Share News

చిన్న పరిశ్రమలకు ‘డబుల్‌’ బూస్ట్‌

ABN , Publish Date - May 25 , 2026 | 11:59 PM

Up to 90 percent subsidy for projects జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి, స్థానిక యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘డబుల్‌ బూస్టర్‌ డోస్‌’ ప్రకటించింది. పారిశ్రామికాభివృద్ధి, ఉమ్మడి మౌలిక సదుపాయాల కల్పన కోసం ‘ఆంధ్రప్రదేశ్‌ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఏపీ-సీడీపీ) మార్గదర్శకాలను విడుదల చేసింది.

చిన్న పరిశ్రమలకు ‘డబుల్‌’ బూస్ట్‌

  • మౌలిక వసతులకు ‘క్లస్టర్‌’ డెవలప్‌మెంట్‌

  • నిధుల సమీకరణకు ‘షేర్‌ మార్కెట్‌’ దన్ను

  • ఏపీ-సీడీపీ, ఏపీ ఎస్‌ఎంఈ ఎక్స్చేంజ్‌ మార్గదర్శకాలు విడుదల

  • ప్రాజెక్టులకు 90 శాతం వరకు రాయితీ

  • నియోజకవర్గానికో ఎంఎస్‌ఎంఈ పార్క్‌..

  • కొత్త పరిశ్రమలకు ఊతం

  • జీడిపప్పు, జూట్‌, కొబ్బరిపీచు రంగాలకు మహర్దశ

  • శ్రీకాకుళం, మే 25(ఆంధ్రజ్యోతి):

    జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి, స్థానిక యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘డబుల్‌ బూస్టర్‌ డోస్‌’ ప్రకటించింది. పారిశ్రామికాభివృద్ధి, ఉమ్మడి మౌలిక సదుపాయాల కల్పన కోసం ‘ఆంధ్రప్రదేశ్‌ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఏపీ-సీడీపీ) మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతోపాటు.. పరిశ్రమల విస్తరణలో నిధుల కొరతను అధిగమించేలా ఏపీ ఎస్‌ఎంఈ ఎక్స్ఛేంజ్‌ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ జీవో 116, 117లను జారీ చేసింది. ఈ రెండు నిర్ణయాలతో జిల్లాలో జీడిపప్పు, కొబ్బరిపీచు, జూట్‌, పొందూరు ఖాదీ లాంటి వస్త్ర, కలప ఆధారిత తయారీ రంగాలకు భారీ మేలు జరగనుంది.

  • మౌలిక వసతులకు ‘క్టస్టర్‌’ ఊతం..

  • రాష్ట్రవ్యాప్తంగా 45 ఎంఎస్‌ఎంఈ కామన్‌ ఫెసిలిటీ సెంటర్లను(సీఎఫ్‌సీ) రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఈ క్లస్టర్లలో ఒక్కో సెంటర్‌ ఏర్పాటుకు గరిష్టంగా రూ.10 కోట్ల వరకు ప్రాజెక్టు వ్యయాన్ని అనుమతిస్తారు. ఇందులో రూ.5 కోట్ల ప్రాజెక్టుకు జనరల్‌ కేటగిరీ కింద 80శాతం, స్పెషల్‌ కేటగిరీ (మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతానికి పైగా భాగస్వామ్యం ఉంటే) కింద ఏకంగా 90 శాతం మేర ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తుంది. తయారీ రంగంలో ఉన్న కనీసం 10 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు కలిసి ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)గా ఏర్పడితే చాలు.. ఆధునిక యంత్రాలు, టెస్టింగ్‌ ల్యాబ్‌లు, కోల్డ్‌స్టోరేజీలు, ప్యాకేజింగ్‌ కేంద్రాలు తదితర ఉమ్మడి వసతులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎఫ్‌పీవోలు, స్వయం సహాయక సంఘాలు కూడా ఇందులో భాగస్వాములు కావచ్చు.

  • పెట్టుబడులకు ‘షేర్‌ మార్కెట్‌’ దన్ను..

  • జిల్లాలో ఎంఎస్‌ఎంఈ రంగం ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. అయితే, బ్యాంకులు అడిగే కఠినమైన పూచీకత్తు నిబంధనల వల్ల కేవలం 14 నుంచి 16 శాతం పరిశ్రమలు మాత్రమే అధికారికంగా రుణాలు పొందగలుగుతున్నాయి. ఈ మూలధన కష్టాలను తీర్చేందుకు నేరుగా ఈక్విటీ మార్కెట్‌(షేర్‌ మార్కెట్‌) ద్వారా నిధులను సమీకరించుకునేలా ప్రభుత్వం అవశాకం కల్పిస్తోంది. ‘ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఎంఈ ఎక్స్ఛేంజ్‌’ ఏర్పాటు ఆవశ్యకతను పరిశీలించడానికి, జిల్లాలోని చిన్న పరిశ్రమలు సైతం ఐపీఓలకు వెళ్లేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఆర్బీఐ, సెబీ, సిడ్బీ తదితర సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

  • నియోజవర్గానికో పార్కు

  • జిల్లాలో పారిశ్రామిక వాతావరణాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 175 పార్కులను అభివృద్ధి చేసే ప్రాజెక్టు ఇప్పటికే అమల్లో ఉంది. కొత్తగా వచ్చే క్లస్టర్లకు ఈ పార్కుల్లోనే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీనికితోడు నూతన తయారీ రంగాలను ప్రోత్సహించేందుకు రూ.300 కోట్లతో ‘ముఖ్యమంత్రి ఎంటర్‌పెన్యూర్‌ ప్రోగ్రామ్‌’ను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా రాబోయే 4 ఏళ్లలో 3,520 కొత్త సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. మౌలిక వసతులు, భారీ రాయితీలకు తోడుగా ఇప్పుడు ఏపీ ఎక్స్ఛేంజ్‌ ద్వారా ఐపీఓ సదుపాయం కూడా అందుబాటులోకి రానుండటంతో జిల్లా పారిశ్రామిక ముఖచిత్రం మారనుంది. ఆసక్తి ఉన్న స్థానిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఏకమై ఒక సమగ్ర ప్రాజెక్టు నివేదికతో ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలకు జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని సంప్రదించాలని చెబుతున్నారు.

Updated Date - May 25 , 2026 | 11:59 PM