పలాస రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:24 AM
Visakhapatnam Railway G.M. inspected పలాస రైల్వేస్టేషన్‌ను భవిష్యత్‌లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని సౌత్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్‌మాధుర్ తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా రైల్వే జీఎం జిల్లాలోని రైల్వేస్టేషన్లన్నీ గురువారం పరిశీలించారు.
విశాఖ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్
పలాస, జూన్ 4(ఆంధ్రజ్యోతి): పలాస రైల్వేస్టేషన్‌ను భవిష్యత్‌లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని సౌత్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్‌మాధుర్ తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా రైల్వే జీఎం జిల్లాలోని రైల్వేస్టేషన్లన్నీ గురువారం పరిశీలించారు. పలాస స్టేషన్‌లో రైల్వే జీఎం సందీప్ మాధుర్‌కు శ్రామిక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ‘అమృతభారత్’ పథకం కింద పలాస రైల్వేస్టేషన్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. నాణ్యతలో లోపాలు లేకుండా పనులు చేయాలని ఆదేశించారు. పలాస రైల్వేస్టేషన్‌కు మంచి భవిష్యత్తు ఉందని, విశాఖ రీజియన్‌లో సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పలాస జీడిపప్పు ఎగుమతి, దిగుమతులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పారిశ్రామికవాడ జీడి పరిశ్రమల సంఘం అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు, కోశాధికారి కె.వినయ్ రైల్వే జీఎం సందీప్‌మాధుర్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందించారు. గతంలో జీడిపప్పు, పిక్కలు భారీస్థాయిలో రైల్వేద్వారా రవాణా జరిగేవి. ప్రస్తుతం ఎటువంటి ప్రోత్సాహకాలు లేకపోవడం వల్ల నామమాత్రంగా ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. దీనిపై తాము పరిశీలించి చర్యలు తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చారు.