరిగా తమ ఇంటిపన్నును చెల్లించి రశీదును పొంది నామినేషన్‌ పత్రాలకు జతచేయాలి. వీరితో పాటు అభ్యర్థులను బలపరిచే వారు కూడా తప్పనిసరిగా ఇంటిపన్నును చెల్లించాల్సిందే. ఈ లెక్కన జిల్లాలో దాదాపు 50వేల మంది వరకు ముందస్తుగా ఇంటిపన్ను చెల్లించే అవకాశం ఉంటుందని అంచనా.

సమకూరనున్న ఆదాయం

పంచాయతీల్లో ఇంటిపన్ను చెల్లింపులు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. కొందరు రెగ్యులర్‌ పన్నులు చెల్లిస్తుంటే.. మరికొందరు అవసరం అయినపుడు మాత్రమే ఇంటి పన్ను కడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిపన్ను ప్రస్తుతం రూ.500 పైగా ఉంటుంది. మేజర్‌ పంచాయతీల్లో రూ.1000 నుంచి రూ.2వేల వరకు ఉంటుంది. ప్రస్తుతం పంచాయతీల్లో పదుల సంఖ్యలోనే నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది. పోటీచేసే ఆశావాహులు కూడా అధికంగా ఉండటంతో నామినేషన్లు కూడా అధికంగానే వేస్తారు. నామినేషన్‌ వేసే ప్రతిఒక్కరూ ముందుగానే పంచాయతీకి పన్నులు చెల్లించడం ద్వారా కొంతమేర ఆదాయం సమకూరుతుంది. ఒకవేళ ఇంటి పన్ను బకాయి ఉన్నా పూర్తిగా చెల్లిస్తేనే నోడ్యూ సర్టిఫికెట్‌ ఇస్తారు. అంటే కొన్ని చోట్ల బకాయిలు ఉంటే అవికూడా వసూలయ్యే అవకాశం ఉంది. ఒక్కో పంచాయతీకి కనీసం రూ.20వేలు ఆపైన ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Nov 11 , 2026 | 11:48 PM