Share News

దువ్వాడ పరార్‌

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:22 AM

Duvvada Absent from police inverstigation వైసీపీ బహిష్కృత నేత.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి.. ఒకరినిమించి మరొకరు డ్రామా సృష్టించారు. కేసు విచారణ నిమిత్తం కొత్తూరు పోలీస్‌స్టేషన్‌కు హాజరవుతానని చెప్పిన దువ్వాడ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి పరారయ్యారు. మాధురిని పోలీసులు హౌస్‌అరెస్టు చేయగా.. ఇంటి వద్దే ఆమె హడావుడి సృష్టించింది.

దువ్వాడ పరార్‌
పరార్‌కు ముందు పోలీసులతో మాట్లాడుతున్న దువ్వాడ

  • పోలీసు విచారణకు గైర్హాజరు

  • వెనక్కి వచ్చిన గన్‌మేన్‌

  • సాయంత్రం వరకు మాధురి హౌస్‌ అరెస్టు

  • టెక్కలి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ బహిష్కృత నేత.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి.. ఒకరినిమించి మరొకరు డ్రామా సృష్టించారు. కేసు విచారణ నిమిత్తం కొత్తూరు పోలీస్‌స్టేషన్‌కు హాజరవుతానని చెప్పిన దువ్వాడ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి పరారయ్యారు. మాధురిని పోలీసులు హౌస్‌అరెస్టు చేయగా.. ఇంటి వద్దే ఆమె హడావుడి సృష్టించింది. కొంతసేపు బయటకు వెళ్లాలని, ఇంకొంతసేపు నల్లగుడ్డలతో నిరసన చేపట్టింది.

  • ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కొత్తూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నెల 22న విచారణ నిమిత్తం దువ్వాడ.. మాధురితో కలిసి కొత్తూరు పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యారు. ఈ క్రమంలో మాధురి స్టేషన్‌ బయట హంగామా చేయడంతో దువ్వాడ శ్రీనివాస్‌, మాధురితోపాటు మరికొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం విచారణకు హాజరుకావాలని దువ్వాడకు పోలీసులు ఇటీవల నోటీసులిచ్చారు. ఈసారి కూడా మాధురి కొత్తూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే మరో డ్రామాకు తెరలేపే అవకాశాలు ఉన్నాయని భావించిన పోలీసులు మంగళవారం ఉదయం నుంచే ఆమెను హౌస్‌ అరెస్టు చేశారు. మరోవైపు దువ్వాడ ఇంటివద్దకు కూడా పోలీసులు చేరుకోవడంతో శ్రీనివాస్‌, గన్‌మేన్‌, డ్రైవర్‌తో కలిసి ఉదయం 11 గంటలకు కొత్తూరు స్టేషన్‌కు బయలుదేరారు. కొంతసేపటి తర్వాత దువ్వాడతోపాటు డ్రైవర్‌ కూడా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశారు. గన్‌మేన్‌ ప్రసాద్‌ను వెనక్కి పంపేశారు. అప్పటికే నిఘా ఉంచిన పోలీసులు.. దువ్వాడ ఒడిశా వైపు వెళ్లిపోయాడని గుర్తించారు.

  • పోలీసులు మాధురిని కొత్తూరు స్టేషన్‌కు వెళ్లకుండా హౌస్‌అరెస్టు చేయడంతో ఆమె మరింత సీన్‌ సృష్టించింది. తాను బ్యాంకు పనుల కోసం బయటకు వెళ్లాలని ఒకసారి ప్రయత్నించగా సీఐ విజయ్‌కుమార్‌ బయటకు విడిచిపెట్టలేదు. ఆ తరువాత మీడియా ముందు ‘నా రాజా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు.. ఎటు వెళ్లాడ’ంటూ కాసేపు హడావుడి చేసింది. మంగళవారం మధ్యాహ్నం తన అనుయాయులు 20మందితో కలిసి నల్లవస్ర్తాలు మెడలో ధరించి తన ఇంటి ముందే మాధురి బైఠాయించింది. సాయంత్రం 5.30 గంటల తర్వాత పోలీసులు ఆమెను విడిచిపెట్టేశారు.

  • ఇంటి నుంచి దువ్వాడ బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడుతూ ‘నేనేమైనా అంతర్జాతీయ తీవ్రవాదినా?. ఎటుచూసినా పోలీసుల హంగామా ఏమిటి?. నాపై ఎందుకీ వివక్ష. ఇది ముమ్మాటికీ కక్షసాధింపే. అవసరమైతే మానవహక్కులను ఆశ్రయిస్తాన’ని వెల్లడించారు. చివరకు కొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో రెండో విడత విచారణకు దువ్వాడ శ్రీనివాస్‌ డుమ్మా కొట్టారు.

  • మాధురి మీడియాతో మాట్లాడుతూ ‘శ్రీనివాస్‌ ఆరోగ్యం బాగోలేనందున ఆసుపత్రికి వెళ్లారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. దువ్వాడకు భయమేమీ లేదు. ఆయన ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు’ అని తెలిపారు.

Updated Date - Jul 01 , 2026 | 12:22 AM