ముందస్తు బోధన
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:16 AM
'Tenth' lessons for ninth grade students కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తుగా పైతరగతుల పాఠ్యాంశాల బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
వేసవి సెలవులకు ముందే.. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ‘పది’ పాఠాలు
నేటి నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు
నరసన్నపేట, మార్చి 1(ఆంధ్రజ్యోతి): కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తుగా పైతరగతుల పాఠ్యాంశాల బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో విద్యాసంవత్సరం ముగిసే సమయంలో అంటే ఏప్రిల్‌లో ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఫైనల్ పరీక్షలు జరిగేవి. ఈ ఏడాది మాత్రం తొమ్మిదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి సంగ్రాహాణ్మాక (ఎస్‌ఏ-2) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ముగియగానే ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు వేసవి సెలవుల వరకూ పదో తరగతి పాఠాలను బోధించనున్నారు. వేసవి సెలవుల్లో పాఠ్యాంశాలను విద్యార్థులు పునశ్ఛరణ చేసుకునేందుకు వీలుగా బోధన ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఉన్న 410 ప్రభుత్వ పాఠశాలల్లో 20,506 విద్యార్థులు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వారిలో బాలురు 9,683 మంది, బాలికలు 10,823 మంది ఉన్నారు. వీరికి ఈనెల 11 వరకు ఎస్‌ఏ-2 పరీక్షలు జరగనున్నాయి. 12 నుంచి పదో తరగతి పాఠ్యాంశాలతో బ్రిడ్జ్ కోర్సును నెలరోజుల పాటు వారికి బోధిస్తారు.
నేటి నుంచి ‘పది’ విద్యార్థులకు గ్రాండ్ టెస్టులు
ఈ నెల 16 నుంచి జరగనున్న పబ్లిక్ పరీక్షలపై భయాన్ని పోగొట్టేందుకు సోమవారం నుంచి పదోతరగతి విద్యార్థులకు గ్రాండ్‌టెస్టులు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం తెలుగు, బుధవారం హిందీ, గురువారం ఇంగ్లీషు, శుక్రవారం లెక్కలు, శనివారం భౌతికశాస్త్రం, సోమవారం జీవశాస్త్రం, మంగళవారం సాంఘీక శాస్త్రం పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 4.45 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ వారంలో హాల్ టిక్కెట్లు
పదో తరగతి అభ్యర్థుల హాల్‌టిక్కెట్లనుఈ నెల మొదటి వారంలో అధికారులు జారీ చేయనున్నారు. హాల్ టిక్కెట్లను విద్యార్థులు చదువుతున్న పాఠశాలలకు పంపుతారు. అధికారిక వెబ్‌సైట్ పాఠశాల లాగిన్‌లో లీప్‌యాప్, వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా హాల్ టిక్కెట్లను నేరుగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. హాల్‌టిక్కెట్లలో విద్యార్థి పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీల్లో తప్పులు దొర్లితే వాటిని సవరించుకునేందుకు అవకాశం ఇచ్చారు. విద్యార్థులకు పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్లు జారీ చేసేంత వరకూ సవరణలకు అవకాశం ఇచ్చినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 28,586 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.