Share News

సురక్షిత ప్రయాణానికి.. డ్రైవర్లే కీలకం

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:46 AM

Today is RTC Drivers' Day ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం’.. ఇదీ ప్రజారవాణా సంస్థ(ఆర్టీసీ) నినాదం. కాగా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్లదే కీలకపాత్ర.

సురక్షిత ప్రయాణానికి.. డ్రైవర్లే కీలకం

విధి నిర్వహణలో అనారోగ్య సమస్యలు

అయినా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యం

నేడు ఆర్టీసీ డ్రైవర్ల దినోత్సవం

పలాస, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం’.. ఇదీ ప్రజారవాణా సంస్థ(ఆర్టీసీ) నినాదం. కాగా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్లదే కీలకపాత్ర. బస్సు డ్రైవర్‌ అంటే ఒకరు కాదు. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు వారి చేతుల్లో ఉంటాయి. అనారోగ్యానికి గురైనా.. ఎంత ఒత్తిడి ఎదురైనా.. రహదారులు బాగులేకపోయినా.. ప్రయాణికులను మాత్రం సురక్షితంగా తీసుకెళ్లే బాఽధ్యత డ్రైవర్లదే. శనివారం ఆర్టీసీ డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన కొంతమంది డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుందాం.

జిల్లాలో శ్రీకాకుళం, శ్రీకాకుళం-1, పలాస, టెక్కలి ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో డ్రైవర్లు 561 మంది, ఆన్‌కాల్‌ డ్రైవర్లు 120 మంది ఉన్నారు. ప్రతి డిపోలోనూ ఉత్తమ ప్రతిభ చూపిన డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా ప్రోత్సాహాకాలు అందిస్తోంది. పలాస డిపోలో ఆర్‌.ఆదినారాయణ, ఎస్‌ఎస్‌.చలం, ఎల్‌.ఈశ్వరరావు టాప్‌-3 డ్రైవర్లుగా గుర్తింపు పొందారు. ఇలా ప్రతి డిపోలోనూ పలువురు ప్రతిభ చూపుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఉత్తమ సేవలందించిన డ్రైవర్లను, ఉద్యోగులను ఆర్టీసీ ఎమ్‌డీ ద్వారకా తిరుమలరావు గురువారం శ్రీకాకుళంలో సత్కరించారు. ‘స్త్రీ శక్తి’ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో ఆర్టీసీ ఉద్యోగుల శ్రమ, అంకితభావమే నిదర్శనమంటూ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేలా ఆరు నెలలో కొత్తగా విద్యుత్‌ బస్సులు కూడా అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించారు. దీంతో డ్రైవర్లు ఊరట చెందుతున్నారు.

వైసీపీ పాలనలో నియామకాలు లేవు. కొత్త బస్సుల జాడలేదు. దీంతో జిల్లాలో కాలం చెల్లిన బస్సులే అధికంగా ఉన్నాయి. వాస్తవానికి 13 లక్షల కిలోమీటర్లు నడిపిన బస్సులను కాలం చెల్లినవిగా పరిగణిస్తారు. ప్రస్తుతం పల్లెవెలుగు సర్వీసుల బస్సులన్నీ ఇటువంటివే. వీటితో ప్రయాణం అటు డ్రైవర్లు, ఇటు ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోంది. మరోవైపు గోతుల రహదారుల కారణంగా డ్రైవర్లు విధి నిర్వహణలో అనారోగ్యానికి గురవుతున్నారు. ఇంకోవైపు ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానాలకు చేర్చాలనే క్రమంలో ఒత్తిడితో సతమతమవుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రహదారులను బాగుచేయడంతోపాటు.. కొత్త బస్సుల సైతం సమకూరుస్తుండడంతో డ్రైవర్లు కాస్త ఉపశమనం పొందుతున్నారు. అలాగే ఆరోగ్య పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడుతుండడంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పలువురు డ్రైవర్లు చెబుతున్నారు.

పాటించాల్సిన నియమాలు:

ఆర్టీసీ డ్రైవర్లు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. తగిన విశ్రాంతి తీసుకోవాలి. దురలవాట్లుకు దూరంగా ఉండాలి. మంచి ఆహారపు అలవాట్లు, సమయపాలన పాటించాలి. బస్సు నడిపేటప్పుడు సెల్‌ ఫోన్‌ వినియోగించకుండా డ్రైవింగ్‌పైన ధ్యాస పెట్టాలి. ట్రాఫిక్‌ నియమాలు పాటించాలి. మానసిక ఉద్రేకంతో వాహనాలు నడుపరాదు. పిల్లలు, వృద్ధులు, వికలాంగులు రోడ్డు దాటు సమయంలో వాహన వేగాన్ని తగ్గించాలి. బస్సును రోడ్డుకు ఎడమవైపు మాత్రమే నిలుపుదల చేయాలి. గుంతలు వద్ద బస్సు వేగాన్ని నియంత్రించి.. జాగ్రత్తగా నడపాలని నిపుణులు సూచిస్తున్నారు.

మెలకువలు పాటిస్తేనే..

పన్నెండేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. ఇప్పటివరకూ రాష్ట్రస్థాయిలో ఉత్తమ డ్రైవర్‌గా రెండుసార్లు అవార్డు అందుకున్నాను. పలాస డిపోకు సంబంధించి వరుసగా తొమ్మిదేళ్లపాటు కేఎంపీఎల్‌ సాధించి ఉత్తమ డ్రైవర్‌గా ప్రశంసలు పొందాను. గురువులు చెప్పిన మెలకువలు, డిపో మేనేజర్‌, ఇతర అధికారులు రోజు చేయిస్తున్న ప్రతిజ్ఞలు పాటిస్తే కేఎంపీఎస్‌ సాధించడంతోపాటు ప్రమాద రహితంగా బస్సును నడిపించడానికి అవకాశం ఉంటుంది.

- ఆర్‌.ఆదినారాయణ, రాష్ట్రస్థాయి ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్‌ అవార్డు గ్రహీత, పలాస

నిరంతరం అప్రమత్తం

ప్రమాదాలు లేకుండా, డ్రైవర్లకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా నిరంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ప్రతిరోజు జాబ్‌చార్ట్‌ ప్రకారం డ్రైవర్లకు అప్రమత్తం చేస్తుంటాం. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్పించడంలో డ్రైవర్లే కీలకం. డ్రైవర్ల ఆరోగ్యం కోసం వైద్యశిబిరాలు నిర్వహిస్తుంటాం. పిరియాడికల్‌ మెడికల్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా సహకారం అందిస్తుంటాం. - ఎం.శ్యామ్‌సుందరనాయుడు, ఆర్టీసీ డిపో మేనేజర్‌, పలాస

ఉపశమనం పొందాలి

డ్రైవర్లు తప్పనిసరిగా లైఫ్‌ బ్యాలెన్స్‌ పాటించి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలి. విధి నిర్వహణలో డ్రైవర్లకు గుండెపోటు, ఇతర మానసిక సమస్యలు రావడానికి ఇది కారణం కావచ్చు. డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు గాలి, వేడి ఒత్తిళ్ల కారణంగా డ్రైవర్లు డీహైడ్రేషన్‌కు గురవుతారు. తరచూ నీరు తాగుతూ దాని నుంచి ఉపశమనం పొందాలి. మానసిక ప్రశాంతత కోల్పోకుండా.. సురక్షిత ప్రయాణం సాగించాలి.

- డాక్టర్‌ టి.పాపినాయుడు, సూపరింటెండెంట్‌, పలాస ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి

Updated Date - Jan 24 , 2026 | 12:46 AM