అడుగంటిన జలాలు.. అన్నదాత దిగాలు
ABN , Publish Date - May 18 , 2026 | 12:07 AM
Problems with drinking and irrigation water ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ప్రధానంగా చెరువులు ఎండిపోతున్నాయి. ఫలితంగా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
జిల్లాలో ఎండిపోతున్న చెరువులు
మండే ఎండలతో నీరు కరువు
తాగు, సాగునీటికి ఇబ్బందులు
పశువులకూ తప్పని దాహార్తి
ఎచ్చెర్ల మండల కేంద్రానికి చెందిన గోపాల్ అనే రైతు.. ఎకరా పొలంలో గోరుచిక్కుడు పండిస్తున్నాడు. పంట చేతికి అందిరావాలంటే మూడు నెలలు శ్రమించాలి. పది రోజులకోసారి మొక్కలకు నీరు అందించాలి. ప్రస్తుతం ఎండలు మండిపోతుండడంతో నీటితడులు లేక పంట ఎండిపోతోందని గోపాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చెంతనే బావి ఉన్నా.. నీరు అడుగంటిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడు. బావిలో ఉన్న కొద్దినీటిని మోటారుతో తోడి.. పంటకు అందిస్తున్నాడు.
శ్రీకాకుళం/ హరిపురం/ పలాస రూరల్, మే 17(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ప్రధానంగా చెరువులు ఎండిపోతున్నాయి. ఫలితంగా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు రైతులకు సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నదులు, రిజర్వాయర్లలో సైతం నీరు కరువవుతోంది. దీంతో పశువులు, మూగజీవాలకు కూడా దాహార్తి తప్పడం లేదు.
జిల్లాలోని 76 గ్రామాలు డార్క్‌జోన్‌లో ఉన్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. రణస్థలం మండలంలో 46 గ్రామాలు, లావేరు మండలంలో 18 గ్రామాలు, జి.సిగడాం మండలంలో 6 గ్రామాలు, పొందూరు మండలంలో 6 గ్రామాల్లో భూగర్భజలాలను అత్యధికంగా తోడేసిన ప్రాంతాలుగా వెల్లడించింది. ఆయా గ్రామాల్లో కొత్తబోర్లు, ఇసుక తవ్వకాలను నిషేధించింది. కాగా.. జిల్లాలో చాలాచోట్ల చెరువులు, నదుల్లో నీరు ఎండిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
శ్రీకాకుళం మండలం కళ్లేపల్లి వద్ద నాగావళి నదిలో నీరు లేక ఎడారిని తలపిస్తోంది. పొన్నాడ వంతెన వద్ద నాగావళిలో మురుగునీటి ప్రవాహమే దర్శనమిస్తోంది. అలాగే శ్రీకాకుళం రూరల్ పరిధిలో సాధుపేట, కనుగులవానిపేట, గంగిరేవు చెరువులు పూర్తిగా అడుగంటిపోయాయి. లావేరు చెరువు కూడా పూర్తిగా ఎండిపోయి.. మైదానాన్ని తలపిస్తోంది.
మందస మండలంలో తాగునీటికి ఉపయోగించే పలు చెరువులు నీరు లేక రూపం కోల్పోతున్నాయి. హొన్నాళిలో మంచినీటి కోనేరు.. చిన్నకొలనులా మారింది. బొందికారి కోనేరు కూడా చిన్న నీటి మడుగులా దర్శనమిస్తోంది. చాలాచోట్ల బావుల్లో నీరు లేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. కొండవాగుల్లో సైతం నీటి చెలమలు ఎండిపోవడంతో వన్యుప్రాణులు నీటికోసం గ్రామ పరిసరాల్లోని చెరువులు, వాగుల్లోకి తరలివస్తున్నాయి. ఇక్కడ నీరు లేకపోవడంతో అడవి పందులు, జింకలు.. వేరుశెనగ, రాగి, వరి వంటి పంట పొలాలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందస మండలంలో సుమారు 40 గ్రామాల్లో నీటిఎద్దడి ఏర్పడింది. రక్షిత మంచినీటి పథకాల బావులు ఈ చెరువుల్లోనే ఉండడంతో వాటికి ముప్పు ఏర్పడుతోంది. మోటరు వేస్తే గంట కూడా నీరు రాని దుస్థితి నెలకొంది. ట్యాంకర్లద్వారా మంచినీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. చెరువులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కళతప్పిన వరహాలగెడ్డ
పలాస, మెళియాపుట్టి మండలాల్లోని రెండు వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే వరహాలగెడ్డ (లొత్తూరు రిజర్వాయర్) కళ తప్పుతోంది. రిజర్వాయర్ కనీస మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదు. సిల్ట్ పేరుకుపోవడం, పిచ్చిమొక్కలు పెరిగి నీటి నిల్వ సామర్థ్యం అడుగంటింది. పలాస, మందస సరిహద్దులో లొత్తూరుకు వెళ్లే రహదారిలో 1978లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.కోటికి పైగా నిధులతో వరహాలగెడ్డ రిజర్వాయర్‌ను నిర్మించారు. మహేంద్రతనయ కొండల నుంచి వచ్చే నీటిని నిల్వ చేసేందుకు ఈ వరహాలగెడ్డ రిజర్వాయర్‌ను నిర్మించారు. మెళియాపుట్టి, పలాస మండలాల్లోని సుమారు రెండువేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు రెండువైపులా మదుములు, కుడి వైపు భారీ సర్‌ప్లస్ వియర్(పరుపు) నిర్మించారు. కాగా నిర్వహణ లోపంతో కేవలం వర్షాకాలంలో తప్ప మిగిలిన రోజుల్లో కనీసం పశువులు తాగేందుకు కూడా నీరు నిల్వ ఉండని దుస్థితి ఏర్పడుతుంది. కిలోమీటరు పొడవునా రిజర్వాయరు గట్టు నిర్మించినా దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. రిజర్వాయర్ గర్భాన్ని లోతు చేయడంతోపాటు పాడైన గట్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇరిగేషన్ అధికారులు స్పందించి పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ఈ విషయంపై ఇరిగేషన్ ఏఈ జేసీహెచ్ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. ‘గట్లు ఎత్తు, పటిష్ఠం చేయడానికి, మదుముల మరమ్మతుల కోసం రూ.1.50 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామ’ని తెలిపారు.