ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధుడి మృతి
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:22 AM
జమ్ము గ్రామం వద్ద ఎన్‌హెచ్-326 రహదారిపై బుధవారం ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో అదే గ్రామానికి చెందిన కొత్తరెడ్డి కృష్టారావు (73) మృతి చెందాడు.
నరసన్నపేట, మార్చి 11(ఆంధ్రజ్యోతి): జమ్ము గ్రామం వద్ద ఎన్‌హెచ్-326 రహదారిపై బుధవారం ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో అదే గ్రామానికి చెందిన కొత్తరెడ్డి కృష్టారావు (73) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణారావు తన ఇంటి నుంచి సైకిల్‌పై మామిడి తోటకు వెళ్తుండగా.. తోట సమీపంలో జాతీయ రహదారిపై నరసన్నపేట నుంచి పాతపట్నం వైపు వెళ్తు ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో కృష్ణారావు తలకు బలమైన గాయాలు కాగా చికిత్స నిమిత్తం నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌లో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి (రిమ్స్)కి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందారు. కృష్ణారావు భార్య పాపమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ గణేష్ తెలిపారు. కాగా వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
రైలు కిందపడి ఒకరు..
కోటబొమ్మాళి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): హరిశ్చంద్రపురం రైలు నిలయం సమీపంలో బుధవారం ఇదే మండలం నిమ్మాడ జంక్షన్‌కు చెందిన తంగుడు వెంకటరమణ (60) రైలు కిందపడి మృతి చెందాడు. పలాస రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటరమణ నిమ్మాడ జంక్షన్‌లో పాన్‌షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాలతో భార్య భారతి, కుమారులు మహేష్, సందీప్ కొన్నేళ్ల కిందట వెంకటరమణను వదిలేసి జలుమూరు మండలం చల్లపేటలో నివాసముంటున్నారు. అప్పటి నుంచి ఒక్కడే పాన్‌షాపును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వెంకటరమణ మృతికి గల కారణాలు తమకు తెలియదని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ మేరకు పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
111111111111