ఇంటింటికీ తాగునీరు
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:12 AM
Jaljeevan work begins with Rs. 9 crore ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం వేదికగా హామీలిచ్చిన నేతలు.. వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు.
‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’ కార్యక్రమానికి స్పందన
రూ.9కోట్లతో జల్‌జీవన్ పనులకు శ్రీకారం
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, జూన్ 20(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం వేదికగా హామీలిచ్చిన నేతలు.. వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నరసన్నపేటలో ఇంటింటా కుళాయిల ద్వారా తాగునీరు అందించేందుకుగానూ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది మార్చి 15న నరసన్నపేట ఆర్‌అండ్‌బీ అతిఽథిగృహం ఆవరణలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో ‘అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా’ చర్చావేదికను నిర్వహించారు. అప్పట్లో హడ్కోకాలనీ, వంశధార కాలనీకు చెందిన పలువురు మహిళలు తమ సమస్యలను విన్నవించారు. ప్రధానంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హడ్కోకాలనీకు చెందిన అరుణ కోరారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హామీ ఇచ్చారు. ఈ మేరకు హడ్కోకాలనీ, వంశధార కాలనీలతోపాటు నరసన్నపేట ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. వంశధార నగర్‌లోని వంశధార సబ్‌డివిజన్ కార్యాలయం ప్రాంగణంలో జల్‌జీవన్ పథకం కింద రూ.9కోట్ల నిధులతో పనులకు శనివారం భూమిపూజ చేశారు.
ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ‘నరసన్నపేట ప్రజలకు త్వరలో ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేస్తాం. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేస్తాం. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. దశలవారీగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం. వంశధార కాలనీలో పాఠశాలకు అదనపు భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఈ ఏడాదిలో పాఠశాల భవనాల పనులు ప్రారంభిస్తామ’ని తెలిపారు.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బగ్గు అర్చన మాట్లాడుతూ ‘‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ప్రజావేదికలో వచ్చిన సమస్యలపై ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నిరంతరం కృషి చేస్తున్నారు. అందులో భాగంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కరం లభించింద’ని తెలిపారు. ఇంటింటా కుళాయిల నిర్మాణానికి పనులు ప్రారంభించడంతో తాగునీటి సమస్య పరిష్కారం కానుందని టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. హడ్కోకాలనీ, వంశధార కాలనీల్లో నిరంతరం పోలీసుల పర్యవేక్షణతో అసాంఘిక కార్యకలాపాలకు ‘ఆంధ్రజ్యోతి’ చర్చావేదిక అడ్డుకట్టు వేసిందన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ‘ఆంధ్రజ్యోతి’కి ధన్యవాదాలు తెలిపారు.