Share News

నేటితో ప్రచారానికి తెర

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:13 AM

Campaigning stop at municipality జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస మునిసిపాలిటీ ఎన్నికల సమరం ఆఖరి అంకానికి చేరుకుంది. కొన్ని రోజులుగా హోరెత్తిన ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రం 5 గంటలతో తెరపడనుంది. ఈ నెల 26న పోలింగ్‌ జరగనుండగా, 30న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. బహిరంగ ప్రచారానికి కొద్ది గంటలే గడువు మిగిలి ఉండటంతో అభ్యర్థులు, పార్టీల నేతలు చివరి నిమిషంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

నేటితో ప్రచారానికి తెర

శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస మున్సిపాలిటీల్లో ముగియనున్న మైకుల హోరు

ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింటా ప్రచారంపై నిషేధం

ఈ నెల 26న పోలింగ్‌.. 30న ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి

ఇక తెరవెనుక వ్యూహాలు

శ్రీకాకుళం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస మునిసిపాలిటీ ఎన్నికల సమరం ఆఖరి అంకానికి చేరుకుంది. కొన్ని రోజులుగా హోరెత్తిన ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రం 5 గంటలతో తెరపడనుంది. ఈ నెల 26న పోలింగ్‌ జరగనుండగా, 30న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. బహిరంగ ప్రచారానికి కొద్ది గంటలే గడువు మిగిలి ఉండటంతో అభ్యర్థులు, పార్టీల నేతలు చివరి నిమిషంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థకు ఏకంగా 16 ఏళ్ల తర్వాత, ఆమదాలవలస మున్సిపాలిటీకి ఎనిమిదేళ్ల తర్వాతను ఎన్నికలు జరుగునుండటంతో... వీటిని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠగా తీసుకున్నాయి. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు సంబంధించి మేయర్‌ స్థానానికి ఐదుగురు, 60 డివిజన్లలో కార్పొరేటర్‌ స్థానాలకు 168 మంది పోటీ చేస్తున్నారు. ఇక ఆమదాలవలస మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌ స్థానానికి ముగ్గురు, 28వార్డుల్లో కౌన్సిలర్‌ స్థానాలకు 65 మంది బరిలో నిలిచారు.

ఇక ప్రలోభాల వల..

ఎన్నికల నిబంధనల ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారాలను పూర్తిగా నిలిపివేయాలి. ఆ సమయం దాటి తర్వాత ర్యాలీలు, బహిరంగ సభలు, ఊరేగింపులు, ఇంటింటి ప్రచారాలు నిర్వహించకూడదు. లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రచారంపైనా నిషేధం అమల్లోకి వస్తుంది. అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల ఏజెంట్లు, ప్రచాకర్తలు ఎవరూ సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారం చేయకూడదని, ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదని స్పష్టమైన ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక అభ్యర్థులు.. ఓటర్లకు మద్యం, డబ్బు పంపిణీ వంటి ప్రలోభాలకు తెర తీస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్‌ నాటికి స్వస్థలాలకు తీసుకురావడంపై దృష్టి సారించారు. మరోవైపు, ఇప్పటివరకు తమ వెంట ఉన్నవారిని ఇతర పార్టీల వారు తన్నుకుపోకుండా కాపాడుకోవడం అభ్యర్థులకు ప్రధాన సవాలుగా మారింది. ఈ నెల 26న పోలింగ్‌ ముగిసే వరకు తెరవెనుక వ్యూహాలే అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించనున్నాయని స్థానిక రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Updated Date - Nov 24 , 2026 | 12:13 AM