పాఠశాలలో.. మద్యం మత్తులో
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:22 AM
Marriguda Ashram School Employee.. Drunk at school హిరమండలం మండలం మర్రిగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఓ ఉద్యోగి ఆదివారం మద్యం మత్తులో అక్కడే నిద్రించాడు. ఎవరు లేపినా.. లేవనంతగా మత్తులో మునిగిపోయాడు.
మర్రిగూడ ఆశ్రమ పాఠశాల ఉద్యోగి నిర్వాకం
హిరమండలం, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): హిరమండలం మండలం మర్రిగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఓ ఉద్యోగి ఆదివారం మద్యం మత్తులో అక్కడే నిద్రించాడు. ఎవరు లేపినా.. లేవనంతగా మత్తులో మునిగిపోయాడు. ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ ఆరా తీయగా.. ప్రతిరోజూ పాఠశాలకు మద్యం తీసుకువచ్చి తాగి పడుకుంటాడని కొంతమంది విద్యార్థులు తెలిపారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు భాస్కరరావు వద్ద ప్రస్తావించగా.. ఆ ఉద్యోగికి చాలాసార్లు పాఠశాలలో మద్యం తాగొద్దని చెప్పామన్నారు. ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు 88 మంది ఉండేవారు. పదోతరగతి పరీక్షలు పూర్తికావడంతో ప్రస్తుతం 81 మంది విద్యార్థులు ఉంటున్నారు. కాగా పాఠశాలలో పర్యవేక్షణ కరువై విద్యార్థులు ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్నారు. ఈక్రమంలో ఈ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో ఈ ఏడాది నుంచి ఏడో తరగతి వరకే ఈ పాఠశాలను పరిమితం చేయాలని ఇటీవల ఉన్నతాధికారులు నిర్ణయించారు.