Share News

తొక్కేకదాని.. తీసిపారేయొద్దు

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:10 AM

Cashew nuts are priced at Rs. 15 per kg జీడితొక్క కేవలం వంట సరుకుగానే వినియోగమయ్యేది. అది కూడా వ్యాపారులు హోటల్స్‌కు ఉచితంగానే ఇచ్చేవారు. కొన్నాళ్ల కిందట జీడి ఆయిల్‌ పరిశ్రమలు నెలకొల్పడంతో జీడితొక్కను కిలో రూ.3కు విక్రయించేవారు. ప్రస్తుతం ఇరాన్‌-ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధ ప్రభావంతో కిలో జీడితొక్క రూ.15కి పెరిగింది.

తొక్కేకదాని.. తీసిపారేయొద్దు
ఆయిల్‌ మిల్లుకు వాహనంలో తరలిస్తున్న జీడితొక్క బస్తాలు

జీడితొక్కకు టైమొచ్చింది

కిలో రూ.15 చొప్పున విక్రయాలు

యుద్ధ ప్రభావంతో జీడి ఆయిల్‌కు డిమాండ్‌

పలాస, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): జీడితొక్క కేవలం వంట సరుకుగానే వినియోగమయ్యేది. అది కూడా వ్యాపారులు హోటల్స్‌కు ఉచితంగానే ఇచ్చేవారు. కొన్నాళ్ల కిందట జీడి ఆయిల్‌ పరిశ్రమలు నెలకొల్పడంతో జీడితొక్కను కిలో రూ.3కు విక్రయించేవారు. ప్రస్తుతం ఇరాన్‌-ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధ ప్రభావంతో కిలో జీడితొక్క రూ.15కి పెరిగింది. దీంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఎందుకూ పనికిరాని సరుకు.. నేడు ఆదాయవనరుగా మారిందని సంబరపడుతున్నారు.

పలాస-కాశీబుగ్గలో జీడి పరిశ్రమలు ఏర్పడిన తర్వాత జీడితొక్క సమస్య ఎక్కువగా ఉండేది. దీన్ని నిల్వ చేయడానికి స్థలాలు లేక గతంలో డంపింగ్‌ యార్డుల్లో, చెరువుగట్లు వద్ద పారబోసేవారు. బాయిలింగ్‌ యూనిట్లు ప్రారంభమైన తర్వాత జీడి తొక్క కర్నాటక, కేరళ, గోవా వంటి రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేది. జీడితొక్క నుంచి ఆయిల్‌ వివిధ రూపాల్లో వస్తుంది. దీని నిర్వహణ తెలియకపోవడంతో ఇతర రాష్ట్రాలకు కిలో రూ.3 చొప్పున వ్యాపారులు విక్రయించేవారు. కొన్నేళ్ల కిందట పలాస మార్కెట్‌లో జీడి ఆయిల్‌ పరిశ్రమలు నెలకొల్పారు. ప్రస్తుతం ఆరు పరిశ్రమలు ఉన్నాయి. ప్రతిరోజు ఐదువేల బస్తాల (50 కిలోల పరిమాణం) తొక్క ఇక్కడ వస్తుంది. దీంతోపాటు ఒడిశాలో కూడా 15 జీడి ఆయిల్‌ పరిశ్రమలు ఉన్నాయి. ఆంధ్ర, ఒడిసాలో లభించే జీడితొక్క మొత్తం పరిశ్రమల నిర్వహణకు సరిపడుతుంది. ఇదిలా ఉండగా ఇరాన్‌-ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం ప్రభావంతో జీడిఆయిల్‌కు డిమాండ్‌ పెరిగింది. జీడిఆయిల్‌ ఎగుమతులు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో జీడితొక్క ధర ప్రస్తుతం కిలో రూ.15వరకూ పలుకుతోంది. జీడి ఆయిల్‌ను ఎక్కువగా ఓడల తయారీలో వినియోగిస్తారు. దీంతోపాటు ఇతర పరిశ్రమలకు కూడా వినియోగపడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం జీడితొక్క ధర పెరగడంతో వ్యాపారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొక్కను గోనెసంచిల్లో భద్రపరిచి విక్రయిస్తున్నారు. జీడిచెట్టు నుంచి కేవలం జీడి పిక్కలు, అందులో పప్పు మాత్రమే వినియోగపడేది. ప్రస్తుతం కొబ్బరి చెట్టు వలె జీడిచెట్టు కూడా మొత్తం ఆదాయ వనరుగా మారడం విశేషం.

Updated Date - Apr 18 , 2026 | 12:10 AM