Share News

DRC review: తాగునీరు కలుషితమైతే ఎందుకు గుర్తించలేదు?

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:18 AM

DRC review: శ్రీకాకుళం నగరంలో తాగునీరు కలుషితమైందని హెల్త్‌ సిబ్బంది చెప్పేంత వరకూ ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అధికారులను ప్రశ్నించారు.

DRC review: తాగునీరు కలుషితమైతే ఎందుకు గుర్తించలేదు?
మాట్లాడుతున్న మంత్రులు అచ్చెన్నాయుడు, శ్రీనివాస్‌, చిత్రంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- మెరుగైన వ్యవస్థ ఉండాల్సిందే

- జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

- ‘పూర్వోదయం’లో సాగునీటి ప్రాజెక్టులు

- మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

- మంత్రి అచ్చెన్నాయుడు

- డీఆర్సీలో సమస్యలు ఏకరువు పెట్టిన శాసనసభ్యులు

శ్రీకాకుళం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలో తాగునీరు కలుషితమైందని హెల్త్‌ సిబ్బంది చెప్పేంత వరకూ ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అధికారులను ప్రశ్నించారు. నీటిరంగు మారినా చూసుకోకుంటే ఎట్లా అని నిలదీశారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీనివాస్‌ అధ్యక్షతన బుధవారం జిల్లా సమీక్ష జరిగింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇటీవల శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడంపై మంత్రులు సంబంధిత అధికారులపై సీరియస్‌ అయ్యారు.

నీటి నాణ్యత పరీక్షలు చేపట్టాలి: ఇన్‌చార్జి మంత్రి శ్రీనివాస్‌

ఎప్పటికప్పుడు పట్టణాలు, పల్లెల్లో నీటి నాణ్యత పరీక్షలు చేపట్టాలి. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్‌ సమీక్ష జరపాలి. అవసరమైతే నియోజకవర్గాలవారీగా ప్రజాప్రతినిధుల సమక్షంలో రివ్యూ చేయాలి. గ్రావెల్‌ తరలింపులో వస్తున్న ఇబ్బందులపై తక్షణం స్పందించేలా కమిటీని నియమించాలి. ఇందులో ఇరిగేషన్‌, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులను నియమించాలి. కలుషితమవుతున్న చేపల చెరువుల్లో నీటి నాణ్యతను తక్షణమే మత్స్యశాఖ డీడీ పరీక్షించి నివేదిక ఇవ్వాలి. హార్టికల్చర్‌పై కూడా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలి.

డయేరియా ఘటనలు పునరావృతం కాకూడదు: మంత్రి అచ్చెన్నాయుడు

డయేరియా ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా అంతటా ఎత్తిపోతల పథకాల మరమ్మతులు, నిర్వహణ పదేళ్లపాటు ఏజెన్సీకి అప్పగిస్తోంది ప్రభుత్వం. త్వరలో టెండర్లు పిలుస్తాం. వంశధార రిజర్వాయర్‌లో కలిసిపోయిన ప్రాంతంలో చేపలచెరువులు సాగు చేయడంపై వంశధార ఎస్‌ఈ వెళ్లి.. స్వయంగా పరిశీలించాలి. వంశధార ప్రాజెక్టు గర్భంలో ప్రభుత్వానికి చెందిన భూమిలో ఉన్న చేపల చెరువులను తొలగించాలి. మొక్కజొన్నను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తాం. పౌరసరఫరా సంస్థ గోదాములు ఎందుకు ఖాళీగా ఉంచారన్నదీ జేసీ పరిశీలించాలి. ఉపాధిహామీ పథకం.. పేరు మారినా మంజూరైన పనులేవీ రద్దు కావు. ఇటీవలే వంశధార షట్టర్ల విషయమై ప్రత్యేకంగా చర్చించాను. సీఐడీ అధికారులను కూడా కలిశాను. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల వారీగా ఇరిగేషన్‌కు సంబంధించి ఓఅండ్‌ఎం కింద ప్రత్యేక పనులు కేటాయిస్తుంది ప్రభుత్వం. సోమవారం సాయంత్రం నాటికి జిల్లాలో అన్ని సాగునీటి కాలువల నుంచి నీటి సరఫరాను నిలిపివేసి పనులు చేపట్టాలి. జిల్లాలో ప్రతి ప్రాజెక్టును పరిరక్షించేందుకు అవసరమైన నిధుల గురించి ‘పూర్వో దయ’ కోసం ప్రతిపాదనలు పంపాలి. అత్యంత ప్రాధాన్యం తాగునీరు, సాగునీటికే.

వినతులను పరిష్కరించడంలేదు : కూన రవికుమార్‌, పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే, ఆమదాలవలస

గ్రీవెన్స్‌లో అందుతున్న వినతులను అధికారులు అసలు పరిష్కరించడంలేదు. నారాయణపురం కాలువలో పదేళ్ల నుంచి పనులే జరగలేదు. మండలాల్లో తాగునీటి బోర్ల మరమ్మతులకోసం క్రాష్‌ ప్రోగ్రాం కింద ఏ సామగ్రి కొనుగోలు చేశారో చూపించాలి. నగరపాలక సంస్థలో అధికారుల మధ్య సమన్వయం లేదు. వారం పాటు మున్సిపల్‌ కుళాయి నుంచి పచ్చగా నీరు వచ్చింది. అప్పుడు కూడా అధికారులు చూసుకోలేదు. జాయింట్‌ కలెక్టర్‌ శ్రీకాకుళానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వంశధార నిర్వాసితులకు గత ప్రభుత్వం రూ. లక్ష చొప్పున కొంతమందికి ఇచ్చి మరికొంతమంది అర్హులకు ఇవ్వలేదు. ఆ డబ్బులు కలెక్టర్‌ వద్దనే ఉన్నాయి. వంశధార 11 ఎల్‌ కింద ఏకంగా 32వేల ఎకరాలు సాగునీరు అందడంలేదు. భూసేకరణ విభాగం యూనిట్‌-4 ప్రత్యేక ఉపకలెక్టర్‌ ఎకరా కూడా కొనుగోలు చేయలేదు.

చేపల చెరువులతో రిజర్వాయర్‌ కలుషితం: మామిడి గోవిందరావు, ఎమ్మెల్యే, పాతపట్నం :

వంశధార ప్రాజెక్టు గర్భంలో కొంతమంది చేపల చెరువులు సాగుచేసి కోళ్లవ్యర్థాలు వేసేస్తున్నారు. దీంతో ఆ నీరు ప్రాజెక్టుల్లోకి చేరి కలుషితమవుతుంది. శ్రీకాకుళం మాదిరిగా పాతపట్నం, ఇచ్ఛాపురం, పలాస ప్రాంతాల్లో డయేరియా ప్రబలొచ్చు. దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాను. చర్యలు లేవు. ధర్మసాగరం చెరువును రూ. 32 లక్షలకు అభివృద్ధి చేసుకునేందుకు కాంట్రాక్ట్‌ దక్కించుకున్న వ్యక్తి.. ఇప్పుడు పనులు చేపట్టడంలేదు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.

గ్రావెల్‌ తరలిస్తే అడ్డంకులు: గౌతు శిరీష, ఎమ్మెల్యే, పలాస

గత ప్రభుత్వ హయాంలో పలాస నియోజకవర్గంలో ఇబ్బడిముబ్బడిగా కొండల తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు అన్ని చర్యలు తీసుకున్నాం. పోలీస్‌, రెవెన్యూ, మైనింగ్‌ అధికారుల మధ్య సమన్వయం ఉండట్లేదు. గ్రావెల్‌ సమస్యపై సామాన్యుడికి ఇబ్బంది లేకుండా అధికారులు పరిష్కారం చూపాలి. గత ప్రభుత్వం పలాస నియోజకవర్గంలో ఉపాధిహామీ క్షేత్రసహాయకులను తొలగించేశారు. ఇప్పుడు వారిని నియమించాలని వినతులు ఇచ్చినా చర్యలుండట్లేదు.

నగరపాలక సంస్థకు సరిపడా సిబ్బంది లేరు : గొండు శంకర్‌, ఎమ్మెల్యే, శ్రీకాకుళం.

నగరపాలక సంస్థలో పదేళ్ల నుంచి సరిపడా సిబ్బంది లేరు. ఇక్కడి డీఈని ఈఈగా ప్రమోషన్‌ ఇచ్చి విశాఖపట్నం పంపించారు. ఎలక్ట్రికల్‌ విభాగానికి, డ్రింకింగ్‌ విభాగానికి ఒకరే ఇంజనీరింగ్‌ అధికారి. ప్రజాఆరోగ్య విభాగానికి ఇంజనీర్‌లు లేరు. వంశధార, నాగావళి నదులు సముద్రంలో కలిసే చోట దిశలు మారి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాలి.

సుడా నుంచి రూపాయి కూడా ఖర్చుచేయట్లేదు : ఎన్‌.ఈశ్వరరావు, ఎమ్మెల్యే-ఎచ్చెర్ల

సుడా(శ్రీకాకుళం అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ)కి అత్యధికంగా రెవెన్యూ ఇచ్చింది మా నియోజకవర్గమే. నేను స్కూల్‌ నిర్మించాను. పన్నుల రూపంలో రూ. 45లక్షల పైబడి ‘సుడా’కు చెల్లించాను. పరిశ్రమలు అధికంగా ఉన్న పైడిభీమవరం నుంచి కూడా పన్నులు చెల్లించారు. కానీ వారు రూపాయి కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలేదు. అలాగే గ్రామాల్లో ఇళ్ల లబ్ధిదారులు కంకరు తీసుకువేళ్లేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. కంకర లేకుంటే ఇళ్ల నిర్మాణదారుల విషయమై ఏం చర్యలు తీసుకుంటారు..? దీనిపై సమగ్ర నిర్ణయం తీసుకోండి. ఇళ్ల నిర్మాణానికి కంకరు సమస్యలేకుండా చేయాలి.

Updated Date - Mar 19 , 2026 | 12:18 AM