నది దాటితేనే చదువు, సాగు
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:59 PM
If it rains... one simply has to take the risk! చినుకు పడితే చాలు.. మహేంద్రతనయ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మందస మండలంలోని శ్రీనివాసపురం, గోపాలపురం గ్రామాల ప్రజలకు వర్షాకాలం గడ్డు కాలంగా మారుతోంది. కళాశాలకు, పొలాలకు వెళ్లాలంటే నది దాటాల్సిందే.
వర్షాలు పడితే.. సాహసం చేయాల్సిందే!
నాలుగు నెలల పాటు తీవ్ర ఇబ్బందులు
మహేంద్రతనయపై కాజ్‌వే కోసం ఎదురుచూపు
మందస, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): చినుకు పడితే చాలు.. మహేంద్రతనయ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మందస మండలంలోని శ్రీనివాసపురం, గోపాలపురం గ్రామాల ప్రజలకు వర్షాకాలం గడ్డు కాలంగా మారుతోంది. కళాశాలకు, పొలాలకు వెళ్లాలంటే నది దాటాల్సిందే. నీటి ప్రవాహం పెరిగితే విద్యార్థులు చదువులకు దూరమవుతుండగా.. రైతులు పంట పనులకు వెళ్లలేని పరిస్థితి. ఏడాదిలో నాలుగు నెలలపాటు తలపై బరువులు మోస్తూ, నీటి ప్రవాహానికి ఎదురీది నది దాటడం ఇక్కడి ప్రజలకు పరిపాటిగా మారింది. మహేంద్రతనయ నదిపై కాజ్‌వే నిర్మించాలన్న దశాబ్దాల నాటి డిమాండ్ నేటికీ కార్యరూపం దాల్చలేదు.
మందస మండలంలో నదికి అవతల ఉన్న జంట గ్రామాలు శ్రీనివాసపురం, గోపాలపురం. ఈ గ్రామాలకు నదికి అవతల 450 ఎకరాల సాగు భూమి ఉంది. ప్రతి ఏటా ఖరీఫ్ సాగు కోసం రైతులు నది దాటి వెళ్లాల్సిందే. చీపిగెడ్డ, బెల్లుపటియా గెడ్డ, సునాముది, సంకుజోడి కాలువలు ఈ ప్రాంతానికి ఎగువన మహేంద్రతనయ నదిలో కలుస్తాయి. దీంతో ఇక్కడ నది ప్రవాహం ఉధృతంగా ఉంటుంది.
పొలాలకు వెళ్లే రైతులు తిండి నుంచి వరి పంటకు వేసే ఎరువు వరకు తలపై మోసుకెళ్లాల్సి వస్తోంది. వర్షాలు కురిసే సమయంలో పొలాలకు వెళ్లడం సాధ్యం కాదు. పొలాల్లో పనిచేస్తున్న సమయంలో వర్షం వస్తే రాత్రిపూట అక్కడే తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పంట కోత సమయంలో భారీ వర్షాలు కురిస్తే నది దాటలేక పంటను ఇంటికి తెచ్చుకోలేని దుస్థితి నెలకొంటోంది. మండల కేంద్రానికి వెళ్లాలన్నా వర్షాకాలంలో నాలుగు నెలలపాటు రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విద్యార్థులకూ తప్పని కష్టాలు
వర్షాకాలంలో విద్యార్థుల కష్టాలు మరింత పెరుగుతున్నాయి. గ్రామంలో ప్రాథమిక విద్య అందుబాటులో ఉన్నా.. హైస్కూల్ చదువుల కోసం నది అవతల ఉన్న కొత్తపల్లికి వెళ్లాలి. నది దాటడం కష్టంగా మారడంతో గ్రామస్థులు తమ పిల్లలను సుదూరంలోని సోంపేట మండలం కర్తలిపాలెంలో చేర్పించారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. హరిపురం, మందసలోని ప్రభుత్వ, పైవ్రేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు వర్షం వస్తే భయాందోళన మధ్య ఇళ్లకు చేరుకోవాల్సి వస్తోంది.
రైతుల పరిస్థితి దుర్భరం:
ఎన్నో వ్యయప్రయాసలతో వరి పంట పండిస్తే.. గింజ ఇంటికి చేరే వరకు గ్యారంటీ లేని పరిస్థితి. చీపి, బెల్లుపటియా, లోగయి, సునాముది, సంకుజోడి నీటివనరులు నిండితే నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఖరీఫ్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతుండగా.. కోతల సమయంలో భారీ వర్షాలు కురిస్తే నది దాటలేక పంటను ఇంటికి తెచ్చుకోలేకపోతున్నాం.
- తెప్ప పద్మ, రైతు, గోపాలపురం
కాజ్‌వే నిర్మించాలి:
అధికారులు స్పందించి వెంటనే మహేంద్రతనయ నదిపై కాజ్‌వే నిర్మించి ప్రజలను ఆదుకోవాలి. ప్రతి ఏటా వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగే సమయంలోనే వర్షాలు కురుస్తుండటంతో నీటి ఉధృతికి పొలాలకు, కళాశాలలకు వెళ్లలేకపోతున్నాం. నీటి ప్రవాహం తగ్గే వరకు ఇళ్ల వద్దే ఉండాల్సి వస్తోంది. కనీసం కాలిబాటలా చిన్నపాటి కాజ్‌వే నిర్మించి ఆదుకోవాలి.
- కిరణ్ కోరో, శ్రీనివాసపురం
నిధులు వస్తే నిర్మాణం:
ఇక్కడి సమస్యను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. మహేంద్రతనయపై కాజ్‌వే నిర్మించాలని ప్రజలు కోరుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు నివేదిక అందించాం. ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాం. నిధులు విడుదలైన వెంటనే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.
- శ్రీనివాసరావు, ఏఈఈ, జలవనరుల శాఖ, మందస