Share News

కరువు కమ్మేసింది

ABN , Publish Date - Sep 03 , 2026 | 12:05 AM

42.53 percent rainfall deficit వర్షం కోసం ఎదురుచూస్తున్న జిల్లా రైతులకు ఈ ఖరీఫ్‌ సీజన్‌లో నిరాశే మిగులుతోంది. వర్షాలు ముఖం చాటేయడం, ఎల్‌నినో ప్రభావం ఉగ్రరూపం దాల్చడంతో జిల్లాలో కరువుఛాయలు కమ్ముకుంటున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్మెంట్‌ సిస్టమ్‌’ ఈ నెల 1న వెల్లడించిన గణాంకాలు జిల్లాలో జల సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయి.

కరువు కమ్మేసింది
గార మండలం చల్లపేట జంక్షన్‌ వద్ద నీరు లేక బీటలువారిన చెరువు

  • జిల్లాపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం

  • 42.53 శాతం లోటు వర్షపాతం

  • పాతాళానికి చేరిన భూగర్భజలాలు..

  • రణస్థలంలో ఏకంగా 6 మీటర్ల మేర పతనం

  • 4,161 చెరువుల్లో చుక్కనీరూ లేని వైనం

  • ‘ఏపీ వాటర్‌ రిసోర్సెస్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్మెంట్‌ సిస్టమ్‌’ నివేదిక వెల్లడి

  • శ్రీకాకుళం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): వర్షం కోసం ఎదురుచూస్తున్న జిల్లా రైతులకు ఈ ఖరీఫ్‌ సీజన్‌లో నిరాశే మిగులుతోంది. వర్షాలు ముఖం చాటేయడం, ఎల్‌నినో ప్రభావం ఉగ్రరూపం దాల్చడంతో జిల్లాలో కరువుఛాయలు కమ్ముకుంటున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్మెంట్‌ సిస్టమ్‌’ ఈ నెల 1న వెల్లడించిన గణాంకాలు జిల్లాలో జల సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా అడుగంటిన ప్రాజెక్టులు, పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాల పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

  • 42.53 శాతం లోటు వర్షపాతం

  • జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం నుంచే వర్షాలు ముఖం చాటేశాయి. జూన్‌ 1 నుంచి ఈ నెల 1 వరకు జిల్లావ్యాప్తంగా సాధారణంగా 511.77 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 294.1 మి.మీ మాత్రమే కురిసింది. ఏకంగా 42.53 శాతం లోటు వర్షపాతం నమోదైంది. గార మండలంలో అత్యధికంగా 76.14 శాతం లోటు వర్షపాతం ఉంది. పోలాకి మండలంలో 73.28 శాతం, పొందూరులో 69.44 శాతం, వజ్రపుకొత్తూరులో 67.9 శాతం, సారవకోటలో 64.44 శాతం, నందిగాంలో 61.98 శాతం, ఇచ్ఛాపురంలో 60.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడు మండలాలు అత్యంత తీవ్ర వర్షాభావం కేటగిరీలో కొట్టుమిట్టాడుతున్నాయి.

  • పాతాళానికి భూగర్భజలాలు

  • వర్షాలు లేకపోవడంతో జిల్లాఅంతటా భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. గతేడాది ఇదే సమయానికి జిల్లా సగటు భూగర్భ జల మట్టం 6.62 మీటర్ల లోతులో ఉండగా, ప్రస్తుతం 8.03 మీటర్లకు పడిపోయింది. అంటే ఏడాదిలోనే 1.41 మీటర్ల మేర నీరు మరింత అడుగంటింది. రణస్థలం మండలంలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇక్కడ గతేడాది 8.91 మీటర్ల లోతులో ఉన్న జలాలు, ఇప్పుడు 14.84 మీటర్లకు(5.93 మీటర్ల మేర క్షీణత) పడిపోయాయి. కవిటి మండలంలో అత్యధికంగా 19.93 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. కంచిలిలో 13.77 మీటర్లు, వజ్రపుకొత్తూరులో 13.3 మీటర్ల లోతులో నీటిమట్టాలు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లా మొత్తమ్మీద వినియోగానికి కేవలం 30.09 టీఎంసీల భూగర్భజలాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

  • ఎండిపోతున్న చెరువులు

  • మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు, జల సంరక్షణ నిర్మాణాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. జిల్లాలో మొత్తం 6,481 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు ఉండగా, వాటి పూర్తి నిల్వ సామర్థ్యం 9.84 టీఎంసీలు. ప్రస్తుతం వాటిలో కేవలం 2.23 టీఎంసీల నీరు (22.69 శాతం) మాత్రమే నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి చెరువుల్లో 7.11 టీఎంసీల నీరు ఉండగా, ఈ ఏడాది ఏకంగా 4.88 టీఎంసీల మేర నీటి నిల్వలు తగ్గిపోవడం ఆందోళనకరం. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే... జిల్లాలోని 4,161 చెరువుల్లో నీటి నిల్వ సున్నా శాతంగా ఉంది. జిల్లాలోని 31,529 జల సంరక్షణ నిర్మాణాల (ఫామ్‌ పాండ్స్‌, చెక్‌ డ్యామ్‌లు తదితర) సామర్థ్యం 2,138.72 ఎంసీఎఫ్‌టీ(మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్లు) కాగా, వాటిలో ప్రస్తుతం కేవలం 20.81 ఎంసీఎఫ్‌టీ నీరు మాత్రమే నిల్వ ఉంది.

  • ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలూ అంతే

  • ప్రధాన ప్రాజెక్టులైన గొట్టాబ్యారేజీలో ప్రస్తుతం 0.66 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండగా, హిరమండలం రిజర్వాయర్‌లో 3.24 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. కళింగదళ ప్రాజెక్టులో కేవలం 0.07 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. నారాయణపురం ఆనకట్టలో నీటి నిల్వలు పూర్తిగా సున్నాకు పడిపోయాయి. ఎత్తిపోతల పథకాల విషయానికొస్తే.. జిల్లాలో మొత్తం 41 పథకాల కింద 37,254 ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం 34 పథకాలు (32,664 ఎకరాలకు) పూర్తిస్థాయిలో, 5 పథకాలు (4,450 ఎకరాలకు) పాక్షికంగా పనిచేస్తున్నాయి. ఒక పథకం (90 ఎకరాలకు) పూర్తిగా మూలకు చేరిపోయింది. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ప్రాజెక్టులు, చెరువులు ఎండిపోవడంతో సిక్కోలు రైతన్నల గుండెల్లో గుబులు రేగుతోంది. కరువు నివారణ చర్యలలో భాగంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది.

Updated Date - Sep 03 , 2026 | 12:05 AM