Share News

‘జంక్‌’కుండా తినేస్తున్నారు

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:06 AM

Sale of junk food near schools పిజ్జాలు, బర్గర్లు, ప్రెంచ్‌ఫ్రైస్‌, చిప్స్‌, కూల్‌డ్రింక్స్‌, రంగురంగుల ప్యాకెట్‌ స్నాక్స్‌ వంటి జంక్‌ ఫుడ్‌ విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటిని ఎక్కువగా తినడంతో చిన్నతనంలోనే ఊబకాయం, మతిమరుపు వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.

‘జంక్‌’కుండా తినేస్తున్నారు

  • పాఠశాలల వద్ద జంక్‌ఫుడ్‌ విక్రయాలు

  • విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

  • కొరవడిన అధికారుల పర్యవేక్షణ

  • నేడు ప్రపంచ జంక్‌ఫుడ్‌ నివారణ దినం

  • శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): పిజ్జాలు, బర్గర్లు, ప్రెంచ్‌ఫ్రైస్‌, చిప్స్‌, కూల్‌డ్రింక్స్‌, రంగురంగుల ప్యాకెట్‌ స్నాక్స్‌ వంటి జంక్‌ ఫుడ్‌ విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటిని ఎక్కువగా తినడంతో చిన్నతనంలోనే ఊబకాయం, మతిమరుపు వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం ప్రపంచ జంక్‌ ఫుడ్‌ నివారణ దినం సందర్భంగా.. జిల్లాలో పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.

  • పాఠశాలల పరిసరాల్లో జంక్‌ఫుడ్‌ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) మార్గదర్శికాలు ప్రకారం పాఠశాలల చుట్టూ 50 మీటర్ల పరిధిలో జంక్‌ఫుడ్‌ విక్రయాలను చేపట్టరాదు. పిల్లలకు పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠశాలల వద్ద జంక్‌ ఫుడ్‌ విక్రయాలను నిరోధించాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. కానీ జిల్లాలో ఎక్కడా ఈ నిబంధనలు పాటించడం లేదు. జిల్లాలో 3,037 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. 2,85,465 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరో 250 వరకు జూనియర్‌, డిగ్రీ, పీజీ, వృత్తి విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 95 శాతం వరకు పాఠశాలల సమీపంలోనే జంక్‌ ఫుడ్‌ విక్రయాలు కొనసాగుతున్నాయి. చిప్స్‌, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్‌, ఫాస్ట్‌ఫుడ్‌, కూల్‌డ్రింక్స్‌, రంగురంగుల పానీయాలను విక్రయిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కూటమి సర్కార్‌.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చిరుధాన్యాలతో చెక్కీలతోపాటు వారానికి మూడురోజులపాటు గుడ్డు, రాగిజావ అందిస్తోంది. కానీ పాఠశాల బయట విద్యార్థులు జంక్‌ ఫుడ్స్‌ విచ్చలవిడిగా తీసుకోవడంతో పలు రుగ్మతలకు గురవుతున్నారు.

  • ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

  • జంక్‌ఫుడ్‌లో అధికంగా ఉప్పు, చక్కెర, కొవ్వు, కృత్రిమ రంగులు ఉండటం వలన ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, దంత సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గుతుందని పేర్కొంటున్నారు. జిల్లాలో 15 ఏళ్ల లోపు ఉన్న విద్యార్థులు ఎక్కువగా జంక్‌ఫుడ్‌కు అలవాటు పడి ఏడాదికి 4 శాతం వరకు పిల్లలకు పలు వ్యాధుల బారిన పడటం, ఆడపిల్లల్లో జన్యుపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి జంక్‌ఫుడ్‌పై తల్లిదండ్రులు అవగాహన కలిగి పిల్లలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని స్పష్టం చేస్తున్నారు. పిల్లలకు ఇంట్లోనే షోషకాహారం అందించాలి. పండ్లు, పాలు, గుడ్లు , చిరుధాన్యాలు, మొలకలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం అలవాటు చేయాలని సూచిస్తున్నారు.

  • సిబ్బంది కొరతతో పర్యవేక్షణ నిల్‌

  • జిల్లాలో ఆహార కల్తీ నియంత్రణ విభాగం సిబ్బంది కొరత వేధిస్తుంది. జిల్లాలో ముఖ్య అధికారితోపాటు మూడు రెవెన్యూ డివిజన్లకు ముగ్గురు పర్యవేక్షణాధికారులు ఉన్నారు. ఒక్కొక్కరు పది మండలాలను పర్యవేక్షించాలి. సిబ్బంది కొరత కారణంగా అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. వాటర్‌ప్లాంట్లు, హోటల్స్‌, దుకాణాలు, స్వీట్లు తయారీ కేంద్రాలు, జంక్‌ఫుడ్‌ విక్రయ కేంద్రాలను సక్రమంగా తనిఖీ చేసే దాఖలాలు లేవు. ఇదే అదునుగా నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. పాఠశాలల సమీపంలో ప్రత్యేక తనిఖీలు చేయాలి. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై జరిమానా విధించాలి. విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

  • అవగాహన కల్పించాలి

  • జంక్‌ఫుడ్‌ తీసుకోవడం వలన కలిగే అనర్థాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి. చిప్స్‌, బర్గర్లు, పిజ్జాలు తినడంతో ఊబకాయం, బీపీ, రక్తహీనత వంటి సమస్యలు పిల్లలకు వచ్చే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆహారం నియమావళిపై అవగాహన కల్పించాలి.

    - సూరపు కృష్ణారావు, సూపరింటెండెంట్‌, సామాజిక ఆసుపత్రి, పాతపట్నం

  • ఆదేశాలు ఇచ్చాం

  • ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఆవరణలో విద్యార్థుల ఆరోగ్యానికి హాని కలిగించే జంక్‌ఫుడ్‌ విక్రయించడం నిషేధం. ఎంఈవోలు పర్యవేక్షించి.. పాఠశాలల సమీపంలో జంక్‌ఫుడ్‌ విక్రయించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించాం.

    - ఎ.రవిబాబు, డీఈవో, శ్రీకాకుళం

Updated Date - Jul 21 , 2026 | 12:06 AM