పల్లెల్లో కోలాహలం
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:39 AM
Nomination process begins పంచాయతీల్లో నామినేషన్ల సందడి మొదలైంది. ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. జిల్లాలోని పలాస నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఈ నెల 26న తొలివిడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజు మొత్తంగా 491 నామినేషన్లు పడ్డాయి.
పలాస రెవెన్యూ డివిజన్‌లో పంచాయతీ ఎన్నికల సందడి
ఏడు మండలాల్లో మొదలైన నామినేషన్ల ప్రక్రియ
తొలిరోజు సర్పంచ్‌లకు 168, వార్డు సభ్యులకు 323 దాఖలు
శ్రీకాకుళం/ పలాస/ ఇచ్ఛాపురం/ సోంపేట/ కవిటి/ కంచిలి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి):
పంచాయతీల్లో నామినేషన్ల సందడి మొదలైంది. ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. జిల్లాలోని పలాస నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఈ నెల 26న తొలివిడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజు మొత్తంగా 491 నామినేషన్లు పడ్డాయి. ఇందులో సర్పంచ్ అభ్యర్థులుగా 168 మంది, వార్డు సభ్యులుగా 323 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి మందీమార్బలం, డీజెలతో ఊరేగింపుగా తరలివెళ్లారు. నామినేషన్ల కేంద్రాల వద్ద అభ్యర్థులు, మద్దతుదారుల సందడి కనిపించింది.
పలాస మండలంలో సర్పంచ్‌లకు 10, వార్డు సభ్యులకు 27 నామినేషన్లు దాఖలయ్యాయని ఇన్‌చార్జి ఎంపీడీవో ఎస్.ఉమాపతి తెలిపారు.
వజ్రపుకొత్తూరు మండలంలో సర్పంచ్‌లకు 29, వార్డు సభ్యులకు 66 నామినేషన్లు వేశారు.
మందస మండలంలో సర్పంచ్‌లకు 35, వార్డు సభ్యులకు 78 నామినేషన్లు వేశారు.
ఇచ్ఛాపురం మండలంలో సర్పంచ్‌లకు 31, వార్డు స్థానాలకు 60 నామినేషన్లు వచ్చాయని ఎంపీడీవో ప్రభాకరరావు వెల్లడించారు.
కవిటి మండలంలో సర్పంచ్ స్థానాలకు 24, వార్డుస్థానాలకు 15 నామినేషన్లు పడ్డాయని ఎంపీడీవో ఎల్.త్రినాథ్ తెలిపారు.
సోంపేట మండలంలో సర్పంచ్‌కు సంబంధించి 21, వార్డుసభ్యుల స్థానాలకు 48 నామినేషన్లు దాఖలయ్యాయి.
కంచిలి మండలంలో సర్పంచ్‌కు 18, వార్డుస్థానాలకు 29 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ కేంద్రాన్ని కాశీబుగ్గ డీఎస్పీ జీవీ రమణ, సోంపేట సీఐ బి.మంగరాజు, ఎస్‌ఐ పి.పారినాయువు పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీఎస్పీ రమణ తెలిపారు.
నామినేషన్లకు ఇంకా రెండు రోజుల గడువు ఉంది. సోమవారం ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేయడానికి వివిధ పార్టీల మద్దతుదారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సర్పంచ్ అభ్యర్థుల పేర్లు ఖరారు కావడంతో అనేక ప్రాంతాల్లో ఏకగ్రీవాలు చేయడానికి కూటమి, వైసీపీ నాయకులు మంతనాలు చేస్తున్నారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాల మాదిరి.. తమ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులు కూడా గెలుపొందే అవకాశం ఉందని కూటమి నాయకులు భావిస్తున్నారు.