‘డీపీఎన్’ రహదారికి మహర్దశ
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:00 AM
Rs 55.70 crore sanctioned for road widening జిల్లాలో అత్యంత కీలకమైన డోల- పోలాకి- నౌపడ(డీపీఎన్) రోడ్డు విస్తరణ, పటిష్టతకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఈ రహదారి అభివృద్ధికి సీఆర్‌ఐఎఫ్ పథకం కింద రూ.55.70 కోట్లతో పరిపాలనా అనుమతులిస్తూ రవాణా, రోడ్లు భవనాలశాఖ జీవో జారీ చేసింది.
రోడ్డు విస్తరణకు రూ.55.70కోట్లు మంజూరు
నరసన్నపేట, టెక్కలి నియోజవర్గాల ప్రజలకు ఊరట
నరసన్నపేట, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అత్యంత కీలకమైన డోల- పోలాకి- నౌపడ(డీపీఎన్) రోడ్డు విస్తరణ, పటిష్టతకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఈ రహదారి అభివృద్ధికి సీఆర్‌ఐఎఫ్ పథకం కింద రూ.55.70 కోట్లతో పరిపాలనా అనుమతులిస్తూ రవాణా, రోడ్లు భవనాలశాఖ జీవో జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ జీవో ఆర్టీనెంబరు 459ను విడుదల చేశారు. జిల్లాలోని నరసన్నపేట, టెక్కలి అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలోని డోల- పోలాకి- నౌపడ రోడ్డును రెండు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 33.20 కిలోమీటర్లు మేర రోడ్డును ఆధునికీకరించనున్నారు. నరసన్నపేట నియోజకవర్గ పరిధిలో కిలోమీటరు 0/0 నుంచి 17/0 వరకు మొత్తం 13 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ, పట్టిష్టత కోసం రూ.25.20 కోట్లు మంజూరయ్యాయి. టెక్కలి నియోజవర్గ పరిధిలో కిలోమీటర్ 17/0 నుంచి 37/20 వరకు మొత్తం 20.20 కిలోమీటర్లు మేరకు రోడ్డు విస్తరణ పనులకు కోసం రూ.30.50 కోట్లు కేటాయించారు. అలాగే సముద్రతీర గ్రామాలను అనుసంధానం చేయనున్నారు. కోస్టల్ కారిడార్ అభివృద్ధితోపాటు.. మూలపేట పోర్టు నుంచి రవాణాకు మార్గం సుగుమం అవుతుందని ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. ‘రవాణా సౌకర్యాల మెరుగుదలకు, దెబ్బతిన్న కీలక రహదారుల పునర్నిర్నాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. డోల-పోలాకి-నౌపడ రహదారి విస్తరణకుగానూ రూ.55.70 కోట్లు విడుదలయ్యాయి. రెండు విడతల్లో పనులు పూర్తిచేస్తామ’ని తెలిపారు.