Share News

కరువు కమ్మేస్తోంది

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:29 AM

Severe rain deficit conditions in the srikakulam సూపర్‌ ఎల్‌నినో ప్రభావం జిల్లాను వెంటాడుతోంది. ఖరీఫ్‌ ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా.. సాగు ఊపందుకోలేదు. సాధారణ సాగులో 20శాతం మాత్రమే వరినాట్లు వేశారు. మరో 52 శాతం ఎదల రూపంలో వేసినా నీరు లేక పొలాలు వదిలేసిన దుస్థితి. వర్షాకాలంలోనూ ఎండల తీవ్రత కారణంగా చెరువులు బోసిపోతున్నాయి.

కరువు కమ్మేస్తోంది
డబార్సింగి రిజర్వాయర్‌ పరిధిలో ఎండిపోతున్న వరినారు

  • జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు

  • వెలవెలబోతున్న రిజర్వాయర్లు

  • గణనీయంగా తగ్గిన ఖరీఫ్‌ సాగు

  • ఆందోళనలో అన్నదాతలు

  • మందస, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి):

  • - మందస మండలంలో ప్రధాన నీటి వనరైన డబార్సింగి రిజర్వాయర్‌.. గత ఇరవై ఏళ్లుగా నీటితో కళకళలాడేది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో నీటిచలమలా మారింది. వేలాది రూపాయలు నీటితీరువా చెల్లిస్తున్నా.. కాలువల్లో చుక్క నీరు ప్రవహించక నాట్లు వేసిన వరి పొలాలు ఎండిపోతున్నాయి. వర్షం కోసం అన్నదాత ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది.

  • సూపర్‌ ఎల్‌నినో ప్రభావం జిల్లాను వెంటాడుతోంది. ఖరీఫ్‌ ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా.. సాగు ఊపందుకోలేదు. సాధారణ సాగులో 20శాతం మాత్రమే వరినాట్లు వేశారు. మరో 52 శాతం ఎదల రూపంలో వేసినా నీరు లేక పొలాలు వదిలేసిన దుస్థితి. వర్షాకాలంలోనూ ఎండల తీవ్రత కారణంగా చెరువులు బోసిపోతున్నాయి. పంట పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. అడపాదడపా కొద్దిపాటి వర్షం కురుస్తున్నా.. అన్నదాతలకు ఏమాత్రం ఉపశమనం కలిగించటంలేదు.

  • జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 4.30 లక్షల ఎకరాలు. ఇప్పటివరకూ 55 వేల ఎకరాల్లో మాత్రమే వరి ఉబాలు పూర్తయ్యాయి. మరో 1.70 లక్షల ఎకరాల్లో వరిని ఎద రూపంలో సాగు చేస్తున్నారు. కాగా ఆశించినస్థాయిలో సాగునీరు లేక పంటను కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. వంశధార, నాగావళి నదుల నీరుతో జిల్లాలో సుమారు 5వేల చెరువులు నింపినా.. అవి కూడా వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది. వర్షాధారంగా నిండే మరో 6,500 చెరువులు చుక్కనీరులేక ఎండిపోయి కనిపిస్తున్నాయి. మహేంద్ర తనయా నదితోపాటు మందస మండలంలోని కళింగదల్‌, డబార్సింగి, దామోదరసాగర్‌ వంటి రిజర్వాయర్‌లు సైతం నీరు లేక వెలవెలబోతున్నాయి. 15ఏళ్లుగా ఎండాకాలంలో సైతం ఎండని రిజర్వాయర్లు.. ప్రస్తుతం నీరులేక మడుగుల్లా మారటంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

  • బోర్లుసైతం బోరుమంటున్నాయి..

  • బోర్లు ఆధారంగా వరి పండించే రైతులు సైతం నీరు రాక లబోదిబోమంటున్నారు. గతంలో ఐదు గంటలు మోటారు బోర్లు వేస్తే ఎకరా పొలం నీటితో నిండిపోయేదని, నేడు అదే సమయంలో కనీసం పది సెంట్లు కూడా తడవటం లేదని పొత్తంగి రైతులు పేర్కొంటున్నారు. ఏటా మహేంద్రగిరులపై వర్షాలు కురిస్తే రిజర్వాయర్లు నీటితో కళకళలాడేవని, మహేంద్రతనయా నీటిప్రవాహం పొంగిపొర్లేదని.. నేడు ఎల్‌నినో ప్రభావంతో నీటిఛాయలు కనిపించలేదని వాపోతున్నారు. ఈ విషయమై జలవనరుల శాఖ ఏఈఈ వద్ద ప్రస్తావించగా.. ‘వర్షాలు లేక నీటి వనరుల్లో నీరు లేకుండా పోయింది. ఉన్నవరకు ఉబాలు జరిపేలా చర్యలు తీసుకున్నాం. ఎల్‌నినో ప్రభావంతో ఉన్న నీటిని పంటలకు తక్కువస్థాయిలో ఉపయోగించి రక్షించేలా సూచనలిస్తున్నామ’ని తెలిపారు.

Updated Date - Sep 19 , 2026 | 12:29 AM