Share News

వెలుగులు నింపని మట్టి ప్రమిదలు

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:01 AM

దీపావళి పండగంటే గుర్తొచ్చేది అందమైన ప్రమిదలు... బాణసంచా వెలుగులు. పండుగకు ప్రమిదల్లోని దీపాలు అందరి లోగిళ్లకు వెలుగులు తీసుకువస్తాయి.

వెలుగులు నింపని మట్టి ప్రమిదలు
శ్రీపురంలో మట్టి రప్రమిదలు చేస్తున్న వ్యక్తి

కోటబొమ్మాళి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): దీపావళి పండగంటే గుర్తొచ్చేది అందమైన ప్రమిదలు... బాణసంచా వెలుగులు. పండుగకు ప్రమిదల్లోని దీపాలు అందరి లోగిళ్లకు వెలుగులు తీసుకువస్తాయి. కానీ అవి తయారు చేస్తున్న కుమ్మరుల ఇళ్లకు మాత్రం వెలుగులు రావడం లేదు. పింగాణీ ప్రమిదల రాకతో మట్టి ప్రమిదలకు గిరాకీ తగ్గిందని... దీంతో ఆశించిన స్థాయిలో విక్రయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని తయారీదారులు చెబుతున్నారు. మండలంలోని కొత్తపల్లి, సరియాపల్లి, సౌడాం, రేగులపాడు, సీతన్నపేట, నారాయణవలస, చీపుర్లపాడు, దుర్గంపేట, సంతబొమ్మాళి మండలంలోని దండుగోపాలపురం, ఉమిలాడ, పాలతలగాం తదితర గ్రామాల్లో సుమారు 200 కుమ్మర్ల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. కాలక్రమంలో ప్లాస్టిక్‌ పాత్రలు అందుబాటులోకి వచ్చిన తరువాత మట్టి పాత్రల వినియోగం తగ్గిపోవడంతో కుమ్మర్లు భృతి కోల్పోయారు. దీంతో ప్రత్యామ్నాయంగా ఆ కుటుంబాల్లో చాలా వరకు కూలీ పనులతో పాటు ఇతర వృత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. కొన్ని కుటుంబాలు మాత్రం ఆ వృత్తినే నమ్ముకొని సీజనల్‌గా వచ్చే పండగలకు అవసరమయ్యే మట్టి కుండలు, ప్రమిదలు, మట్టి పొయ్యిలు తదితర వస్తువులు తయారు చేస్తుంటారు. స్త్రీలు, పురుషులు వేర్వేరుగా గ్రామాల్లో విక్రయిస్తుంటారు.

వృత్తిని వదులుకోలేక...

మా తాతతండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ కులవృత్తిని వదులుకోలేం. మట్టి వినాయక విగ్రహాలను వాడాలన్న నినాదంలో ఇటీవల వాటికి డిమాండ్‌ పెరిగింది. అలాగే మట్టి ప్రమిదలు, మట్టి వస్తువుల వినియోగం కూడా పెరుగుతుందనే నమ్మకంతో బతుకుతున్నాం. ప్రస్తుతం కుటుంబమంతా కుండలు, కలశాలు, మట్టిపొయ్యిలు తయారు చేస్తున్నాం. పెట్టుబడికి, యంత్రాలకు తదితర ఖర్చులకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలి.

- యండమూరి వెంకటరమణ, దుర్గంపేట, కోటబొమ్మాళి మండలం

Updated Date - Nov 08 , 2026 | 01:02 AM