Share News

పట్టాలపై చెదిరిన కలలు

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:41 AM

అందరూ గిరిజన బిడ్డలు. అందరిదీ ఒకే కళాశాల. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం. కష్టాలను జయించి ఎదగాలని కలలు కన్నారు. తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలనుకున్నారు.

 పట్టాలపై చెదిరిన కలలు
జన్ని శరత్‌(ఫైల్‌), జన్ని దిలీప్‌(ఫైల్‌), సవర శివ(ఫైల్‌), విశాఖరావు (ఫైల్‌)

రైలు ఢీకొని నలుగురు విద్యార్థుల మృతి

మరొకరికి తీవ్రగాయాలు

అందరూ గిరిజన బిడ్డలే

గవర్నర్‌, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రుల దిగ్ర్భాంతి

అందరూ గిరిజన బిడ్డలు. అందరిదీ ఒకే కళాశాల. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం. కష్టాలను జయించి ఎదగాలని కలలు కన్నారు. తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలనుకున్నారు. తుఫాన్‌ పూట సెలవు.. వారి ఆశయాలను ఛిదిమేసింది. చేసింది. చేపల వేటకు వెళ్లొస్తూ పట్టాలపై నడుస్తున్న ఆ ఐదుగురు విద్యార్థులను రైలు ఢీకొట్టింది. అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు. కూలిపనులు చేస్తూ కట్టెలు అమ్ముకుంటూ రెక్కల కష్టం మీద బిడ్డలను చదివిస్తన్నారు. ‘నా బిడ్డ పెద్ద ఉద్యోగం చేసి కష్టాలు తీరుస్తాడు.. మమ్మల్ని బాగా చూసుకుంటాడు’ అని కలలు కన్నారు. ఒక్క రైలు ప్రమాదం వారి భవిష్యత్తును అంధకారం చేసింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది.

టెక్కలి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): టెక్కలి సమీపంలోని రావివలస జంక్షన్‌-బర్మా కాలనీ వద్ద రైలు ఢీకొని మండలంలోని మొఖలింగాపురం పంచాయతీ డమర గ్రామానికి చెందిన జన్ని దిలీప్‌(16), గంగువాడ విశాఖరావు(16), మేఘవరం పంచాయతీ చిన్నభీంపురం గ్రామానికి చెందిన జన్ని శరత్‌(16), మెళియాపుట్టికి చెందిన సవర శివ(16) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో డమర గ్రామానికి చెందిన జన్ని సాల్మన్‌రాజు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సాల్మన్‌రాజుకు రైలు ఇంజన్‌ తగిలీతగలడంతో పక్కకు తుల్లిపోగా చేయి, కాలు విరిగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సంఘటన జరిగిన వెంటనే సుమారు గంటన్నరకు పైగా రైలును అక్కడే పట్టాలపై నిలిపివేశారు. ట్రైన్‌ గార్డు నౌపడా రైల్వేస్టేషన్‌ అధికారులకు సమాచారం అందజేశాడు. గాయపడిన సాల్మాన్‌రాజును హుటాహుటిన 108 వాహనంపై జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యసేవలు కోసం ఆయన్ను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

అంతా గిరిజన యువకులే..

మృతులు దిలీప్‌, విశాఖరావు, శరత్‌, శివతో పాటు క్షతగాత్రుడు సాల్మాన్‌రాజు అంతా గిరిజన యువకులే. రెక్కాడితే డొక్కాడని కుటుం బాల నుంచి వచ్చిన వారే. పదో తరగతి నుంచి స్నేహితులు. తరగతి గదిలో, వసతి గృహంలో కలిసిమెలిసి ఉంటారు. ప్రస్తుతం వీరంతా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. సాల్మాన్‌రాజు ఒక్కడే టెక్కలిలో అద్దెకు గది తీసుకొని ఉంటుండగా, మిగతా నలుగురూ టెక్కలి ఎస్టీ బాలుర వసతి గృహంలో ఉంటున్నారు. ఇందులో విశాఖరావు, సాల్మాన్‌రాజు సొంత అన్నదమ్ములు. హాస్టల్‌కు వీరి స్వగ్రామాలకు 500 మీటర్ల దూరంలోపే ఉంటుంది. హాస్టల్‌లో చికెన్‌, గుడ్డు పెట్టిన రోజుల్లో మాత్రమే వారు ఇక్కడ భోజనం చేస్తారని, మిగిలిన దినాల్లో వారు అద్దెకు తీసుకుంటున్న నివాసంలో ఉంటారని వసతిగృహ సంక్షేమాధికారి సింగూరు సుదర్శనరావు తెలిపారు. దపదపాలుగా వారి నివాసానికి వెళ్లి పరిశీలించానని, వారికి సంబంధించిన కొందరు తల్లిదండ్రులు అక్కడే ఉండడంతో వారి అభ్యర్థన మేరకు యువకులు బయట నివాసంలో ఉంటున్నారని తెలిపారు.

చేపల వేటకు వెళ్లి..

తుఫాన్‌ కారణంగా అధికారులు బుధవారం కళాశాలకు సెలవు ఇచ్చారు. దీంతో దిలీప్‌, విశాఖరావు, శరత్‌, శివ, సాల్మాన్‌రాజు దోమతెర (వల), సంచి పట్టుకొని చేపల వేట కోసం రావివలస జంక్షన్‌-బర్మా కాలనీ చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ వారికి అరకొరగా ఇలుసులు(చేపలు) దొరకడంతో విసిగిపోయి తిరిగి ఇంటికి బయలుదేరారు. రైలు పట్టాలపై నడుస్తూ వస్తుండగా రాజ్యా-రాణి ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు వదిలారు. రైలు పట్టాల పక్కన దోమతెర, సంచి, రెండు చేపలు కనిపించాయి. ఈ ప్రాంతానికి కొందరు అడవిపందుల కోసం తరచూ వచ్చి వెళ్తుంటారని స్థానికులు చెబుతున్నారు. అలాగే ఈ గిరిజన యువకులు కూడా వర్షాల మూలంగా చేపలు లభ్యమవుతాయని ఈ ప్రాంతానికి వచ్చి ఉంటారని పలువురు భావిస్తున్నారు. వీరు చెవిలో ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకొని, గొడుగులు వేసుకుని ఉండడం, అదే సమయంలో జోరుగా వర్షం కురుస్తుండడంతో రైలు వచ్చిన విషయం గమనించక ప్రమాదానికి గురై ఉంటారని భావిస్తున్నారు.

ఘటనా స్థలానికి అధికారులు..

సంఘటనా స్థలానికి అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డీఎస్పీ లక్ష్మణరావు, సీఐ ఎ.విజయ్‌కుమార్‌, ఆర్‌పీఎఫ్‌ శ్రీకాకుళం సీఐ ఎ.కాంతారావు, జీఆర్పీ ఎస్‌ఐ శ్రీనివాసరావు సిబ్బందితో సహా అక్కడకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2.30గంటల సమయంలో సీఆర్‌ఎఫ్‌ రిలీవ్‌ వ్యాన్‌ చేరుకుంది. రైల్వే వైద్యులు అనూష, ఇతర సిబ్బంది అక్కడకు చేరుకొని అధికారులతో కలిసి మృతదేహాలను పరిశీలించారు. మధ్యాహ్నం 3.30 తరువాత టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు, స్నేహితులు, విద్యార్థులు ఆసుపత్రికి పెద్దఎత్తున చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణం ఒక్కసారిగా రోదనలతో మిన్నంటింది. బుధవారం రాత్రి పోస్టుమార్టం అనంతరం కుటుంబాలకు మృతదేహాలను అప్పగించారు. పలాస జీఆర్పీ ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

- మృతుల కుటుంబాలను టీడీపీ, బీజేపీ నాయకులు, గిరిజన సంఘాల ప్రతినిధులు పరామర్శించారు. మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఆదుకుంటామని వారు తెలిపారు.

బహిర్భూమికి వెళ్లి వస్తుండగా..

‘నేను బహిర్భూమికి రైలు పట్టాలపైకి వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. అనుకోకుండా ప్రమాదానికి గురయ్యాం.’అని క్షతగాత్రుడు సాల్మాన్‌రాజు చెబుతున్నాడు.

కేంద్ర, రాష్ట్ర మంత్రుల దిగ్ర్భాంతి

రైలు ఢీకొని నలుగురు యువకులు మృతిచెందడంతో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను రైల్వే, రెవెన్యూ, పోలీస్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుం బాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రుడికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Updated Date - Sep 24 , 2026 | 12:41 AM