అందరూ ఉన్నా.. అనాథలా దూరమై..
ABN , Publish Date - Aug 28 , 2026 | 11:55 PM
Youngman dies in Vijayawada ఎలక్ర్టికల్ పనుల నిమిత్తం విజయవాడ వెళ్లి రెండురోజుల్లో వచ్చేస్తానన్నాడు. రెండు రోజులు కాదు పది రోజులైనా రాలేదు. ఫోన్‌లో కూడా అందుబాటులో లేడు. తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడు విజయవాడలో మృతి చెందినట్టు 13 రోజుల తర్వాత తల్లిదండ్రులకు తెలిసింది.
విజయవాడలో జిల్లావాసి మృతి
13 రోజుల తర్వాత కుటుంబీకులకు సమాచారం
ఫరీదుపేటలో విషాదచాయలు
ఎచ్చెర్ల రూరల్, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ఎలక్ర్టికల్ పనుల నిమిత్తం విజయవాడ వెళ్లి రెండురోజుల్లో వచ్చేస్తానన్నాడు. రెండు రోజులు కాదు పది రోజులైనా రాలేదు. ఫోన్‌లో కూడా అందుబాటులో లేడు. తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడు విజయవాడలో మృతి చెందినట్టు 13 రోజుల తర్వాత తల్లిదండ్రులకు తెలిసింది. అందరూ ఉన్నా.. తమ కుమారుడు అనాథలా దూరమయ్యాడని, చివరిచూపునకు కూడా తాము నోచుకోలేదని వారు భోరున విలపించారు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటకు చెందిన నవిరి అశోక్ కుమార్(27) ప్రైవేటు ఎలక్ర్టీషియన్‌గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు గణేష్, లక్ష్మి వ్యవసాయ కూలీలు. ఈ నెల 13న తాను స్నేహితుడితో కలిసి ఎలక్ర్టికల్ పనుల కోసం విజయవాడ వెళ్తున్నానని, రెండు రోజుల్లో వచ్చేస్తానని అశోక్‌కుమార్ తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఐదు రోజులైనా అశోక్ నుంచి ఫోన్ ద్వారా కూడా సమాచారం లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ నెల 19న ఎచ్చెర్ల పోలీసుస్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 13న ఆమదాలవలస రైల్వేస్టేషన్‌లో అశోక్ సంచరించినట్టు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ఎచ్చెర్ల పోలీసులు గుర్తించారు. మరోవైపు విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలో పోలీసుస్టేషన్‌ను ఎచ్చెర్ల పోలీసులతోపాటు అశోక్ కుటుంబ సభ్యులు గురువారం సంప్రదించారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలు రెండు దహనం చేశామని వారు తెలిపారు. ఆ ఫొటోలను పరిశీలించగా.. అందులో ఒకరు అశోక్‌గా గుర్తించారు. కాగా.. ‘ఈ నెల 15న విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం గుర్తించాం. ఆ వ్యక్తి మృతదేహంపై గాయాలు లేకపోవడంతో సహజ మరణంగా నిర్ధారించాం. ఎటువంటి వివరాలు లభ్యం కాకపోవడంతో అనాథగా భావించి.. కార్పొరేషన్ సిబ్బంది సహకారంతో మృతదేహానికి దహనం చేశామ’ని విజయవాడ పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ఈ సమాచారం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అందరూ ఉన్నా.. తమ కుమారుడ్ని అనాఽథలా సాగనంపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. చివరిచూపు సైతం తమకు దక్కలేదని రోదిస్తున్నారు. అశోక్ మృతిపై పోలీసులు దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనతో ఫరీదుపేటలో విషాదచాయలు అలుముకున్నాయి.